Sai Durgha Tej: చిన్నారుల భద్రతపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు సాయితేజ్‌ విజ్ఞప్తి.. ఎక్స్‌ వేదికగా పోస్ట్‌!

పిల్లలు ఫొటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ముందు అప్రమత్తంగా వ్యవహరించాలని పేరెంట్స్‌కు నటుడు సాయి తేజ్‌ విజ్ఞప్తి చేశారు.

Updated : 07 Jul 2024 18:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియా ప్రమాదకరంగా మారిందని, పిల్లల ఫొటోలు/వీడియోలు పోస్ట్‌ చేయడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని నటుడు సాయి దుర్గా తేజ్‌ (Sai Durgha Tej) తల్లిదండ్రులకు సూచించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘నియంత్రించలేనంతగా సామాజిక మాధ్యమాలు క్రూరంగా, భయానకంగా మారిపోయాయి. కొన్ని మానవ మృగాల నుంచి పిల్లలను రక్షించుకోవాలని పేరెంట్స్ అందరికీ నా విజ్ఞప్తి. మీ పిల్లల ఫొటోలు, వీడియోలను నెట్టింట పోస్ట్‌ చేసేటప్పుడు కాస్త ఆలోచించండి. ఎందుకంటే.. సోషల్‌ మీడియా మృగాలకు తల్లిదండ్రుల బాధ అర్థం కాదు’’ అని పేర్కొన్నారు.

కొంతమంది యూట్యూబర్లు పిల్లల ఫొటోలను మార్ఫింగ్‌ చేస్తూనో.. పిల్లలతో కలిసి పేరెంట్స్‌ చేసిన వీడియోలపైనో అవమానకరంగా కామెంట్లు చేస్తున్నారని, ఆ విషయమై స్పందిస్తూ సాయి తేజ్‌ తాజా పోస్ట్‌ పెట్టారని తెలిసింది. సోషల్‌ మీడియా వినియోగంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసినందుకు ఆయనను అభిమానులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ విషయంలో మరికొందరు నటులు ముందుకు రావాలని కోరుతున్నారు. చిన్నారుల భద్రత గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలను అభ్యర్థించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌ ఖాతాలతోపాటు సంబంధిత కార్యాలయాల ఖాతాలను ట్యాగ్‌ చేశారు. సాయి తేజ్‌ ట్వీట్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పిల్లల భద్రత తమ ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని, ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. 

ఆ విషయంలో ప్రియదర్శిపై నాకు అసూయ: విష్వక్‌ సేన్‌

ఈ హీరో కొన్ని రోజుల క్రితం ‘సాయి దుర్గా తేజ్‌’గా తన పేరు మార్చుకున్న సంగతి తెలిసిందే. సంపత్‌ నంది దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు. అది పూర్తవకముందే ఇటీవల కొత్త దర్శకుడు రోహిత్‌ కేపీతో ఓ చిత్రం ఖరారు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని