Sai Pallavi: టాక్‌షో వేదికగా మీటూపై సాయిపల్లవి వ్యాఖ్యలు

ప్రముఖ గాయని స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్‌ షో ‘నిజం విత్‌ స్మిత’ (Nijam With Smita). తాజాగా ఈ కార్యక్రమంలో నటి సాయిపల్లవి సందడి చేశారు.  

Updated : 09 Mar 2023 14:50 IST

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘మీటూ’ (Me too) ఉద్యమంపై నటి సాయిపల్లవి (Sai Pallavi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చేతలతోనే కాదు మాటలతో ఎదుటివ్యక్తికి ఇబ్బందికలిగించేలా చేసినా అది వేధింపులతో సమానమేనంటూ ఆమె తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్‌ షో ‘నిజం’ (Nijam)లో పాల్గొన్న సాయిపల్లవి.. తన కెరీర్‌, తగిలిన ఎదురుదెబ్బలు ఇలా ఎన్నో విషయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ప్రోమో తాజాగా విడుదలైంది.

‘‘ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌.. ఈ ముగ్గురిలో ఎవరితో డ్యాన్స్‌ చేయాలని అనుకుంటున్నావు?’’ అని స్మిత (Smita) ప్రశ్నించగా.. ‘‘ఆ ముగ్గురూ నాతో ఒక పాట చేస్తే బాగుంటుంది’’ అంటూ సాయిపల్లవి (Sai Pallavi) నవ్వుతూ బదులిచ్చారు. ‘‘ఒకప్పుడు మీటూ ఉద్యమం ప్రకంపనలు సృష్టించింది. సోషల్‌మీడియాలో ఎంతోమంది దీనిపై గళమెత్తారు. ఈ ఉద్యమం గురించి మీ ఉద్దేశం ఏమిటి?’’ అని స్మిత అడగ్గా.. ‘‘మీరు శారీరకంగా వేధింపులకు గురిచేయకపోవచ్చు. కానీ, మీ మాటలతో పక్కవారిని ఇబ్బందిపెట్టినా అది వేధింపులతోనే సమానం’’ అని ఆమె (Sai Pallavi) పేర్కొన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. ‘విరాటపర్వం’ (Virata Parvam), ‘గార్గి’ (Gargi) వంటి విభిన్నమైన చిత్రాలతో సాయిపల్లవి (Sai Pallavi) గతేడాది ప్రేక్షకులను అలరించారు. లైంగిక వేధింపుల నేపథ్యంలో వచ్చిన ‘గార్గి’ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైనప్పటికీ.. సాయిపల్లవి యాక్టింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఈ రెండు చిత్రాల తర్వాత ఆమె నుంచి కొత్త సినిమా అప్‌డేట్‌లు రాలేదు. అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా నటిస్తోన్న ‘పుష్ప -2’(Pushpa 2)లో ఆమె నటించే అవకాశం ఉందని గత కొన్నిరోజుల నుంచి ప్రచారం జోరందుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు