RRR: ఒక్క పాట కోసం రూ.3కోట్ల బడ్జెట్‌..!

కేవలం ఒక్క పాట కోసం రూ.3కోట్ల బడ్జెట్‌ వెచ్చించడం చాలా ఆశ్చర్యపరిచే విషయమే. కానీ.. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో ఆ వార్త పెద్ద మేటర్‌ కానే కాదు. తాను అనుకున్నట్లు సినిమాను మలిచేందుకు జక్కన్న ఎక్కడా వెనక్కి తగ్గరు. ఆయనకు తగ్గట్లుగానే నిర్మాతలు సైతం ఎంత బడ్జెట్‌ పెట్టేందుకైనా వెనుకాడరు.

Published : 14 Jul 2021 16:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేవలం ఒక్క పాట కోసం రూ.3కోట్ల బడ్జెట్‌ వెచ్చించడం అంటే ఆశ్చర్యపరిచే విషయమే. కానీ.. దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలో ఆ వార్త పెద్ద మేటర్‌ కానే కాదు. తాను అనుకున్నట్లుగా సినిమాను మలిచేందుకు జక్కన్న ఎక్కడా వెనక్కి తగ్గరు. ఆయనకు తగ్గట్లుగానే నిర్మాతలు సైతం ఎంత బడ్జెట్‌ పెట్టేందుకైనా సిద్ధంగా ఉంటారు. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే.. మళ్లీ ఎందుకు ఈ చర్చంతా అనుకుంటున్నారా..? రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఓ పాట ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక పాట రూపుదిద్దుకోనుంది. కేవలం ఒక్క పాట కోసం ఏకంగా రూ.3కోట్లు వెచ్చించనున్నారట. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆ సాంగ్‌ను చిత్రీకరించనున్నట్లు సమాచారం. అందులో బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా కాస్ట్యూమ్స్‌ కోసం దాదాపు రూ.కోటి వరకూ ఖర్చు చేయనున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు.

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గతంలో ప్రకటించిన తేదీకే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఓ పోస్టర్‌లో విడుదల తేదీని అక్టోబర్‌ 13, 2021గా పేర్కొంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది కూడా. ఈ నెల 15 నుంచి ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకోనున్నాయి. అలియా భట్‌, ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ జీవితాల స్ఫూర్తితో అల్లుకున్న కథతో రూపొందుతున్న చిత్రమిది. అల్లూరిగా రామ్‌చరణ్‌ నటిస్తుండగా.. భీమ్‌ పాత్రను ఎన్టీఆర్‌ పోషిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని