RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఖాతాలో మరో అరుదైన అకాడమీ అవార్డు

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరో అరుదైన అవార్డు సొంతం చేసుకుంది. ‘అవతార్‌’ లాంటి హాలీవుడ్‌ చిత్రాలను దాటుకుని జపాన్‌ 46వ అకాడమీ అవార్ట్‌ గెలుచుకుంది.

Updated : 24 Jan 2023 11:15 IST

హైదరాబాద్‌: దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’‌(RRR) చిత్రం విదేశాల్లోనూ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం తాజాగా మరో అరుదైన అవార్డును తన ఖాతాలో వేసుకుంది. జపాన్‌ 46వ అకాడమీ అవార్డ్స్‌(Japan Academy Award)లో అవుట్‌ స్టాండింగ్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అవార్డు గెలుచుకుంది. ప్రపంచాన్ని షేక్‌ చేస్తోన్న ‘అవతార్‌: ద వే ఆఫ్‌ వాటర్’(Avatar2: The Way Of Water)‌, ‘టాప్‌గన్‌: మావెరిక్‌’(Top Gun: Maverick) వంటి హాలీవుడ్‌ చిత్రాలను దాటి ఈ జక్కన్న అద్భుతం అవార్డును కైవసం చేసుకుంది. ఇక గతేడాది జపాన్‌లో విడుదలైన ఈ పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా అక్కడ కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలై మూడు నెలలు దాటినా జపాన్‌ ప్రజలు ఈ చిత్రాన్ని చూడడానికి థియేటర్ల ముందు క్యూ కడుతున్నారు. అక్కడ ఈ చిత్రాన్ని 4 లక్షల మందికిపైగా వీక్షించారు.

ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ (Golden Globe) పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్‌ నామినేషన్‌ రేసులో ఉంది. మొత్తం పది భారతీయ చిత్రాలు ఈ బరిలో ఉన్నాయి. కాగా నేడు ఆస్కార్‌ నామినేషన్స్‌ వెల్లడి కానున్నాయి. ఏ చిత్రాలు నామినేషన్‌ దక్కించుకుంటాయోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దక్షిణాది చిత్రాల ఖ్యాతిని ఖండాంతరాలు దాటేలా చేసిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కచ్చితంగా ఆస్కార్‌లో చోటుదక్కించుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని