RRR: ఆస్కార్‌ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మరో అవార్డుకు ఎంపికైంది. హాలీవుడ్‌ చిత్రాలను వెనక్కి నెట్టి సత్తా చాటింది.

Published : 01 Feb 2023 01:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విశ్వసినీ వేదికపై ఇప్పటికే పలు పురస్కారాలు దక్కించుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)  తాజాగా మరో అవార్డుకు ఎంపికైంది. ‘ఫ్యాన్‌ ఫేవరెట్‌ మూవీ’ విభాగంలో  ‘గోల్డెన్‌ టొమాటో అవార్డు’ (Golden Tomoto Awards) సొంతం చేసుకుంది. ఈ వివరాలు వెల్లడిస్తూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ తమ సినిమాను ఎంతగానో ప్రేమించి, ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. సినీ ప్రియులు వేసే ఓటు ఆధారంగా.. అమెరికాకు చెందిన రోటెన్‌ టొమాటోస్‌ వెబ్‌సైట్‌ ప్రతి ఏడాదీ ఈ అవార్డులు ప్రకటిస్తుంటుంది. 2022కుగాను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఎంపికైంది. ఉత్తమ చిత్రాలుగా నామినేషన్‌ దక్కించుకుని 2023 ఆస్కార్‌ బరిలో నిలిచిన ‘టాప్‌గన్‌: మావరిక్‌’, ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’, ‘అవతార్‌: ది వే ఆఫ్‌ వాటర్‌’లను వెనక్కి నెట్టి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నంబరు 1గా నిలవడంపై భారతీయ చలన చిత్ర పరిశ్రమలో హర్షం వ్యక్తమవుతోంది.

ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాట ఈ ఏడాది ఆస్కార్‌కు నామినేట్‌ (Oscars Nominations 2023) అయిన సంగతి తెలిసిందే. ఈ నామినేషన్‌కు ముందు ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ అవార్డు అందుకుంది. జపాన్‌ 46వ అకాడమీ అవార్డ్స్‌, ది ఫిలడెల్ఫియా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డ్స్‌, అట్లాంటా ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్‌ అవార్డ్స్‌ తదితర వాటిల్లో విజేతగా నిలిచిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. బెస్ట్‌ డైరెక్టర్‌గా రాజమౌళికి ‘ది న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్’ అవార్డు అందించింది. హీరోలు రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించిపెట్టింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని