Updated : 14 Jun 2022 21:46 IST

sai pallavi: అది నా బాధ్యత.. ‘ప్రేమమ్‌’ నుంచి అలవాటైంది: సాయి పల్లవి

తాను పోషించిన వెన్నెల పాత్ర తెల్లకాగితంలాంటిదని, దర్శకుడు ఆ పాత్రని చాలా నిజాయతీగా రాశారని అంటున్నారు కథానాయిక సాయి పల్లవి(sai pallavi). రానా(Rana)తో కలిసి ఆమె నటించిన చిత్రం ‘విరాట్‌ పర్వం’ (virata parvam). వేణు ఊడుగుల దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సాయిపల్లవి పంచుకున్న విశేషాలు...

వేణు ఊడుగుల కథ చెప్పినపుడు మీ మొదట రియాక్షన్ ?

సాయిపల్లవి: కొత్తగా అనిపించింది. నాటి పరిస్థితుల గురించి తెలుసుకుంటున్నప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళుతున్న భావన కలిగింది. ఇప్పుడు అందరికీ స్వేచ్ఛ ఉంది.  నాటి పరిస్థితులు, సమయం గురించి దర్శకుడు వేణు చాలా విషయాలు నేర్పారు. తెలియకుండా ఉన్న కథ చేయడంలో మజా ఉంటుంది. తెలిసిన కథ మళ్లీమళ్లీ చేస్తే ఎప్పుడు నేను ఉండేలానే ఉంటాను. ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్తే నటి ఇంకా నేర్చుకునే అవకాశం వస్తుంది. నన్ను నేను సవాల్ చేసుకున్నట్లు ఉంటుందని విరాట పర్వం చేశాను.  ఇసుకతో బొమ్మ తయారు చేసుకోవచ్చు.. ఇల్లు కట్టుకోవచ్చు.. ఆయుధంగా కూడా మలుచుకోవచ్చు. వెన్నెల పాత్ర కూడా అలానే అనిపించింది. వెన్నెల ఒక తెల్లకాగితం. దానిపై ఏది రాస్తే అదే ఆమె అవుతుంది. దర్శకుడు ఆ పాత్రని చాలా నిజాయతీగా రాశారు.

రానాలాంటి స్టార్ ఉన్నప్పటికీ విరాట పర్వం వెన్నెల కథే అని చెబుతున్నారు కదా?

సాయిపల్లవి: దర్శకుడు వేణు మొదట నిర్మాతలు సుధాకర్, శ్రీకాంత్‌ తర్వాత నాతో మాట్లాడారు. ఈ స్క్రిప్ట్ సురేష్‌బాబుగారి  దగ్గరికి వెళ్ళిన తర్వాత రానా రవన్న పాత్ర చేస్తారని తెలిసింది. చాలా ఆనందంగా అనిపించింది. రానా స్టార్ డమ్, స్థాయి, ఆయనకి ఉన్న వాయిస్‌కి రవన్న పాత్ర గొప్పగా నప్పుతుందనిపించింది. రానా వచ్చిన తర్వాత విరాట పర్వం స్కేల్ మారిపోయింది. రానా కథల ఎంపిక కూడా అద్భుతంగా ఉంటుంది.

సరళ కుటుంబాన్ని కలవడం ఎలా అనిపించింది?

సాయిపల్లవి: సరళ గారి కుటుంబాన్ని కలవడం చాలా ఎమోషనల్ మూమెంట్. చాలా ఆప్యాయంగా మాట్లాడారు. అమ్మ నన్ను దీవించి చీర కానుకగా ఇచ్చారు.  నిజంగా ఆ సమయంలో జరిగిన విషయాలన్నీ మనకు తెలీవు. దీన్ని ఒక కథలానే అప్రోచ్ అయ్యా.

వెన్నెల పాత్ర చేయడం ఒక ఆర్టిస్ట్‌గా ఎలా అనిపించింది? కష్టంగా ఫీలయ్యారా?

సాయిపల్లవి: ఏ ఆర్టిస్ట్‌ అయినా ఎప్పుడూ కొత్తదనం వైపు అడుగులు వేస్తుండాలి. ఒకే క్వశ్చన్‌ పేపర్‌కు అవే ఆన్సర్లు రాస్తూ ఉంటే కిక్‌ ఉండదు. కొత్తగా చేశాం, నేర్చుకున్నాం అనే తృప్తి ఉండాలి.  ప్రతి పాత్రకీ  కొంత బాధ, ఒత్తిడి ఉండటమే కరెక్ట్. లేదంటే బోర్ కొడుతుంది. ఇందులో కొన్ని యాక్షన్‌ సీన్స్‌కూడా చేశా.

ప్రియమణి, నందితా దాస్ లాంటి నటులతో పని చేయడం ఎలా అనిపించింది ?

సాయిపల్లవి: ప్రియమణి, నందితా దాస్ నటనతో ప్రేరణ పొందుతాను. విరాట పర్వంలో వారితో నటించినప్పుడు  ఎలాంటి ఒత్తిడి తీసుకోలేదు. కానీ ఇప్పుడు సినిమా చూసినప్పుడు ఫ్రేంలో వారితో  నేను ఉన్నానా అనే ఫీలింగ్ కలిగింది. ఇది మంచి అనుభూతి.

మీకున్న ఇమేజ్ కొన్ని సినిమాలు చేయడానికి అడ్డుపడుతుందని భావిస్తున్నారా ?

సాయిపల్లవి: లేదండీ. ప్రేక్షకుల ప్రేమనే తీసుకుంటాను తప్ప ఇమేజ్ ఎప్పుడూ తీసుకోను.  మంచి సినిమా, కథ చేయాలనే  ఒత్తిడి ఉంటుంది తప్ప ఇమేజ్ గురించి ఎప్పుడూ ఆలోచించను. సినిమా ఆలస్యం కావడంతో కొంచెం కంగారు పడిన మాట వాస్తవమే. విరాట పర్వానికి ఇదే సరైన సమయం. ఇప్పుడు ప్రేక్షకులు మళ్లీ థియేటర్ కి వస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలు చూస్తున్నారు. విరాట పర్వం కూడా వారికి తప్పకుండా నచ్చుతుంది. చాలా నిజాయతీ గల సినిమా ఇది.

ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటారు కదా?

సాయిపల్లవి: ఇది నా బాధ్యత. ‘ప్రేమమ్’ నుంచి ఇది నాకు అలవాటు. ఒక సినిమాని ఏ నమ్మకంతో చేశామో ప్రేక్షకులకు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంటుంది. కొన్నిసార్లు ఆడియన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పాల్సి ఉంటుంది. మన సినిమాని మనం ప్రమోట్ చేయకపోతే ఎవరు చేస్తారు.

దర్శకుడు వేణు ఊడుగులతో పనిచేయటం ఎలా అనిపించింది?

సాయిపల్లవి: ఆయన గొప్ప రచయిత. ఈ సినిమా కోసం ఎంతో రీసెర్చ్ చేసి చాలా సహజంగా తీర్చిదిద్దారు. ఇలాంటి గ్రిప్పింగ్ కథలు మరెన్నో రాయాలని ఆశిస్తున్నా.

తర్వాత చేయబోయే సినిమాల గురించి?

సాయిపల్లవి: గార్గి సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. తెలుగులో కథలు చదువుతున్నా. శివకార్తికేయన్‌తో తమిళ్‌లో ఒక సినిమా సైన్ చేశాను.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని