Rudrudu movie review: రివ్యూ: రుద్రుడు

Rudrudu movie review: లారెన్స్‌ కీలక పాత్రలో నటించిన ‘రుద్రుడు’ మూవీ ఎలా ఉందంటే?

Published : 14 Apr 2023 14:28 IST

Rudrudu movie review; చిత్రం: రుద్రుడు; నటీనటులు: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు; సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్; సినిమాటోగ్రఫీ: ఆర్ డి రాజశేఖర్ ISC; ఎడిటర్: ఆంథోనీ; స్టంట్స్: శివ - విక్కీ; తెలుగులో విడుదల: ఠాగూర్ మధు; నిర్మాత, దర్శకత్వం: కతిరేశన్; బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్ పి; విడుదల: 14-04-2023

లారెన్స్ అనగానే వరుసగా వస్తున్న కాంచన సినిమాలే గుర్తుకొస్తాయి.  భయపెడుతూ... థ్రిల్ కి గురి చేసే ఆ సినిమాలతో ఆయన  చూపిస్తున్న ప్రభావం అలాంటిది. అయితే  దాదాపు మూడేళ్ల తర్వాత ఆయన ఆ సినిమాల నుంచి బయటకు వచ్చేలా కథ, కథనాల్ని ఎంచుకొని చేసిన సినిమానే రుద్రుడు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? లారెన్స్‌ ఏవిధంగా మెప్పించారు?

కథ ఏంటంటే: ఐటీ ఉద్యోగం చేసుకునే రుద్ర (లారెన్స్) ఓ సామాన్యుడు. తల్లిదండ్రులు అంటే ప్రాణం. అనన్య (ప్రియా భవానీ శంకర్)ని చూడగానే మనసు పారేసుకుంటాడు. ఆమెని ప్రేమించి, వివాహం చేసుకొని ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తాడు. ఇంతలో తల్లి (పూర్ణిమ భాగ్య రాజ్) చనిపోతుంది.  విదేశాల నుంచి వచ్చాక అనన్య కూడా చనిపోతుంది. దాంతో రుద్రుడి జీవితం ఒక్కసారిగా  తలకిందులవుతుంది. ఆ తరవాత తన తల్లి, భార్య చనిపోలేదని... ఎవరో చంపారని తెలుసుకుంటాడు. విశాఖలో పేరు మోసిన నేరగాడు భూమి (శరత్ కుమార్) పేరు బయటికి వస్తుంది అసలు రుద్ర కుటుంబ సభ్యులనే భూమి ఎందుకు చంపాడు.? అతనిపై రుద్ర పోరాటం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: పక్కా కమర్షియల్ సూత్రం ఆధారంగా రూపొందిన సినిమా ఇది. కొత్తదనం ఏమాత్రం లేకపోయినా.. కథ కథనం ప్రేక్షకుడి ఊహకి అందుతున్నా ... ఈ తరహా సినిమాలనీ  ఇష్టపడే ప్రేక్షకులు కూడా ఉంటారు. హీరోయిజం, ఫైట్స్, డాన్సులు తదితర మాస్ అంశాలే ఈ తరహా సినిమాల బలం. వాటిని నమ్ముకునే చేసిన సినిమా ఇది. రుద్ర.. భూమి గ్యాంగ్ మధ్య పోరాటంతో ఈ సినిమా  మొదలవుతుంది. ప్రథమార్థం అంతా కూడా భూమి గ్యాంగ్ సభ్యులని రుద్ర చంపడం... చంపిన ఆ రుద్రని కనిపెట్టి అంతం చేసేందుకు భూమి గ్యాంగ్ ప్రయత్నించడం వంటి సన్నివేశాలతో సాగుతుంది.  అంతే తప్ప కథ అంటూ సాగదు. చాలా సన్నివేశాలు రొటీన్ గా అనిపిస్తాయి. ద్వితీయార్థం లోనే అసలు కథంతా. రుద్ర ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలే ఈ సినిమాకి బలం. విదేశాలకు వెళ్లిన వ్యక్తుల్ని విలన్ టార్గెట్ చేయడం అనే అంశం కొత్తగా ఉంటుంది. దానికి తోడు భావోద్వేగాలు కథపై ప్రభావం చూపిస్తాయి. పతాక సన్నివేశాలు కూడా హత్తుకుంటాయి. యాక్షన్ ప్రియులకు నచ్చేలా పోరాట సన్నివేశాలని డిజైన్ చేయడం బాగుంది. అఖండ యాక్షన్ తరహాలో ఈ సినిమాలో పోరాట ఘట్టాలు ఉంటాయి. ఇక లారెన్స్ మార్క్ డాన్సులు ఉండనే ఉన్నాయి. కొత్త కథ కథనాల్ని ఆశించకుండా ఓ మాస్ సినిమాని ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు ఈ సినిమా తృప్తిని ఇవ్వచ్చు.

ఎవరెలా చేశారంటే: రాఘవలారెన్స్ వన్ మేన్ షో ఈ సినిమా. భూమి పాత్రలో శరత్ కుమార్ శక్తివంతంగా కనిపించినా, ఎక్కువ భాగంలో లారెన్స్ సందడే. ఐటీ ఉద్యోగిగా కనిపించినా... ఆ పాత్ర నుంచి బయటకు వచ్చి మరీ మాస్ సందడితో తనదైన ప్రభావం చూపించారు లారెన్స్. పోరాట ఘట్టాలు మరో స్థాయిలో ఉంటాయి. ఆయనపై అఖండ ఎంత బలమైన ప్రభావం చూపించిందో ఈ సినిమా చాటింది. అక్కడక్కడ లారెన్స్ చేసిన హంగామా ఆయన కాంచన పాత్రల నుంచి ఇంకా బయటికి రాలేదని స్పష్టం చేస్తుంది.  కథానాయిక ప్రియ భవాని  శంకర్ పాత్ర పరిధి తక్కువే. ఉన్నంతలో పద్ధతి అయిన పాత్రలో మెరిసింది.  తల్లిదండ్రులుగా నాజర్, పూర్ణిమ భాగ్యరాజ్ నటించి భావోద్వేగాలని పండించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించారు. శరత్ కుమార్ పాత్ర బాగుంది. దానిపై ఆయన బలమైన ప్రభావమే చూపించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. జీవి ప్రకాష్ కుమార్ పాటలకంటే నేపథ్య సంగీతం బాగుంది. కెమెరా పనితనం ఆకట్టుకుంది. దర్శకుడు కతిరేశన్ అటు కథలో కానీ ఇటు కథనంలో కానీ కొత్తదనం చూపించలేదు. నిర్మాణం బాగుంది.

బలాలు: + పోరాట ఘట్టాలు; + ద్వితీయార్ధంలో భావోద్వేగాలు

బలహీనతలు: - కథ కథనం; - ప్రధమార్ధం;

చివరిగా: రొటీన్‌ ‘రుద్రుడు’..

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని