Sai Pallavi: ఆయన బాగా నచ్చారు.. అందుకే అడిగి మరీ ఫొటో దిగా!

‘ఫిదా’లో భానుమతిగా సందడి చేసింది. ‘ఎంసీఏ’లో పల్లవిగా నవ్వించింది. లవ్‌స్టోరీలో ‘మౌనిక’గా మెప్పించింది ప్రముఖ కథానాయిక సాయిపల్లవి. ఈసారి ‘శ్యామ్‌సింగరాయ్‌’లో  వైవిధ్యమై పాత్రలో కనిపించనుంది. అందులో దేవదాసి ‘మైత్రి’గా మన ముందుకు రానుంది.

Published : 22 Dec 2021 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఫిదా’లో భానుమతిగా సందడి చేసింది.. ‘ఎంసీఏ’లో పల్లవిగా నవ్వించింది.. లవ్‌స్టోరీలో ‘మౌనిక’గా మెప్పించింది ప్రముఖ కథానాయిక సాయిపల్లవి. ఈసారి ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో  వైవిధ్య పాత్రలో కనిపించనుంది. అందులో దేవదాసి ‘మైత్రి’గా మన ముందుకు రానుంది. ఈ చిత్రం డిసెంబర్‌ 24న థియేటర్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎన్నో ఆసక్తికర విషయాలను మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు మీకోసం..

‘శ్యామ్‌ సింగరాయ్‌’లో మైత్రి పాత్ర కోసం ఎలాంటి హోం వర్క్‌ చేశారు?

సాయిపల్లవి: ప్రతి చిత్రంలో కథను.. అందులోని నా పాత్రను నమ్మే చేస్తా. అలాగే ఏదైనా సినిమా స్క్రిప్ట్‌ చదువుతున్నప్పుడు ఆ పాత్రను ఈ విధంగా పోషించవచ్చని మనకు ఓ ఐడియా ఉంటుంది.  మొదటిసారి ఈ స్క్రిప్ట్‌  చదివినప్పుడు దేవదాసి ఎలా ఉంటుందని తెలుసుకున్నా.. కానీ, ఈ పాత్ర పోషిస్తున్నప్పుడు.. పాత్ర కన్నా దేవదాసి సైకాలజీ గురించి తెలుసుకున్నా. ఆ విషయం నాకు బాగా నచ్చింది. వేరే చిత్రాల్లో చేసిన క్యారెక్టర్స్‌ కన్నా ఇందులో దేవదాసి సైకాలజీని ఆకళింపు చేసుకుని నటించేందుకు ప్రయత్నించా.

మీరు ఓ కథకు ఓకే చెప్పారంటే.. కచ్చితంగా ఆ పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని నమ్ముతాం. దాని గురించి ఏమంటారు?

సాయిపల్లవి: వెరీ స్వీట్‌. థ్యాంక్స్‌ అండీ. ఏ పాత్రైనా నాకు మాత్రం నచ్చితే సరిపోదు. మీకు నచ్చాలి కదా! మీకు కూడా నచ్చిందంటే చాలా సంతోషం.

మీకు వచ్చే పాత్రల్లో డ్యాన్స్‌కి ప్రాధాన్యత ఉంటుంది. మరి ఇందులో మీ డ్యాన్స్‌ ఎలా ఉంటుంది?

సాయిపల్లవి: ‘లవ్‌స్టోరీ’లోనే డ్యాన్స్‌ పరంగా పెద్దరోల్‌ పోషించాననుకుంటా. కానీ, ‘శ్యామ్‌ సింగరాయ్‌’కి మాత్రం ఎంత కావాలో అంతే పెట్టారు. ‘లవ్‌స్టోరీ’ అంత డ్యాన్స్‌ ఇందులో ఉండదు. మొన్న విడుదలైన ‘ప్రణవాలయ’ పాటలో కూడా ఎంత కావాలో అంతే డ్యాన్స్‌ ఉంటుంది. నిజానికి నాకు క్లాసికల్‌ డ్యాన్స్‌ రాదు. ఇప్పటి వరకూ నేర్చుకోలేదు కూడా. కానీ, దర్శకుడు రాహుల్‌ నేను చేయగలనని నమ్మారు. ప్రణవాలయ పాట డ్యాన్స్‌ గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా 10-20 ఏళ్ల నుంచి క్లాసికల్‌ డ్యాన్స్‌ చేస్తున్నవారే. అందుకే వాళ్లతో కలిసి డ్యాన్స్‌ చేస్తుంటే చాలా భయం వచ్చేసింది(నవ్వులు). మీరు ఆ సాంగ్‌ను గమనిస్తే.. అందరూ ఒకేలా చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే నాకు సక్సెస్‌. ఆ విషయంలో సంతోషంగా ఉన్నా.

ఈ సినిమా ప్రమోషన్‌ ఈవెంట్స్‌.. ప్రీ రిలీజ్‌ ఈవెంట్, ఇంటర్వ్యూలు.. ఇలా ఎక్కువ కనిపిస్తున్నారు!

సాయిపల్లవి: చేయాలి కదా! ‘లవ్‌స్టోరీ’ చిత్రానికి చేశాను. ఎంసీఏ చిత్ర ప్రమోషన్స్‌ వరంగల్‌లో జరిగినప్పుడు నాకూ నా చెల్లికి వైరల్‌ ఫీవర్‌ వచ్చింది. కాబట్టి విశ్రాంతి తీసుకున్నా. ఆ తరువాత అన్ని సినిమాల ప్రమోషన్స్‌కి వచ్చా.

ఈ చిత్రంలో మీ లుక్‌, మేకప్‌ గురించి చెప్పండి!

సాయిపల్లవి: ముఖ్యంగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో ఆర్ట్‌ పీరియడ్‌ గురించి ఎక్కువగా చెప్పే అవకాశం వచ్చింది. కాబట్టి దాని గురించి ఏది చెప్పినా ప్రేక్షకులకు డిఫరెంట్‌ అనుభూతి ఉంటుంది. రియల్‌గా చూపించే అవకాశం ఉంటుంది. ఇక నా పాత్ర లుక్‌ పరంగా.. లెన్స్ పెట్టారు. హెయిర్‌స్టైల్‌ మార్చారు. కాస్ట్యూమ్స్‌ కూడా వేరే వేరే రంగులు ఎంచుకున్నారు. ఒకే నెలలో 4-5 సార్లు ఫొటో షూట్స్‌ చేసి ఏది కర్టెక్‌గా ఉందో అదే ఫిక్స్‌ చేశారు.

దేవదాసి పాత్ర కోసం మీరేమైనా రీసెర్చ్‌ చేశారా?

సాయిపల్లవి: దేవదాసి వ్యవస్థ గురించి స్కూల్‌లోనే చదువుకున్నాం కదా! కాబట్టి ఓ ఐడియా ఉంది. ఆ టైంలో వాళ్లంతా దేవుడికి సేవకులుగా ఉన్నారు. రోజులు గడిచే కొద్దీ ఆ వ్యవస్థను వేరేలా మార్చేశారు. బయట ఉన్న వాళ్లు కూడా దాన్ని చెడుగా చూశారు. దేవదాసీల గురించి ఇండియా మొత్తం చెడుగానే వ్యాప్తించింది. కొన్ని ప్రదేశాల్లో దేవాదాసీలకు కాళ్లకు పచ్చబొట్లు పొడుస్తారు. బయట ఉన్న అమ్మాయికీ గుడి నుంచి వచ్చిన అమ్మాయికి తేడా తెలుసుకునేందుకు ఇలా చేసేవారట. అయితే సినిమా పరంగా ఎంత చూపించాలో దర్శకుడు రాహుల్‌, నేనూ చర్చించాం. ఇందులో శ్యామ్‌ పాత్ర కూడా ఉంటుంది కాబట్టి ఎంత మేరకు దేవదాసిగా చూపించవచ్చో అంతే చూపించాం. అంతే కానీ దేవదాసి వ్యవస్థ గురించి ఉండదు.

ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో స్టేజీ మీద కన్నీళ్లు వచ్చాయి కదా!

సాయిపల్లవి: మనకు పాటలు పాడటం రానప్పుడు పాటలు విని.. డ్యాన్స్‌ చేయడం రాకపోతే డ్యాన్స్‌ చూసి ఎంజాయ్‌ చేస్తాం. నాకు డ్యాన్స్‌ రావడం అనేది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదంగా భావిస్తా. ఆ రోజు స్టేజీ మీద అనురాగ్‌ కుల్‌కర్ణి పాడిన తర్వాత, డ్యాన్సర్స్‌ వచ్చి డాన్స్‌ చేశారు. అది చూసి నాకు భావోద్వేగంతో కన్నీళ్లు ఆగలేదు. అలాగే ప్రేక్షకులు నా మీద చూపిస్తున్న ప్రేమను చూసి ఎమోషనల్‌ అయ్యా.

దేవదాసి పాత్రకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యారా? లేదా క్యారెక్టర్‌ పరంగా కనెక్ట్‌ అయ్యారా?

సాయిపల్లవి:  క్యారెక్టర్‌ పరంగానే కనెక్ట్‌ అయ్యా. అన్ని చిత్రాలకూ మనం క్యారెక్టర్‌కు కనెక్ట్‌ అయితేనే.. ఆ పాత్ర  ఇంకొంచెం డిఫరెంట్‌గా వస్తుందని నేను నమ్ముతా. లేదంటే అందులోని తేడా తెలిసిపోతుంది. ఈ చిత్రంలో మాత్రం సాయిపల్లవిలా కాకుండా దేవదాసిగా కనిపిస్తాననే నేను నమ్ముతా.

నానితో మీకిది రెండో చిత్రం కదా! ఆ ప్రయాణం ఎలా సాగింది. ఆయనతో నటించేటప్పుడు ఎంత సౌకర్యంగా ఫీల్‌ అయ్యారు?

సాయిపల్లవి: ‘ఎంసీఏ’ చిత్రంలో మా ఇద్దరికి 20-30 శాతమే సీన్స్‌ ఉన్నాయి. అక్కడ కూడా ప్రేమ సన్నివేశాలే. నేను కూడా అక్కడ నాలానే ఉన్నా. నాని కూడా అతడిలానే ఉన్నారు. ఇద్దరం వైవిధ్యంగా ప్రయత్నించలేదు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో మా ఇద్దరి పాత్రలు వేరేలా ఉంటాయి. మా మధ్య వచ్చే సన్నివేశాల్లో బలమైన ఎమోషన్‌ ఉంటుంది. ఇక కంఫర్ట్‌ పరంగా చూస్తే అప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు అలానే ఉంది. కానీ పాత్రపరంగా చర్చలు, పనిపరంగా మాటలు ఉండేవి.

యాక్టింగ్‌, డ్యాన్స్‌ కాకుండా మీ జీవితంలో మీకు ఆసక్తికరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా?

సాయిపల్లవి:  నాకు నా గురించి తెలుసుకోవడమంటే  చాలా ఆసక్తి. ఎందుకంటే సందర్భానుసారం ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తా. డ్యాన్స్‌, యాక్టింగ్‌, మెడిసిన్‌ కాకుండా ధ్యానం ఇష్టం. ఆ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. కొన్ని రోజుల క్రితం నాకు తెలిసిన ఓ వ్యక్తి బెంగళూరులోని ఒక సెంటర్‌ గురించి చెప్పారు. అక్కడ పాడ్‌ (టబ్‌) లాగా ఉంటుంది. అందులో ఎప్సమ్‌ సాల్ట్‌ వేసి అందులో కొంచెం సేపు ఉంటే మనకు తెలియని అనుభూతి వస్తుందట. ఆ విషయం నాకు ఆసక్తిగా అనిపించింది. 

 

ఈ సినిమా దేవదాసిగా కనిపించేందుకు ఏదైనా పరిధి అడ్డంకిగా మారిందా?

సాయిపల్లవి: లేదు. రాహుల్‌తో ఇంకా లోతుగా ఎలా చేయొచ్చనే అడిగా. ఆయన కథకు ఇంతే కావాలని చెప్పారు. అంతే చేశా. ఈ సినిమా కాకుండా వేరే సినిమాలో పూర్తిగా దేవదాసి పాత్ర వస్తే ఇంకా ఎక్కువ చేయగలుగుతానేమో.

ఇలాంటి  సినిమా, పాత్రలు చేయాలని గతంలో అనిపించిందా?

సాయిపల్లవి:  పౌరాణిక పాత్రలు చేయాలని ఉండేది. ఇలాంటి పాత్రలను పోషించాలని నేనేమీ అనుకోలేదు.

‘శ్యామ్‌ సింగరాయ్‌’ అంతా పీరియడ్‌ డ్రామాలా ప్రచారం చేస్తున్నారు. ఇది సీరియస్‌గా ఉంటుందా లేక సందేశమిచ్చేలా ఉంటుందా?

సాయిపల్లవి: నేర్పించడంలా మాత్రం ఉండదు. ఆ విషయం సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. రిలీజ్‌ తరువాత ఈ విషయం గురించి మాట్లాడుతా. దేవదాసి, శ్యామ్‌ సింగరాయ్‌ గురించి చదవడంలా ఉండదు. కేవలం వాళ్ల జీవితాల గురించి తెలుసుకుంటారు అంతే.

సంప్రదాయపరంగా కోల్‌కతాకు మనకూ ఉన్నా తేడాలేంటి?

సాయిపల్లవి:  సంప్రదాయం గురించి తెలుసుకునేంత ఎక్కువ రోజులు అక్కడ నేను గడపలేదు. ఎటూ వెళ్లడానికి ఉండేది కాదు. మేము కోల్‌కతాలో ఎక్కడికి వెళ్లినా నన్ను గుర్తుపట్టేవారు. హైదరాబాద్‌లో నన్ను ఎంత ఆప్యాయంగా చూసుకున్నారో.. అక్కడా అంతే. వాళ్లపని ఆపుకొని వచ్చి ప్రేమగా పలకరించేవారు. మమ్మల్ని సినిమా వాళ్లలా చూడకుండా వేరే ప్రాంతం నుంచి వచ్చామని సౌకర్యంగా ఉన్నామా లేమా అని అడిగేవారు.

దర్శకుడు రాహుల్‌ టేకింగ్‌ గురించి చెప్పండి

సాయిపల్లవి:  రాహుల్‌ చాలా క్లారిటీ ఉన్న దర్శకుడు. ఒక్కోసారి నేను, నాని పాత్రలకు సంబంధించి సలహాలు ఇచ్చే వాళ్లం. అయినా సరే! దర్శకుడిగా తనకంటూ ఓ క్లారిటీ ఉంటుంది. సినిమాలో వచ్చే చివరి సన్నివేశమే మేము ఫస్ట్‌ షూట్‌ చేసిన సీన్. మేము గందరగోళానికి గురైనా రాహుల్‌ మాత్రం క్లారిటీగా, నమ్మకంగా ఉండేవాడు.

ఈ సినిమాలో నానితో కాకుండా ఇంకా ఎవరితో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్నారు.

సాయిపల్లవి: ఓ తాతయ్యతో కలిసి పని చేశా. ఆయన ఫొటోస్ కూడా తీశాను. ఆయన సత్యజిత్‌రే చిత్రాల్లో కూడా పనిచేశారు. వ్యక్తిగతంగా ఆయన నాకు ఎంతో నచ్చారు. అందుకే వెళ్లి ‘మీతో ఒక ఫొటో దిగొచ్చా’ అని అడిగి మరీ దిగాను. సినిమాలో ఆయన జీవించారని చెప్పడం కూడా తక్కువేనేమో. అందులో ఆయన సిగెరెట్‌ స్మోక్‌ చేసే సన్నివేశం చాలా స్టైల్‌గా ఉంటుంది. ఒక హీరో ఎలా స్మోక్‌ చేస్తారో అలానే చేశారు. అలాగే రాహుల్‌ రవీంద్రన్‌తోనూ సన్నివేశాలూ ఉన్నాయి.

సాయిపల్లవి ఉన్నారంటే అంచనాలు ఎక్కువగా ఉంటాయి.. మీరేమంటారు!

సాయిపల్లవి: మీరు నన్ను భయపెడుతున్నారండీ (నవ్వులు). నేను ఒక సినిమా చూస్తున్నప్పుడు ఎలా ఎంజాయ్‌ చేస్తానో అలానే స్క్రిప్ట్‌ని విని నచ్చాకే ఓకే చెబుతా. అలాగే ఆ పాత్ర పోషించినందుకు నాకు ప్రయోజనం ఉండాలి. ‘ఫిదా’లో భాను తరువాత ఎంసీఏలో చిన్ని పాత్ర చేస్తున్నా అంటే ఆ టీమ్‌లో ఉన్నవాళ్లు పల్లవి అసౌకర్యంగా ఫీల్‌ అవుతుందేమోనని అనుకున్నారు. కానీ, నేను మాత్రం ప్రయత్నిద్దాం అని ఎంసీఏ చేశా. అయితే షూట్‌ చేస్తున్నప్పుడే నేను ఎంసీఏలో కంఫర్ట్‌బుల్‌ కాదని అర్థమైంది. అదే రెండు పాత్రలకు ఉన్న డిఫరెన్స్‌. 

ఏ సినిమాలోనైనా హీరో పోస్టరే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. కానీ సాయిపల్లవి ఉన్నారంటే దృష్టంతా మీవైపే వెళ్తుంది!

సాయిపల్లవి:  ఈ మాట విన్నాక  సంతోషంగా ఉంది. నిజానికి నేను అంత ఆలోచించను. అన్నింటికన్నా నాకు సినిమా అంటే పిచ్చి ప్రేమ. మీరు ఎంజాయ్‌ చేసి చూస్తే అదే నాకు ఆనందం. ఇక ఇందులో నాని పాత్ర ఐడియాలజీ గురించి డైలాగ్స్‌ ఉంటాయి. నా పాత్ర అంతా కళ్లతో చెప్పగలిగా. నా డైలాగ్స్‌ అన్ని ఎమోషన్స్‌తో నిండి ఉంటాయి.

ట్రైలర్‌లో ఆత్మాభిమానం కన్నా ఏది గొప్పది కాదు అనే డైలాగ్‌ ఉంది. ఆ మాటతో అమ్మాయిలకు సందేశం ఏమైనా ఇద్దామనుకుంటున్నారు!

సాయిపల్లవి:  అమ్మాయిలు మొదట వాళ్లని వారు గౌరవించుకోవాలి. అప్పుడే వాళ్లు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుస్తుంది.  అలాగే ఆత్మవిశ్వాసమూ ఉండాలి. మిమ్మల్ని కరెక్ట్‌ చేసేవారూ ఉండాలి. మిమ్మల్ని మీరు చెక్‌ చేసుకోవాలి. ఎందుకంటే నేను నా విషయంలో ఆత్మాభిమానంతో ఉంటాను.

ఈ సినిమాలో మీ పాత్రకు అవార్డు వస్తుందని ఆశించవచ్చా?

సాయిపల్లవి:  ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనే పెద్ద అవార్డు అంతకు మించి ఏమీ కోరుకోను.

తదుపరి చిత్రాలేమిటి?

సాయిపల్లవి:  రానాతో ‘విరాటపర్వం’. తమిళంలో మరో చిత్రం చేస్తున్నా. ఆ సినిమా వివరాలు త్వరలో చెబుతా. వెబ్‌ కంటెంట్‌ కథలు వింటున్నా. నచ్చితే చేస్తా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని