Romancham Review: రివ్యూ: రోమాంచమ్.. ఆత్మను పిలిచిన స్నేహితుల పరిస్థితేంటి?

మలయాళంలో హిట్‌ అందుకున్న ‘రోమాంచమ్‌’ (Romancham) సినిమా ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఎలా ఉందంటే?

Published : 07 Apr 2023 17:46 IST

Romancham Review చిత్రం: రోమాంచమ్‌; నటులు: సౌబిన్‌ షాహిర్‌, అనంతరామన్‌, షాజిన్‌ గోపు, సిజు సన్నీ, అఫ్జల్‌ పి.హెచ్‌, జగదీష్‌ కుమార్‌, అర్జున్‌ అశోకన్‌ తదితరులు; సంగీతం: సుశిన్‌ శ్యామ్‌; ఎడిటింగ్‌: కిరణ్‌దాస్‌; సినిమాటోగ్రఫీ: షాను తాహిర్‌; రచన, దర్శకత్వం: జీతూ మాధవన్‌; నిర్మాతలు: జాన్‌పాల్‌ జార్జ్‌, గిరీశ్‌ గంగాధరన్‌, చెంబన్‌ వినోద్‌ జోస్‌; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: డిస్నీ+ హాట్‌స్టార్‌.

ఓ భాషలో హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్న సినిమాలు మరో భాషలోకి ‘రీమేక్‌’ అవుతుంటాయి. ఇంకొన్ని ‘డబ్బింగ్‌’తో సందడి చేస్తాయి. ఆ డబ్బింగ్‌ల్లో కొన్ని థియేటర్లలోకి వస్తే మరికొన్ని ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలా ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో శుక్రవారం విడుదలైన మలయాళ చిత్రం ‘రోమాంచమ్‌’ (Romancham). మరి, ఆ కథేంటి? ఆ టైటిల్‌ అర్థమేంటి? తెలుసుకోవాలనుందా (Romancham Review)..?

ఇదీ కథ: జీవన్, నీరజ్‌, హరి, రవి.. ఇలా ఏడుగురు స్నేహితులు బెంగళూరులోని ఓ ఇంట్లో కలిసి నివసిస్తుంటారు. ఒక్కొక్కరిది ఒక్కో వృత్తి. ఎప్పుడూ ఖాళీగా ఉండే జీవన్‌ (సౌబిన్‌ షాహిర్‌) అప్పుడప్పుడు వేరే ఫ్రెండ్స్‌ రూమ్‌కి వెళ్లి, అక్కడుండే ఓయిజా బోర్డు గురించి తెలుసుకుంటాడు. మిత్రుల్ని సర్‌ప్రైజ్‌ చేయాలనుకుని తాను నివాసం ఉండే ఇంట్లోనూ ఆ బోర్డు ద్వారా ఆత్మను రప్పించే ప్రయత్నం చేస్తాడు. దాన్ని చూసిన జీవన్‌ గ్యాంగ్‌ షాక్‌ అవుతుంది. తమ ఇంట్లోకి దెయ్యం వచ్చిందంటూ భయానికి గురవుతుంది. ఆత్మ రాకతో ఆ స్నేహితులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? అనామిక అని చెప్పే ఆ ఆత్మ ఎవరిది? అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది (Romancham Review).

ఎలా ఉందంటే?: కామెడీ, హారర్‌.. రెండూ పూర్తి భిన్నమైన నేపథ్యాలేగానీ వాటిని కలిపితే మంచి వినోదం పండుతుంది. ఆ విషయాన్ని ఇప్పటికే ఎన్నో చిత్రాలు నిరూపించాయి. ఆ కోవకు చెందిందే ఈ ‘రోమాంచమ్‌’. ఓయిజా బోర్డుతో ఆట ఆడడం వల్ల 2007లో బెంగళూరులోని ఓ ఇంట్లో ఉన్న ఏడుగురు స్నేహితులు ఎలాంటి సమస్యల్లో చిక్కుకున్నారనేదే ఈ సినిమా సారాంశం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండే ప్రధాన పాత్ర జీవన్‌.. అక్కడి నర్సుతో తనకేమైందో చెప్పే సన్నివేశంతో ప్రారంభమైన సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగుతుంది. చిన్న ఇంట్లో ఏడుగురు వ్యక్తులు నివాసం ఉండడం, చిన్న చిన్న ఘర్షణలు చోటుచేసుకున్నా వెంటనే కలిసిపోవడం.. ఇలా ఎంతోమందికి బాగా కనెక్ట్‌ అయ్యే అంశాలతో దాదాపు ప్రథమార్ధాన్ని నడిపిన దర్శకుడు ఓయిజా బోర్డు కాన్సెప్ట్‌ని పరిచయం చేస్తూ ద్వితీయార్ధంపై ఉత్సుకత పెంచాడు. క్యారమ్‌ బోర్డు గేమ్‌లానే నలుగురు వ్యక్తులు నాలుగు దిక్కుల్లో కూర్చుని.. ఆ బోర్డుపై గాజు గ్లాస్‌ పెట్టి ప్రార్థిస్తే ఆత్మలొస్తాయనేది ఆ కాన్సెప్ట్‌. ఆ బోర్డు కొనలేక తమ దగ్గరున్న క్యారమ్‌ బోర్డుపైనే ఆ గేమ్‌ని ఆడే సమయంలో జీవన్‌ బ్యాచ్‌ చేసే కామెడీ అంతా ఇంతా కాదు. ఆత్మ తమ ఇంట్లోకి వచ్చిందని తెలిసిన తర్వాత భయపడుతూనే ప్రతిపాత్రా ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది. అయితే, ఆత్మ ఏది అడిగినా చెబుతుందని తెలుసుకున్న చుట్టుపక్కల వారంతా వచ్చి తమ సమస్యలకు పరిష్కారం చూపమని విన్నవించుకోవడాన్ని చూస్తే అతిశయోక్తిలా ఉంటుంది. బంగారం పోయిందని ఒకరు.. కాబోయే భార్య పేరు చెప్పమని ఇంకొందరు అడగడం, దైవ దర్శనానికి వెళ్లినట్టు క్యూలో నిలబడడం తదితర సన్నివేశాలు సిల్లీగా అనిపిస్తాయి.

‘ఆత్మల సబ్జెక్ట్‌ అయినా అంత ఉత్కంఠ కలగట్లేదే!’ అని అనుకునేలోపు ఊహించని ట్విస్ట్‌ ఎదురవుతుంది. జీవన్‌కు స్నేహితుడైన శ్రీను (అర్జున్‌ అశోకన్‌) ఎంట్రీతో కథ కొత్త మలుపు తిరుగుతుంది. ఓయిజా బోర్డు ఊసే తెలియని శ్రీనుకి అనామిక (ఆత్మ)కు ఏదో సంబంధం ఉన్నట్టు దర్శకుడు చిత్రీకరించిన తీరు మెప్పిస్తుంది. క్లైమాక్స్‌లో ఆ క్యారెక్టర్‌ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి పార్ట్‌ 2 ఉందని చెప్పడం.. ఏ ఆస్పత్రి బెడ్‌ సీన్‌తో అయితే సినిమా ప్రారంభమైందో అదే చోట ముగియడం వావ్‌ అనిపిస్తుంది (Romancham Review). ఇంతకీ ‘రోమాంచమ్‌’ అంటే ఏంటో చెప్పలేదనుకుంటున్నారా..? ఇంగ్లిష్‌లో గూస్‌బమ్స్‌. తెలుగులో రోమాలు నిక్కబొడుచుకోవడం. దర్శకుడు ఓ పాత్రధారితో టైటిల్‌కు జస్టిఫికేషన్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ, ఆత్మ/ దెయ్యం నేపథ్యాన్ని ఇంకాస్త ఎంగేజింగ్‌గా చూపించుంటే బాగుండేది. కొనసాగింపు చిత్రంలో ఆ లోటును భర్తీ చేస్తారేమో!

ఎవరెలా చేశారంటే?: సౌబిన్‌ షాహిర్‌ మినహా మిలిగిన వారంతా తెలుగు ప్రేక్షకులకు కొత్తే. నయనతార ‘గోల్డ్‌’, మమ్ముట్టి ‘బ్రో డాడీ’ తదితర డబ్బింగ్‌ చిత్రాలతో అలరించిన షాహిర్‌.. ఇందులోని జీవన్‌ పాత్రకు పర్‌ఫెక్ట్‌గా మ్యాచ్‌ అయ్యాడు. హాస్యం, భావోద్వేగం నిండిన ఆ క్యారెక్టర్‌కు తగిన న్యాయం చేశాడు. మరో ప్రధానమైన పాత్ర నీరజ్‌. చెడు అలవాట్లు మాన్పించి, ఒక్కొక్కరికి ఇంట్లో ఒక్కో పని అప్పజెప్పి వారిలో మార్పు తీసుకొచ్చే నీరజ్‌ రోల్‌లో సజిన్‌ గోపు ఒదిగిపోయాడు. శ్రీనుగా కనిపించిన అర్జున్‌ అశోకన్‌ హావభావాలు సరికొత్తగా ఉంటాయి. ఈ మూడు పాత్రలకు ఎక్కువ స్కోప్‌ ఉంది. మిగిలిన వారంతా తమ తమ పాత్రలతో ఆకట్టుకుంటారు. నేపథ్య సంగీతం, ఛాయాగ్రహణం, ఎడిటింగ్‌, దర్శకత్వం.. ఇలా ప్రతి విభాగం వారు అద్భుతమ ప్రతిభ చూపారు (Romancham Review).

బలాలు: + కథ, కథనం; + సౌబిన్‌ షాహిర్‌, సజిన్‌ గోపు నటన; + ట్విస్ట్‌ ఇచ్చే శ్రీను పాత్ర

బలహీనతలు: - ప్రథమార్ధంలో ఆత్మను ప్రశ్నించే తీరు

చివరిగా: పేరులో ఉన్నంత హారర్‌ లేదుగానీ బోలెడంత కామెడీ ఉంది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని