Sai Pallavi: అప్పుడు స్టేజ్‌పై ఇబ్బందిపడ్డా.. కన్నీళ్లు ఆగలేదు: సాయిపల్లవి

స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం’ (Nijam) టాక్‌ షోలో నటి సాయిపల్లవి (Sai Pallavi) సందడి చేశారు. తన బాల్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Updated : 10 Mar 2023 14:06 IST

హైదరాబాద్‌: చిన్నతనంలో తనకు ఎదురైన ఓ సంఘటన గురించి ‘నిజం’ (Nijam) వేదికగా బయటపెట్టారు నటి సాయిపల్లవి (Sai Pallavi). స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షోలో పాల్గొన్న ఆమె.. తన స్కూల్‌ డేస్‌పై స్పందించారు. ‘‘చిన్నతనంలో నేనొక అల్లరి పిల్లను. క్లాసులు ఎగ్గొట్టి డ్యాన్స్‌ శిక్షణకు వెళ్లేదాన్ని. ఒకటో తరగతి చదువుతున్నప్పుడు మొదటిసారి స్టేజ్‌పై డ్యాన్స్‌ చేశాను. అప్పుడు నా జుట్టు చిన్నగా ఉండేది. జుట్టు పొడవుగా కనిపించడం కోసం అమ్మ.. ఓ చున్నీని నా తలకు కట్టింది. తీరా, డ్యాన్స్‌ చేస్తున్నప్పుడు అది ఊడిపోయి కిందపడిపోయింది. ఆ క్షణం ఎందుకో బాగా ఇబ్బందిగా అనిపించి.. స్టేజ్‌ దిగిపోయి బాగా ఏడ్చేశాను. అమ్మ కూడా బాధపడింది’’

‘‘నాకు రియాల్టీ షోలు అంటే భయం. అంతగా ఆసక్తి ఉండదు. అయితే.. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో 16 ఏళ్ల వయసప్పుడు మొదటిసారి ‘ఉంగళిల్ యార్ ప్రభుదేవా’ అనే రియాల్టీ షోలో పాల్గొన్నా. అందులో నేను ఎలిమినేట్‌ అయ్యాను. కట్‌ చేస్తే 10 ఏళ్ల తర్వాత అదే సెట్‌లో ప్రభుదేవా మాస్టర్‌ కొరియోగ్రఫీ చేసిన పాటకు డ్యాన్స్‌ చేశా’’ అని సాయిపల్లవి (Sai pallavi) పేర్కొన్నారు.

అనంతరం ‘లవ్‌స్టోరీ’ గురించి మాట్లాడుతూ.. ‘‘చేతలతోనే కాదు మాటలతో పక్కవారిని ఇబ్బందిపెట్టినా అది వేధింపులతోనే సమానం. నేను, నా చెల్లి, అమ్మ, మామ్మ.. ఇలా ప్రతిఒక్కరూ వేధింపులు ఎదుర్కొన్నవారే. వేధింపులకు గురికాని ఒక్క అమ్మాయినీ నేను చూడలేదు. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇలాంటివి చవి చూస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఈ బాధ ఉంటుంది. ఇంట్లో వాళ్లకు ఎలా చెప్పాలి? చెబితే నమ్ముతారా? లేదా? అని సంకోచిస్తారు. అలాంటి వాళ్లు.. నా సినిమా చూపించి.. నాక్కూడా ఇలాగే జరిగింది అని వాళ్లమ్మకు చెప్పి.. ఆ ఇబ్బంది నుంచి విముక్తి పొందొచ్చు’’ అని ఆమె వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని