Sai Dharam Tej: అతనికి సాయం చేశానని నేనెక్కడా చెప్పలేదు.. సాయిధరమ్‌ తేజ్‌ వివరణ

తన గురించి జరుగుతోన్న అసత్య ప్రచారంపై నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) స్పందించారు. తాను ఎవరికీ సాయం చేయలేదని చెప్పారు. 

Published : 28 Apr 2023 01:28 IST

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో తనని కాపాడిన ఫర్హాన్‌ అనే వ్యక్తికి నటుడు సాయిధరమ్‌ తేజ్‌ సాయం చేశాడంటూ ఇటీవల పలు పత్రికల్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాజాగా సాయితేజ్‌ క్లారిటీ ఇచ్చారు. ఫర్హాన్‌కు తాను డబ్బులు ఇవ్వలేదని మరోసారి స్పష్టం చేశారు.

‘‘నాపై, నా టీమ్‌పై అసత్య ప్రచారాలు చేస్తున్నారనే విషయం తాజాగా నా దృష్టికి వచ్చింది. రోడ్డు ప్రమాదంలో నన్ను కాపాడిన ఫర్హాన్‌కు డబ్బు రూపంలో సాయం చేశానని, నేను కానీ నా టీమ్‌ కానీ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఎక్కడా చెప్పలేదు. నా ప్రాణాలు కాపాడిన ఆ వ్యక్తికి ఎప్పుడూ రుణపడే ఉంటానని మాత్రమే చెప్పాను. అతడి వద్ద మా వివరాలున్నాయని.. సాయం కోరి మా వద్దకు వస్తే తప్పకుండా చేస్తానని మాటిచ్చానని మాత్రమే నేను చెప్పాను. నా మేనేజర్‌ శరణ్‌ అతడికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాడు. ఈ విషయంపై ఇదే నా ఆఖరి వివరణ’’ అంటూ ఆయన లేఖ విడుదల చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

2021 సెప్టెంబర్‌లో సాయి ధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జ్‌ సమీపంలో ప్రమాదవశాత్తు ఆయన బైక్‌పై నుంచి కిందకు పడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ని.. ఫర్హాన్‌ అనే వ్యక్తి గుర్తించి సాయం చేశాడు. దీంతో ఫర్హాన్‌ పేరు అప్పట్లో వార్తల్లో నిలిచింది. ప్రమాదం నుంచి కోలుకున్న సాయిధరమ్‌ తేజ్‌ ‘విరూపాక్ష’ (Virupaksha)లో నటించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఫర్హాన్‌కు తాను ఎలాంటి ఆర్థిక సాయం చేయలేదని.. డబ్బులు ఇచ్చి చేతులు దులుపేసుకోవడం తనకు నచ్చదని చెప్పారు. తన ప్రాణాలను కాపాడిన వ్యక్తికి ఎప్పటికీ రుణపడే ఉంటానన్నారు. ఈ ఇంటర్వ్యూ తర్వాత ఫర్హాన్‌కు సాయితేజ్‌ సాయం చేసినట్లు ఇటీవల వరుస కథనాలు వెలువడ్డాయి. ఈనేపథ్యంలోనే ఫర్హాన్‌ సైతం మీడియా ముందుకు వచ్చి ఆ వార్తల్లో నిజం లేదని ఖండించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని