RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ దేశం గర్వించదగ్గ చిత్రమవుతుంది: సీఎం బస్వరాజు బొమ్మై

‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రాజమౌళి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారని, ఆయనొక సృష్టికర్త అని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అన్నారు.

Updated : 20 Mar 2022 10:06 IST

బెంగళూరు: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రాజమౌళి సరికొత్త ప్రపంచాన్ని సృష్టించారని, ఆయనొక సృష్టికర్త అని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై అన్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శనివారం చిక్‌బళ్లాపూర్‌లో ప్రీ రిలీజ్‌ వేడుక  జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం బస్వరాజ్‌ బొమ్మై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. రాజమౌళి సినిమా మేకర్‌ కాదని, ఆయనొక క్రియేటర్‌ అని పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుత చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’ దేశం గర్వించదగ్గ చిత్రమవుతుందన్నారు. దేశాన్ని ప్రేమించే వారందరూ టికెట్‌ కొనుక్కొని థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ భాషలన్నీ అక్కాచెల్లెళ్లలాంటివని పేర్కొన్నారు. అదే మన సంస్కృతి అన్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించి భారతదేశ కీర్తిని ప్రపంచవ్యాప్తం చేయాలని ఆకాంక్షించారు. రాజమౌళి తన చిత్రాలతో చరిత్ర లిఖించి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేశారని తెలిపారు. బ్రహ్మా, విష్ణు, మహేశ్వరుల బంధంలా రామ్‌చరణ్‌‌, తారక్‌, శివరాజ్‌కుమార్‌ల స్నేహం కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ సినిమాను స్వాతంత్ర్య సమరయోధులైన భగత్‌ సింగ్‌, సుభాష్‌ చంద్రబోస్‌, చంద్రశేఖర్‌ ఆజాద్‌, కిత్తు రాణి చెనమ్మ, ఝాన్సీ లక్ష్మీబాయ్‌లకు అంకింతమివ్వాలని కోరుకుంటున్నానన్నారు.

కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఇక్కడకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. అదే సమయంలో అప్పు ఇక్కడ లేనందుకు బాధగా ఉంది. నేను బాధపడితే మీరూ బాధపడతారు. అందుకే నేను బాధపడను. నేను రాజమౌళికి పెద్ద ఫ్యాన్‌ను. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, చిరంజీవి, అజిత్‌, విజయ్‌లా ప్రతి ఒక్కరి సినిమా మొదటి రోజు టికెట్‌ కొనుక్కొని మరీ ఒక అభిమానిలా చూస్తా. భారతీయ సినిమా ఖ్యాతిని ‘బాహుబలి’ పెంచింది. తెలుగు చిత్ర పరిశ్రమ నా కుటుంబం. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కోసం కోట్లమంది ఎలా ఎదురు చూస్తున్నారో నేను కూడా అలాగే ఎదురుచూస్తున్నా. ఒక సాధారణ వ్యక్తిలా ఈ కార్యక్రమానికి వచ్చిన సీఎం బసవరాజ బొమ్మైకు నిజంగా ధన్యవాదాలు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఉగాది ఒక వారం ముందుగానే వచ్చింది’’ అని అన్నారు.

వాళ్లు లేకపోతే నా సినిమా లేదు:రాజమౌళి

దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ... ‘‘ఈ కార్యక్రమానికి అటు కన్నడ ప్రేక్షకులు, ఇటు తెలుగు ప్రేక్షకులు వచ్చారు. వారి హోరు చూస్తుంటే  శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యం ఇలాగే ఉండేదేమో అనిపిస్తోంది. ఈ మైత్రీ బంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎప్పుడూ నా కుటుంబ సభ్యుల గురించి చెబుతుంటాను. ఈసారి నా అసిస్టెంట్‌ డైరెక్టర్ల గురించి చెప్పాలనుకుంటున్నా. వారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశారు. కో-డైరెక్టర్‌ కోటి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీను, శ్రీరామ్‌, కిరణ్‌, అనిల్‌, ఆన్‌లైన్‌ ఎడిటర్‌ నాగార్జున, కో-ఆర్డినేటర్‌ రాహుల్‌, డబ్బింగ్‌ సమన్వయకర్త సురేశ్‌, షెడ్యూలింగ్‌ చేసే సుధాకర్‌, సుబ్బు వీళ్లే నా బలం. వీళ్లు లేకపోతే నా చిత్రం లేదు. నా కథలోకి హీరో, హీరోయిన్లు అడుగు పెట్టకముందే వీళ్లు నటించి చూపిస్తారు. ‘ఆర్‌ఆర్ఆర్‌’ విడుదలయ్యాక వారు చేసిన సీన్లను కూడా విడుదల చేస్తాం. బల్గేరియాలో యోగానంద్‌గారి సహకారం మర్చిపోలేని. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’గొప్ప విజువల్‌ ట్రీట్‌ అంటున్నారు. ప్రొడక్షన్‌ డిజైనర్‌ సాబు సిరిల్, డీవో పీ సెంథిల్‌, వీఎఫ్‌ఎక్స్‌ శ్రీనివాస మోహన్‌, నా సతీమణి రమగారు ఉండటం వల్లే ఇది విజువల్ ట్రీట్‌ అనిపిస్తోంది’’

‘‘మా సినిమా గురించి చెప్పగానే టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన  తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు. మెగాస్టార్‌ చిరంజీవి చొరవ తీసుకుని సీఎం జగన్‌తో మాట్లాడటం వల్లే ఏపీలో టికెట్‌ రేట్లు పెంపు సాధ్యమైంది. ఆయనను చాలా మంది చాలా రకాల మాటలు అన్నారు. మమ్మల్ని నెగ్గించడానికి ఆయన తగ్గి మాటలన్నీ పడ్డారు. చిరంజీవిగారూ మీరు నిజమైన మెగాస్టార్‌. ఆయనకు ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవటం ఇష్టం ఉండదు. ఇండస్ట్రీ బిడ్డగానే ఉంటానని అంటారు. కానీ, ఆయన మా అందరికీ పెద్ద. మేమంతా రుణ పడి ఉంటాం. నా రాముడు(చరణ్‌), నా భీముడు(ఎన్టీఆర్‌)లను అడగ్గానే మరో ఆలోచన లేకుండా సినిమా ఒప్పుకొన్నారు. థ్యాంక్స్‌ అనే మాట చాలా చిన్నది. రామ్‌చరణ్‌ తేజ్‌కు ఆంజనేయస్వామి పేరు  చిరంజీవిగారు  ఎందుకు పేరు పెట్టారో నాకు  తెలియదు. కానీ, ఆంజనేయస్వామిలా చరణ్‌ బలమేంటో అతడికి తెలియదు. అలాగే హరికృష్ణగారు ఎందుకు తారక రామ్‌ అని పెట్టారో తెలియదు. కానీ, నిజంగా తారక రాముడే. తనబలమేంటో రాముడికి తెలుసు. అలాగే తన నటన సామర్థ్యం ఏంటో తెలిసిన వ్యక్తి తారక్‌. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘చరణ్‌ గొప్ప నటుడు ఆ విషయం అతడికి తెలియదు.. ఎన్టీఆర్‌ గొప్ప నటుడు ఆ విషయం అతనికి తెలుసు’ అలాంటి ఇద్దరు నటులు నా సినిమాలో నటించినందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

రామ్‌చరణ్‌ మాట్లాడుతూ.. ‘‘పునీత్‌ రాజ్‌కుమార్‌ లేని లోటు శివరాజ్‌కుమార్‌తో తీర్చుకుంటాం. ఆయన ఎక్కడ ఉన్నా మమ్మల్ని ఆశీర్వదిస్తారు. సినిమా వాయిదాల మీద వాయిదా పడినా నాకూ తారక్‌కు నీడలా మీరంతా వెంటే ఉన్నారు. మార్చి 25న మా కష్టం, శ్రమ మీరంతా చూడటానికి వచ్చేస్తోంది. ఇంత పెద్ద సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ‘మీకు ఎలాంటి ఫీలింగ్స్‌ ఉన్నాయి’ అని అడుగుతున్నారు. నాకు ఎలాంటి ఫీలింగ్స్‌ లేవు. ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఏపీ, తెలంగాణ తర్వాత కర్ణాటక మాకు  పెద్ద మార్కెట్‌. రాజమౌళి టీమ్‌కు ధన్యవాదాలు’’ అని చరణ్‌ తెలిపారు.

‘‘మా ముగ్గురి బంధం(రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, రాజమౌళి) ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఒక చిత్రం కాదు. ఇక్కడకు వచ్చిన రామ్‌, చరణ్‌ అభిమానుల అభిమానానికి నిదర్శనం. అందుకే ట్రిపుల్‌ ఆర్‌ను దేవుడే నిర్ణయించాడేమో. ప్రాంతీయ సినిమా అనే సరిహద్దులను చెరిపేసి, భారతీయ సినిమాగా చాటి చెప్పాలనుకుంటున్న గొప్ప దర్శకుడి కల. ట్రిపుల్‌ ఆర్‌ భారతదేశానికి గర్వకారణం. ఇందులో నాకు కూడా అవకాశం కల్పించినందుకు రాజమౌళికి ధన్యవాదాలు’’ అని ఎన్టీఆర్‌ చెప్పుకొచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని