Rorschach review: రివ్యూ: రోషాక్.. మమ్ముట్టి నటించిన సినిమా ఎలా ఉందంటే?
ప్రముఖ నటుడు మమ్ముట్టి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ‘రోషాక్’ ఎలా ఉందంటే..?
Rorschach Review చిత్రం: రోషాక్, నటీనటులు: మమ్ముట్టి, జగదీష్, గ్రేస్ ఆంటోనీ, కొట్టాయం నజీర్ తదితరులు, రచన: సమీర్ అబ్దుల్, ఛాయాగ్రహణం: నిమిష్ రవి, సంగీతం: మిథున్ ముకుందన్, కూర్పు: కిరణ్ దాస్, నిర్మాణ సంస్థ: మమ్ముట్టి కంపెనీ, దర్శకత్వం: నిషమ్ బషీర్, ఓటీటీ వేదిక: డిస్నీ+ హాట్‌స్టార్.
ఓ భాషలో తెరకెక్కి విజయం అందుకున్న కొన్ని చిత్రాలు ఇతర భాషల్లోకి డబ్ అయి మరోసారి థియేటర్లలో విడుదవుతుంటాయి. మరికొన్ని.. ఓటీటీ వేదికగా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకొస్తుంటాయి. అలా అక్టోబరు 7న మలయాళంలో థియేటర్లలో విడుదలైన ‘రోషాక్’ (Rorschash) చిత్రం నవంబరు 11 నుంచి ‘డిస్నీ+ హాట్‌స్టార్’ (Disney+hotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్ర పోషించిన సినిమా ఇది. మలయాళ ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా కథేంటంటే?
ఇదీ కథ: లూక్ ఆంటోనీ (మమ్ముట్టి) ఓ ఎన్. ఆర్. ఐ. విహారయాత్రలో భాగంగా భార్యతో కలిసి కేరళకు వస్తాడు. అడవి మార్గంలో వాళ్ల కారు ప్రమాదానికి గురవుతుంది. కాసేపటికి స్పృహలోకి వచ్చిన ఆంటోనీకి తన భార్య ఎక్కడుందో కనిపించదు. దాంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. కేసు విచారణలో పోలీసులకు ఎలాంటి ఆధారాలూ లభించవు. వాళ్ల ప్రయత్నం విఫలంకావడంతో స్వయంగా ఆంటోనీనే తన భార్య ఆచూకీ వెతికేందుకు నిర్ణయించుకుంటాడు. అడవి నుంచి బయటకు రానని భీష్మించుకుని కూర్చొంటాడు. అతడి ప్రవర్తనపై పోలీసులకూ అనుమానం కలుగుతుంది. ఆంటోనీ రాకతో సమీప గ్రామంలో ఎన్నో ఘాతుకాలు జరిగాయని చాలామంది భావిస్తారు. అసలు అతనికి భార్య ఉందా? అనే ఆలోచనకు వస్తారు. మరి, ఆంటోనీ కేరళ ఎందుకు వచ్చాడు? అంతా అనుకున్నట్టు ఆయనకు భార్య లేదా? అనే విషయాలను తెరపై చూసి తెలుసుకుంటేనే మజా వస్తుంది.
ఎలా ఉందంటే: ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. భార్య కనిపించడంలేదంటూ హీరో పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసే సన్నివేశంతో సినిమా ప్రారంభవుతుంది. ఫస్ట్ షాట్ ఆసక్తిగా అనిపించినా అసలు కథను చెప్పేందుకు దర్శకుడు చాలా సమయం తీసుకున్నారు. ఈ క్రమంలో వచ్చే సీక్వెన్స్ బోరింగ్‌గా అనిపిస్తుంది. మనిషి తనకు బాగా కావాల్సిన దాన్ని కోల్పోతే ఎంత బాధపడతాడో, దానికి కారణమైన వారిపై ఎంతటి పగ పెంచుకుంటాడో ఈ కథ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు సమీర్ అబ్దుల్. దాన్ని తెరపైకి తీసుకురావడంలో దర్శకుడు కాస్త తడబడ్డారు. కథానాయకుడిలోని పలు పార్శ్వాలను చూపించే క్రమంలో కథలో స్పష్టతలోపించింది.
అడవిలోని ఓ ఇల్లును హీరో కొనుక్కుంటాడు. ఆ ఇంటి యజమాని డబ్బు తీసుకుని వెళ్తుండగా హత్యకు గురవుతాడు. హీరోనే ఆ హత్య చేశాడా? అని ప్రేక్షకుడు భావించేలోపు హీరో కాదా? ఇంకెవరో ఆ మర్డర్ చేశారా? అనే ఉత్కంఠ కలుగుతుంది. ఇలాంటి సన్నివేశాలు సినిమాలో చాలానే ఉన్నాయి. అయితే, జరిగిన దాన్ని రెండు కోణాల్లో ఆవిష్కరించడం వల్ల ఆయా సీన్లు అందరికీ అర్థంకావు. ప్రథమార్ధం, ద్వితీయార్ధంలోనూ ప్రేక్షకుల ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. క్లైమాక్స్ విషయంలోనూ అంతగా సంతృప్తి ఉండదు. సీక్వెల్ ప్లాన్ చేసే క్రమంలో పలు చిక్కులు ముడులను ఈ సినిమాలో విప్పలేదనుకోవచ్చు. 1950ల్లో ప్రముఖ సైకో అనలిస్ట్ హెర్మన్ రోషాన్.. మనుషులు ఎలా ఆలోచిస్తారు? ఎలా ప్రభావితం అవుతారు? అనే అంశాలపై పరీక్ష చేశారు. దాన్ని ఆధారంగా చేసుకుని సినిమాని తీయడమంటే అంత సులువైన విషయం కాదు. ఈ విషయంలో దర్శకరచయితలకు మంచి మార్కులు పడతాయి.
ఎవరెలా చేశారంటే: ఇది మమ్ముట్టి వన్‌మ్యాన్ షో. స్టార్ హీరో ఇలాంటి పాత్రలో కనిపించడం విశేషం. లూక్ ఆంటోనీ పాత్రలో ఒదిగిపోయారు. ఇన్‌స్పెక్టర్ ఇన్‌ష్రాఫ్‌గా జగదీష్, భర్తను కోల్పోయిన సుజాత పాత్రలో గ్రేస్ ఆంటోనీ, ఇల్లు అమ్మే వ్యక్తి.. బాలన్ పాత్రలో మణి షార్నుర్ చక్కగా నటించారు. సందర్భానుసారం వచ్చే కానిస్టేబుల్, నర్సు, బాలన్ కుటుంబ సభ్యుల పాత్రలూ ఆకట్టుకుంటాయి. మిథున్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. బీజీఎంతో ఆయా సన్నివేశాలను ఆయన మరోస్థాయికి తీసుకెళ్లారు. నిమిష్ రవి సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. కిరణ్ దాస్ ఈ చిత్రాన్ని ఇంకా ఎడిట్ చేస్తే బాగుండేది. బషీర్ టేకింగ్ కొత్తగా ఉంది.
బలాలు
+ మమ్ముట్టి నటన
+ సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం
బలహీనతలు
- కథలో వేగంలేకపోవడం
- తికమక పెట్టే మలుపులు
చివరగా: రోషాక్.. కొందరికి మాత్రమే నచ్చే ‘సైకలాజికల్ థ్రిల్లర్’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ayodhya: సాలగ్రామమై అవతరించిన శ్రీమహావిష్ణవు.. అయోధ్యకు చేరుకున్న వేళ..
-
Politics News
Pawan kalyan: ఫోన్ ట్యాపింగ్.. ప్రాణభయంతో వైకాపా ఎమ్మెల్యేలు: పవన్ కల్యాణ్
-
Sports News
IND vs AUS: అలాంటి వికెట్లు తయారు చేయండి.. ఆసీస్ తప్పకుండా గెలుస్తుంది: ఇయాన్ హీలీ
-
World News
టికెట్ అడిగారని.. చంటి బిడ్డను ఎయిర్‌పోర్టులో వదిలేసిన జంట..
-
India News
SJM: సంపన్నులకు పన్ను రాయితీ కాదు.. వారి పాస్‌పోర్టులు రద్దు చేయాలి : ఎస్జేఎం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు