RRR: ‘ఆస్కార్‌’కు అందుకే వెళ్లలేదు.. ఆ ఖర్చు గురించి తెలియదు: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మాత

‘ఆస్కార్‌’కు వేడుకకు తాను హాజరుకాకపోవడంపై వస్తున్న వార్తలపై ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మాత డీవీవీ దానయ్య స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వాటిని ఖండించారు.

Updated : 21 Mar 2023 19:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రంలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ‘ఆస్కార్’ (Oscar Awards 2023) వరించినా ఆ వేడుకకు నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danayya) హాజరుకాకపోవడంపై ఇటీవల పలు వదంతులు తెరపైకి వచ్చాయి. చిత్ర బృందం ఆయన్ను పట్టించుకోవడంలేదంటూ కొన్ని వెబ్‌సైట్లు కథనాలు రాశాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దానయ్య ఆ వార్తలను ఖండించారు. తాను కనిపించకపోయినా తన పేరు వినిపిస్తే చాలనుకుంటానని, వ్యక్తిగతంగా పబ్లిసిటీ అంటే నచ్చదని, అందుకే ఆస్కార్‌కు వెళ్లలేదని స్పష్టం చేశారు. అనంతరం, రాజమౌళి (Rajamouli)తో కలిసి చేసిన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.

‘‘2006 నుంచి రాజమౌళితో జర్నీ చేస్తున్నా. ఆ సమయంలోనే ఓ సినిమా చేయండంటూ కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా ఇచ్చా. కొంతకాలం తర్వాత.. ‘‘మర్యాద రామన్న’ సినిమాని నిర్మిస్తారా?’ అని ఆయన అడిగారు. నేను వద్దంటూనే భారీ బడ్జెట్‌ చిత్రాన్ని రూపొందించాలన్న మనసులో మాట బయటపెట్టా. ‘బాగా ఆలస్యమవుతుంది. ప్రస్తుతానికి రెండు సినిమాలు కమిట్‌ అయి ఉన్నా’ అని ఆయన బదులిచ్చారు. దానికి నేను అంగీకరించా. అలా వచ్చింది ఈ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. అటు నందమూరి ఫ్యామిలీ, ఇటు మెగా ఫ్యామిలీ హీరోలను కలిపి సినిమా చేసినందుకు రాజమౌళికి నేను రుణపడి ఉంటా. ఆయన కమిట్‌మెంట్‌ ఉన్న వ్యక్తి’’ అని పేర్కొన్నారు.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ప్రముఖ హీరో చిరంజీవి కొంత పెట్టుబడి పెట్టారంటూ వచ్చిన వార్తలపై స్పందిస్తూ.. అవన్నీ రూమర్సేనంటూ తీవ్రంగా ఖండించారు. అలాంటి న్యూస్‌ ఎలా రాస్తారో అర్థంకాదన్నారు. తాను ఆ చిత్రాన్ని సుమారు రూ. 400 కోట్ల బడ్జెట్‌ పెట్టి నిర్మించానని, ఫలితం విషయంలో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. ‘ఆస్కార్‌’ వేడుకకు హాజరయ్యేందుకు రూ. కోట్లు ఖర్చుపెట్టారనే విషయంపై మాట్లాడుతూ.. అందుకు తాను ఎలాంటి ఖర్చు చేయలేదని, రాజమౌళి ఖర్చు పెట్టారో లేదో తెలియదన్నారు. ఎక్కువమంది ప్రేక్షకులకు చేరేందుకు సినిమాను ఇక్కడ ప్రచారం చేసినట్టే రాజమౌళి అమెరికాలో ప్రమోట్‌ చేశారని అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని