Pushpa 2: ‘పుష్ప-2’లో రామ్‌చరణ్‌.. స్క్రీన్‌పై మెరవనున్న బావా-బామ్మర్ది..?

అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప’. ఇప్పుడిదే చిత్రానికి కొనసాగింపుగా ‘పుష్ప -2’ రానుంది. 

Published : 12 Dec 2022 11:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun)‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ (Ram Charan).. వీరిద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే చూడాలని మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో ‘ఎవడు’ వచ్చినప్పటికీ అందులో చరణ్‌-బన్నీ కలిసి కనిపించిన సన్నివేశాల్లేవు. తాజా సమాచారం ప్రకారం త్వరలోనే వీరిద్దరూ వెండితెరపై కలిసి సందడి చేయనున్నారని తెలుస్తోంది.  ఈ మేజికల్‌ కాంబోకు ‘పుష్ప-2’ (Pushpa 2) వేదిక కానుందని వార్తలు వస్తున్నాయి.

ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సుకుమార్‌ (Sukumar) తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ‘పుష్ప ది రైజ్‌’. బన్నీ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్‌ సక్సెస్‌ అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘పుష్ప ది రూల్‌’ తెరకెక్కుతోంది. అయితే ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింటిని షేక్‌ చేస్తోంది. పార్ట్‌-1తో పోలిస్తే.. పార్ట్‌-2 మరింత ఆసక్తికరంగా ఉండనుందని, ఇందులో ఎంతోమంది స్టార్స్‌ కనిపించనున్నారని సమాచారం. ఈ మేరకు రామ్‌చరణ్‌ సైతం ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారని, బన్నీతో కలిసి ఆయన స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారని.. నెట్టింట పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఈ విషయంపై సుకుమార్‌ ఇప్పటికే చెర్రీని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

డైలాగ్‌ అదుర్స్‌ అప్పా..!

‘పుష్ప’లో పవర్‌ఫుల్‌ పంచ్‌ డైలాగ్‌లు, విభిన్నమైన స్టైల్‌లో మెప్పించారు అల్లు అర్జున్‌. ‘తగ్గేదే లే’, ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైర్‌’.. ఇలా చెబుతూ వెళితే ఆ సినిమాలో ఎన్నో సంభాషణలు అభిమానులను అలరించాయి. దీంతో ‘పుష్ప-2’లోనూ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ మెండుగా ఉండాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ డైలాగ్‌ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘అడవిలో జంతువులు నాలుగు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి నాలుగు అడుగులు వెనక్కి వేసింది అంటే పుష్పరాజ్‌ వచ్చాడని అర్థం’’. ప్రస్తుతం ఈ డైలాగ్‌ సినీ ప్రియులతో ఈలలు వేయిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని