Corona: ఉద్వేగానికి లోనైన ఆర్పీ పట్నాయక్‌

కొవిడ్‌ వల్ల దేశంలో పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ అన్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతిఒక్కరూ...

Updated : 06 May 2021 12:11 IST

వైరల్‌గా మారిన వీడియో

హైదరాబాద్‌: కొవిడ్‌ వల్ల దేశంలో పరిస్థితులు రోజురోజుకీ దిగజారిపోతున్నాయని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌ అన్నారు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ప్రతిఒక్కరూ కొన్నిరోజులపాటు ఇళ్లలోనే ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. కొవిడ్‌ పరిస్థితుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తాజాగా ఆయన ఓ వీడియోని షేర్‌ చేశారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఎంతో బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనని సాయం కోరిన వారికి సైతం సాయం అందించలేని పరిస్థితులు ఆసుపత్రుల వద్ద నెలకొన్నాయన్నారు.

‘బయట పరిస్థితులు చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. ఒకప్పుడు మనం వుహాన్‌ని చూసినట్లు ఇప్పుడు భారత్‌ని ప్రపంచం చూస్తోంది. తన తల్లికి సరైన సమయంలో బెడ్‌ దొరకకపోవడం వల్ల చనిపోవడంతో ఓ వ్యక్తి వెళ్లి ఆసుపత్రి సిబ్బందిపై దాడి చేశాడు. ఒక్కటి ఆలోచించండి ఆసుపత్రిలో పడకలు అందుబాటులో లేనప్పుడు వైద్యులు మాత్రం ఏం చేయగలరు. ఇలాంటి ఘటనలు ఎన్నోచోట్ల జరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో పడకలు లేక చనిపోయేవాళ్ల కన్నా ఆక్సిజన్‌ అందక చనిపోయేవాళ్లు ఎక్కువయ్యారు. ఇవన్నీ వాస్తవాలు. మనం వినకూడదు అనుకున్నా వినాల్సిన నిజాలు. ఎంతోమంది తమ తల్లిదండ్రుల్ని, కుటుంబసభ్యుల్ని కోల్పోతున్నారు. నాకు ఎంతోమంది సాయం కోసం పోన్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న రోజుల్లో వాళ్లకు అవసరమైన సాయాన్ని చేయలేకపోతున్నందుకు బాధగా అనిపిస్తుంది. ప్రతిరోజూ కొవిడ్‌ కేసుల గురించి మనం వింటున్న లెక్కలు నిజం కాదు. నిజమైన లెక్కలు తెలియాలంటే ఒక్కసారి శ్మశానాలకు వెళ్లండి. ఇంత జరుగుతున్నా.. ఎలక్షన్స్‌ ముఖ్యం, ఫలితాల లెక్కింపు ముఖ్యం అనే దౌర్భాగ్యస్థితిలో మన రాజకీయ నాయకులు ఉన్నారు. ఇంతమంది మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు మీరు అస్సలు మనుషులేనా? ఎన్నికలు అయిపోయాయి కదా.. ఎన్నికలపై మీరు చూపిన శ్రద్ధలో కేవలం ఒక్కశాతమైన ఇప్పుడు ప్రజలపై చూపించండి. దయచేసి మీకు మొక్కుతున్నా. ఉన్నవాళ్లనైనా కాపాడే ప్రయత్నం చేయండి. మృతుల్ని చూసి వైద్యులు సైతం తల్లడిల్లిపోతున్నారు’ అని ఆయన పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని