NTR: ‘ప్రేమదేశం’ చూసిన అనుభూతి కలిగింది

‘‘మంచి సినిమాల్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు... కొత్త ప్రతిభనీ ప్రోత్సహిస్తార’’న్నారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌. ఆయన శనివారం ‘రౌడీబాయ్స్‌’ ట్రైలర్‌ని విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్‌ నాయిక. విక్రమ్‌ ముఖ్యభూమిక పోషించారు

Updated : 09 Jan 2022 06:58 IST

- ఎన్టీఆర్‌

‘‘మంచి సినిమాల్ని ఆదరించే తెలుగు ప్రేక్షకులు... కొత్త ప్రతిభనీ ప్రోత్సహిస్తార’’న్నారు ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌. ఆయన శనివారం ‘రౌడీబాయ్స్‌’ ట్రైలర్‌ని విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రమిది. అనుపమ పరమేశ్వరన్‌ నాయిక. విక్రమ్‌ ముఖ్యభూమిక పోషించారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘ఏముందిరా ఈ కాలేజ్‌లో...’ అంటూ మొదలయ్యే ట్రైలర్‌లో పోరాట ఘట్టాలు, నాయకానాయికల మధ్య సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. కాలేజీ నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాగా రూపొందిన చిత్రమని స్పష్టమవుతోంది. ట్రైలర్‌ విడుదల అనంతరం ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ‘‘నా సినిమా ‘ఆది’  సమయంలో దిల్‌రాజు, శిరీష్‌లతో అనుబంధం ఏర్పడింది. శిరీషన్న తనయుడు ఆశిష్‌ హీరోగా పరిచయం అవుతుండడం, ఆ ట్రైలర్‌ని నేను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆశిష్‌ ఎన్నో మంచి చిత్రాల్లో భాగం కావాలని కోరుకుంటున్నా. ‘రౌడీబాయ్స్‌’ ఓ మంచి చిత్రంగా గుర్తుండిపోవాలి. ట్రైలర్‌ చూస్తున్నప్పుడు ‘ప్రేమదేశం’ చూసిన అనుభూతి కలిగింది. నాకే కాదు, అందరికీ అలాంటి అనుభూతినే పంచుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘యువతరంతోపాటు అన్ని వర్గాలకీ నచ్చే  చిత్రమిది. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలకి, పాటలకి చక్కటి స్పందన లభించింద’’న్నారు. ఈ కార్యక్రమంలో హర్షిత్‌రెడ్డి, దర్శకనిర్మాతలు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని