Sai pallavi:నా గురించి నేను తెలుసుకోవాలి

‘‘నన్ను నమ్మి మంచి పాత్రల్ని ఇస్తున్నారు దర్శకులు. నాపైన అంతే నమ్మకంతో ప్రేక్షకులు థియేటర్‌లోకి వచ్చి కూర్చుంటున్నారు. వాళ్లకు నా నటన నచ్చిందంటే అదే పెద్ద పురస్కారం’’ అంటోంది సాయిపల్లవి

Updated : 22 Dec 2021 05:51 IST

‘‘నన్ను నమ్మి మంచి పాత్రల్ని ఇస్తున్నారు దర్శకులు. నాపైన అంతే నమ్మకంతో ప్రేక్షకులు థియేటర్‌లోకి వచ్చి కూర్చుంటున్నారు. వాళ్లకు నా నటన నచ్చిందంటే అదే పెద్ద పురస్కారం’’ అంటోంది సాయిపల్లవి. బలమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల మనసుల్ని దోచేస్తున్న నాయిక ఈమె. హీరోలతో సమానంగా క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ‘లవ్‌స్టోరి’తో ఆకట్టుకున్న ఈమె, ఇటీవల ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో నటించింది. నాని కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సాయిపల్లవి మంగళవారం హైదరా బాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.  

ఈ సినిమా వేడుకలో భావోద్వేగానికి గురయ్యారు. కారణం?

అది కృతజ్ఞతతో కూడిన భావోద్వేగం. నేను చేసే పని చాలా మందికి సంతోషాన్ని ఇస్తుందంటే అది ఎంతో ప్రత్యేకం! నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నాపై ఇంతగా ప్రేమని ప్రదర్శిస్తున్న ప్రేక్షకులకు రుణపడ్డా. వాళ్లందరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకున్నా. ఆ క్రమంలోనే భావోద్వేగానికి గురయ్యా. దాంతోపాటు వేదికపై అనురాగ్‌ కులకర్ణి పాడారు. ఆ తర్వాత డ్యాన్స్‌ చేశారు. నేను అందరికీ కథానాయికనే కావొచ్చు కానీ, నాకు నేను సాయి పల్లవినే. ఒక కళను ఆస్వాదించడం అనేది మనందరికీ దేవుడు ఇచ్చిన వరం. మనకు ఏమీ రాకపోయినా కళని ఆస్వాదిస్తాం. అలా ఆరోజు వేదికపై కళల్ని ఆస్వాదిస్తూ కూడా భావోద్వేగానికి గురయ్యాను.

ఇందులో దేవదాసి పాత్రని చేశారు. ఆ పాత్ర గురించి దర్శకుడు చెప్పినప్పుడు మీ మనసులో కలిగిన అభిప్రాయాలు ఎలాంటివి?

ప్రతి సినిమానీ నమ్మకం కలిగితేనే చేస్తాం. ఈ స్క్రిప్ట్‌ చదివేటప్పుడు కూడా ‘సినిమా ఇలా ఉంటుంది, నా పాత్రని ఇలా చేయొచ్చు’ అని ఓ అంచనాకి వచ్చా. చిన్నప్పుడు మనందరం చరిత్ర చదువుకున్నాం కదా. అందులో పాత్రల్ని ఊహించుకుంటూ ఆ పాఠాలతో ప్రయాణం చేస్తాం. అలాంటి ఓ పాత్రని చేసే అవకాశం నాకొచ్చింది. ఇందులోని దేవదాసి పాత్ర గురించి చెప్పినప్పుడు దాన్ని ఎలా చేయాలనేదానికంటే కూడా, వాళ్ల సైకాలజీ ఎలా ఉంటుందో దర్శకుడు చెప్పడం నాకు బాగా నచ్చింది.  

పాత్ర కోసమని మీరు ప్రత్యేకంగా ఏమైనా పరిశోధన చేశారా?

దేవదాసి వ్యవస్థ గురించి పాఠశాలలో చదివా. దేవదాసీలు ఆరంభంలో దేవుడికి సేవకులుగా ఉన్నారు. తర్వాత వాళ్లని చూసే కోణం మారింది. అలా కొన్ని విషయాలు తెలుసుకుని నటించా. ఎలాంటి పరిమితులు లేకుండా నటించా. చేసే ప్రతి పాత్రతోనూ, వాటి భావోద్వేగాలతోనూ నేను కనెక్ట్‌గా అవుతుంటాను. అప్పుడే తెరపై పాత్ర పండుతుంది. లేదంటే ఇందులో దేవదాసి కాకుండా సాయిపల్లవి కనిపించే ప్రమాదం ఉంటుంది.

నానితో ఇది మీకు రెండో సినిమా. ఆయనతో పనిచేయడం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?

‘ఎం.సి.ఎ’లో నాకూ..నానికీ మధ్య సన్నివేశాలు తక్కువ. నిజ జీవితంలో నేనెలా ఉంటానో, అందులో అలాగే ఉన్నా. నాని పాత్ర కూడా అంతే. భిన్నంగా ఏమీ చేయలేదు. ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో మా పాత్రలు పూర్తి భిన్నం. ప్రేమ సన్నివేశాలు లోతుగా ఉంటాయి. అప్పుడైనా ఇప్పుడైనా అంతే సౌకర్యంగా మేం నటించాం. ఈ సినిమాలోని పాత్రల కోసం మేం ఎక్కువగా చర్చించుకుంటూ పనిచేశాం.

నృత్యంలో మీకున్న పట్టు ప్రతి సినిమాకీ ప్లస్‌ అవుతోంది. నటన, డ్యాన్స్‌ కాకుండా మీకు నచ్చే మరో అంశం ఏమిటి?

డ్యాన్స్‌ నేనెక్కువగా చేసిందంటే ‘లవ్‌స్టోరి’లోనే. ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో ఎంత అవసరమో, అంతే ఉంటుంది. ఒక్క పాటలో క్లాసికల్‌ డ్యాన్స్‌ చేశా. డ్యాన్స్‌, నటన కాకుండా మెడిసిన్‌ అంటే ఇష్టం. దాంతోపాటు నాకు ప్యాషన్‌ అంటే నా గురించి నేను తెలుసుకోవడం. నా గురించి, పరిస్థితుల గురించి మరింత లోతుగా ఆలోచించాలని ఉంటుంది. మెడిటేషన్‌ చేయాలనుకుంటున్నా.

కొత్త సినిమాల కబుర్లు చెబుతారా?

గత మూడేళ్లుగా చేసిన సినిమాలే ఇప్పుడు వరుసగా వస్తున్నాయి. ‘విరాటపర్వం’ చిత్రీకరణ పూర్తయింది. డబ్బింగ్‌ చెప్పడమే మిగిలింది. దాంతోపాటు ఓ తమిళ సినిమా చేశా. వెబ్‌ సిరీస్‌లకి సంబంధించి కూడా కొన్ని స్క్రిప్ట్‌లు చదువుతున్నా. నచ్చితే చేస్తా. ప్రస్తుతానికి ఇంతే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని