Sai Dharam Tej: మీరు వారిని గౌరవించినప్పుడే నా పెళ్లి: సాయి ధరమ్‌తేజ్‌

కిరణ్‌ అబ్బవరం హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకలో పాల్గొన్న సాయి ధరమ్‌తేజ్‌ తన పెళ్లి విషయమై స్పందించారు.

Published : 07 Feb 2023 21:18 IST

హైదరాబాద్‌: ‘‘మీరు ఎప్పుడైతే అమ్మాయిలను గౌరవిస్తారో అప్పుడే’’ అంటూ తన పెళ్లిపై ఎదురైన ప్రశ్నకు సమాధానమిచ్చారు నటుడు సాయి ధరమ్‌తేజ్‌ (Sai Dharam Tej). ‘‘అది మీ వల్ల అవుతుందా?’’ అని ఆయన తిరిగి అభిమానుల్ని ప్రశ్నించారు. ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) సినిమా ట్రైలర్‌ విడుదల వేడుకకు అతిథిగా హాజరైన సాయి తేజ్‌ ప్రసంగిస్తుండగా అభిమానులు పెళ్లి గురించి చెప్పాలని  విజ్ఞప్తి చేశారు. దానిపై ఆయన స్పందిస్తూ.. అమ్మాయిలకు రెస్పెక్ట్‌ ఇచ్చినప్పుడని సమాధానమిచ్చారు. మరోవైపు, తనకు ఇప్పటికే నాలుగు సార్లు వివాహమైందని చమక్కులు విసిరారు. ‘సర్‌.. సెల్ఫీ ప్లీజ్‌’ అని ఓ మహిళా అభిమాని కోరగా ‘‘సారీ అమ్మా! నాకు ఇప్పటికే పెళ్లయిపోంది’’ అని నవ్వులు పంచారు. సినిమా గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్ర సంగీత దర్శకుడు చేతన్‌ భరద్వాజ్‌కు నేను అభిమానిని. ఈ సినిమా పాటల కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూశా. ట్రైలర్‌ బాగుంది. సినిమా మంచి విజయం అందుకోవాలి’’ అని సాయి ధరమ్‌తేజ్‌ ఆకాంక్షించారు.

ఆ ఐదు చిత్రాల అనుభవమిది: కిరణ్‌

‘‘సాయి ధరమ్‌ తేజ్‌ నా ప్రతి సినిమా విడుదల సమయంలో ట్వీట్‌ చేసి, ప్రోత్సహిస్తుంటారు. అలాంటి ఆయన నా సినిమా వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటి వరకు నేను నటించిన 5 చిత్రాల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఆ సినిమాల అనుభవం ‘వినరో భాగ్యము విష్ణు కథ’లో కనిపిస్తుంది. ఈ చిత్రం ఫలితంపై నాకు ఎలాంటి కంగారు లేదు. ఇది చాలా ఎక్కువమంది ప్రేక్షకులకు చేరాలని కోరుకుంటున్నా’’ అని కిరణ్‌ అబ్బరం (Kiran Abbavaram) అన్నారు. ఈయన హీరోగా నూతన దర్శకుడు మురళీ కిశోర్‌ తెరకెక్కించిన సినిమా ఇది. కశ్మీరా పరదేశి కథానాయిక. గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీవాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించింది. సాయి ధరమ్‌తేజ్‌తోపాటు దర్శకులు మారుతి, హరీశ్‌ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని