
RRR: ‘ఆర్ఆర్ఆర్’ హంగామా 3న
సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించిన ఈ సినిమాని ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించారు. ఇది సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర ట్రైలర్ విడుదలకు చిత్ర బృందం ముహూర్తం ఖరారు చేసింది. ఈ ట్రైలర్‌ను డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా తారక్, చరణ్, అలియా భట్, అజయ్ దేవగణ్‌లతో కూడిన ఓ కొత్త పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
‘‘బిగ్గెస్ట్ బ్లాస్ట్‌కు సిద్ధంగా ఉండండి. ఇక వేడుకలు ప్రారంభించండి’’ అంటూ ఆ పోస్టర్‌కు చిత్ర బృందం ఓ వ్యాఖ్యను కూడా జోడించింది. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న ఓ కల్పిత కథాంశంతో రూపొందిన చిత్రమిది. అల్లూరి పాత్రను చరణ్ పోషించగా.. భీమ్‌గా ఎన్టీఆర్ నటించారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగణ్, శ్రియ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, మాటలు: సాయి మాధవ్ బుర్రా.