RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తొలిసారి తెలుగు తెరపై కనిపించనున్న నటులు వీరే!

ప్రముఖ దర్శకుడు రాజమౌళి చిత్రాల్లోని ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఆయా క్యారెక్టర్లను పోషించిన నటులకు మంచి క్రేజ్‌ వస్తుంది. ఇప్పటికే చాలామంది ఈ జాబితాలోకి చేరగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో  బాలీవుడ్‌, హాలీవుడ్‌ యాక్టర్స్‌ కొందరు మెరవబోతున్నారు.

Updated : 19 Mar 2022 10:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు రాజమౌళి చిత్రాల్లోని ప్రతి పాత్రకూ ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. సినిమా విడుదలయ్యాక మంచి క్రేజ్‌ ఏర్పడుతుంది. ఇప్పటికే చాలామంది ఈ జాబితాలోకి చేరగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాతో బాలీవుడ్‌, హాలీవుడ్‌ యాక్టర్స్‌ కొందరు తెలుగు తెరపై మెరవబోతున్నారు. ఇదే చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వారెవరో చూద్దామా..

అజయ్‌ దేవ్‌గణ్‌

1991లో ‘పూల్‌ ఔర్‌ కాంటే’ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన అజయ్‌ దేవ్‌గణ్‌ బాలీవుడ్‌ నటుడిగా తెలుగువారికి సుపరిచితమే. ఆయన నటించిన పలు హిందీ సినిమాలు, వాటి డబ్బింగ్‌లు ఇక్కడివారిని అలరించాయి. నటుడిగా 30 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానమున్న ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారని ‘RRR’ టీమ్‌ ప్రకటించిన క్షణం నుంచే భారతీయ సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్లు, ట్రైలర్‌లోని సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచాయి. కాగా, అజయ్‌ దేవ్‌గణ్‌ పోషించిన పాత్ర పేరేంటో చెప్పకుండా చిత్ర బృందం ఊరిస్తోంది.


అలియా భట్‌

అలియా భట్‌.. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమాతో నాయికగా మారింది . విభిన్న పాత్రలు ఎంపిక చేసుకుని బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలియా ప్రతిభను మెచ్చిన రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఓ నాయికగా ఆమెను ఎంపిక చేశారు. రామ్‌ చరణ్‌ సరసన సీత అనే పాత్రలో అలియా కనిపించనుంది. పోస్టర్లు, ప్రచార చిత్రాలనుబట్టి చరణ్‌కు తగ్గ జోడీ అనిపించుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే ఆమె మరో తెలుగు ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది.


ఒలివియా మోరిస్‌

రామ్‌ చరణ్‌ పక్కన కనిపించే హీరోయిన్‌ ఫిక్స్‌ అవగానే ఎన్టీఆర్‌కు జోడీగా ఎవరు నటిస్తారా? అన్న ప్రశ్న అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండిల్‌వుడ్‌, బాలీవుడ్‌ కాకుండా హాలీవుడ్‌ నటి పేరును ప్రకటించి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘తారక్‌ హీరోయిన్‌ ఈమెనే’ అంటూ ఒలివియా మోరిస్‌ను పరిచయం చేసింది. దాంతో ఒక్కసారిగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య అమాంతం పెరిగిపోయింది. గూగుల్‌లో అత్యధిక మంది వెతికిన పేరుగా రికార్డు సృష్టించింది. ‘7 ట్రైల్స్‌ ఇన్‌ 7 డేస్‌’ అనే ఒకే ఒక్క టీవీ సిరీస్‌లో నటించిన ఒలివియాకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చోటుదక్కడం విశేషం. జెన్నీఫర్‌ అనే బ్రిటిష్‌ యువతిగా ఒలివియా సందడి చేయనుంది. పాత్ర నిడివి తక్కువైనా ఈమె పాత్రకు ప్రాధాన్యత ఎక్కువ.


రే స్టీవెన్‌సన్‌

ఈ సినిమాలో ప్రధాన విలన్‌ పాత్ర స్కాట్‌. దీన్ని ఐరిష్‌ నటుడు రే స్టీవెన్‌సన్‌ పోషించారు. ‘ది థియరీ ఆఫ్‌ ఫ్లైట్‌’ అనే బ్రిటిష్‌ చిత్రంతో 1998లో నటుడిగా మారారు స్టీవెన్‌ సన్‌. ‘ఔట్‌పోస్ట్‌’, ‘ది అదర్‌ గాయ్స్‌’, ‘బిగ్‌గేమ్‌’, ‘కోల్డ్‌స్కిన్‌’, ‘ఫైనల్‌స్కోర్‌’ తదితర సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించారు. పలు ధారావాహికల్లోనూ ఆయన మెరిశారు. ‘RRR’కు సంబంధించి ఫస్ట్‌లుక్‌తోనే విలన్‌గా అందరితో వావ్‌ అనిపించుకున్నారు.


అలిసన్‌ డూడీ

ఈ చిత్రంలోని నాయకులకు దీటుగా ప్రతినాయకురాలి పాత్ర ఉంటుంది. మరి హీరోలతో పోటాపోటీగా ఎవరు నటించగలరు? అన్న ప్రశ్నకు అలిసన్‌ డూడీ సమాధానంగా నిలిచింది. ఫస్ట్‌లుక్‌తోనే ఈ ఐరిష్‌ నటి  భారతీయ సినీ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఈ సినిమాలో ఆమె లేడీస్కాట్‌ అనే విలన్‌ పాత్రలో కనిపించనుంది. మోడల్‌ అయిన అలిసన్‌ ‘ఏ వ్యూ టు ఏ కిల్‌’ చిత్రంతో బాండ్‌ గాళ్‌గా వెండితెరకు పరిచయమైంది. ‘ఏ ప్రేయర్‌ ఫర్‌ ది డైయింగ్‌’, ‘డ్యుయల్‌ ఆఫ్‌ హార్ట్స్‌’, ‘ది యాక్టర్స్‌’, ‘డివిజన్‌ 19’ తదితర ఆంగ్ల చిత్రాలు, పలు టీవీ సీరియళ్లతో మంచి క్రేజ్‌ సంపాందించింది. అలా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో భాగస్వామి అయింది. వీరితోపాటు ఎడ్వర్డ్‌ సోనెన్‌బ్లిక్‌, అరుణ్‌ సాగర్‌, శ్రియ, ఛత్రపతి శేఖర్‌, రాజీవ్‌ కనకాల, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.


ప్రతి పాత్రను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతారు కాబట్టే రాజమౌళిని జక్కన్న అంటుంటారు. ఆయా పాత్రలకు ఎవరు సరిపోతారో వారినే ఎంపిక చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఆయన బాలీవుడ్‌, హాలీవుడ్‌కు చెందిన వైవిధ్య నటులను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. కథానాయకులు రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌, అలియా భట్‌ పాత్రలనే ప్రేక్షకులు గుర్తుపెట్టునేలా ప్రచార చిత్రాల్ని తీర్చిదిద్దగా ఒలివియా, రే స్టీవెన్‌ సన్‌ తదితర పాత్రలపై ఫోకస్‌ పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. మరి ఈ క్యారెక్టర్లు ఎలా ఉంటాయో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా మార్చి 25న విడుదలకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని