ఎన్నో త్యాగాలు చేశా: కంగనా రనౌత్‌

ఒకానొక సమయంలో తాను ఎన్నో త్యాగాలు చేశానని బాలీవుడ్‌ నటి, క్వీన్‌ కంగనా రనౌత్‌ అన్నారు. కెరీర్‌ ప్రారంభంలో పలువురు హీరోల సరసన నటించిన కంగన ప్రస్తుతం మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు....

Published : 25 Feb 2021 01:54 IST

నేను నో చెప్పిన వాటితో ఓవర్‌నైట్‌ స్టార్స్‌

ముంబయి: ఒకానొక సమయంలో తాను ఎన్నో త్యాగాలు చేశానని బాలీవుడ్‌ నటి, క్వీన్‌ కంగనా రనౌత్‌ అన్నారు. కెరీర్‌ ప్రారంభంలో పలువురు హీరోల సరసన నటించిన కంగన ప్రస్తుతం మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తనని ఐటమ్‌ సాంగ్‌ డ్యాన్సర్‌గా పోలుస్తూ ఇటీవల మధ్యప్రదేశ్‌ మాజీ మంత్రి సుఖ్‌దేవ్‌ పన్సే చేసిన వ్యాఖ్యలపై కంగన ఘాటుగానే సమాధానమిచ్చిన విషయం తెలిసిందే. తాను దీపిక, ఆలియా, కత్రినా లాంటి హీరోయిన్‌ను కాదని ఆమె సమాధానమిచ్చారు.

కాగా, కంగన చేసిన వ్యాఖ్యలపై తాజాగా నటి స్వరాభాస్కర్‌ కామెంట్‌ చేశారు. ‘రజ్జో’లో (కంగన కథానాయిక) కంగన చేసిన స్పెషల్‌ సాంగ్‌ వీడియోని పోస్ట్‌ చేస్తూ.. ‘ఇది నాకు ఎంతో ఇష్టమైన ఐటమ్‌ సాంగ్‌. (కంగన ఐటమ్‌ సాంగ్స్‌ చేసి కూడా చేయలేదని చెప్పుకుంటున్నారు.)’ అని పేర్కొంటూ ట్వీట్‌ చేశారు. స్వరాభాస్కర్‌ చేసిన వ్యాఖ్యలపై కంగన తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అది ఐటమ్‌ సాంగ్‌ కాదని.. కథతోపాటే సాగే ఓ పాట మాత్రమేనని అన్నారు. ‘నేను ఎప్పుడైతే ‘ఏ’ లిస్ట్‌లో ఉన్న నటీనటులపై ప్రశ్నాస్త్రాలు సంధిస్తానో వెంటనే ‘బీ’ లిస్ట్‌లోని తారలు సైనికుల్లా మారి నాపై పోరాటం చేయడానికి సిద్ధమవుతారు. కథతో సంబంధం లేకుండా సినిమా మధ్యలో వచ్చే పాటలను ఐటమ్‌ సాంగ్స్‌ అంటారు. అలాంటి పాటల్లో మహిళలను కించపరిచేలా పదాలు ఉంటాయి. ఈ విషయం బీ గ్రేడ్‌ వాళ్లకు అర్థం కాకపోవచ్చు కానీ నేను మాత్రం సంజయ్‌లీలా భన్సాలీ, ఫర్హాన్‌ఖాన్‌ సినిమాల్లో ఐటమ్‌సాంగ్స్‌ అవకాశాలొస్తే తిరస్కరించాను. నేను తిరస్కరించిన వాటితో కొంతమంది నటీమణులు ఓవర్‌నైట్‌ స్టార్స్‌ అయ్యారు. ఎన్నో త్యాగాలు చేయడం వల్లే ఇప్పుడు ఉన్న ఈ స్థాయికి చేరుకోగలిగాను.’ అని నటి కంగన అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని