SaiPallavi Gargi Review: రివ్యూ: గార్గి

సాయిపల్లవి నటించిన ‘గార్గి’ సినిమా ఎలా ఉందంటే..?

Published : 15 Jul 2022 09:58 IST

SaiPallavi Gargi Review చిత్రం: గార్గి; న‌టీన‌టులు: సాయిప‌ల్లవి, కాళీ వెంక‌ట్‌, క‌లైమణి శ‌ర‌వ‌ణ‌న్‌, ఆర్‌.ఎస్‌.శివాజీ, ఐశ్వర్య ల‌క్ష్మి, జ‌య‌ప్రకాష్, త‌దిత‌రులు; సంగీతం: గోవింద్ వ‌సంత‌; కూర్పు: ష‌ఫీక్ మ‌హ్మద్ అలీ; ఛాయాగ్రహ‌ణం: స్రైయంతి, ప్రేమ‌కృష్ణ; ర‌చ‌న‌, ద‌ర్శక‌త్వం: గౌత‌మ్ రామ‌చంద్రన్‌; నిర్మాత‌లు: ర‌విచంద్రన్‌, రామ‌చంద్రన్‌, థామ‌స్ జార్జ్‌, ఐశ్వర్య ల‌క్ష్మి, గౌత‌మ్ రామ‌చంద్రన్‌; స‌మ‌ర్పణ‌: రానా ద‌గ్గుబాటి; విడుద‌ల తేదీ: 15-07-2022

కెరీర్ ఆరంభం నుంచీ బ‌రువైన క‌థ‌ల్నే ఎంచుకుంటూ.. ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వ‌స్తోంది న‌టి సాయిప‌ల్లవి(Sai Pallavi). అందుకే ఆమె నుంచి ఓ సినిమా వ‌స్తుందంటే చాలు సినీప్రియులంతా  అటువైపే దృష్టి సారిస్తుంటారు. ఇటీవ‌లే ‘విరాట‌ప‌ర్వం’తో (Virata Parvam) వెన్నెల‌గా సంద‌డి చేసిన ఆమె.. ఇప్పుడు ‘గార్గి’గా(Gargi) బాక్సాఫీస్ ముందుకొచ్చింది. గౌత‌మ్ రామ‌చంద్రన్ తెర‌కెక్కించిన చిత్రమిది. దీన్ని త‌మిళంలో సూర్య - జ్యోతిక దంప‌తులు.. తెలుగులో ద‌గ్గుబాటి రానా స‌మ‌ర్పిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇక‌ టీజ‌ర్‌, ట్రైల‌ర్లు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. మ‌రి ఈ గార్గి (Gargi Review) క‌థేంటి? ఆమె ప్రయాణం ప్రేక్షకుల్ని ఏమేర ఆక‌ట్టుకుంది?

క‌థేంటంటే: గార్గి (సాయిప‌ల్లవి) (Sai Pallavi) ఓ ప్రైవేట్ స్కూల్‌ టీచ‌ర్. ఆమె తండ్రి బ్రహ్మానందం (ఆర్‌.ఎస్‌.శివాజీ) (RS Shivaji) ఓ అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తుంటారు. ఆ అపార్ట్‌మెంట్‌లో ఒక‌రోజు తొమ్మిదేళ్ల బాలిక‌పై అత్యాచారం జ‌రుగుతుంది. ఆ కేసులో ఆరు ప‌దుల వ‌య‌సున్న బ్రహ్మానందాన్ని కూడా అరెస్ట్ చేస్తారు. అయితే త‌న తండ్రి ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని, అన్యాయంగా పోలీసులు ఆయ‌న‌పై త‌ప్పుడు కేసు పెట్టార‌ని గార్గి బ‌లంగా న‌మ్ముతుంది. న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కుతుంది. కానీ, ఆమె త‌ర‌ఫున వాదించేందుకు ఏ న్యాయ‌వాదీ ముందుకు రారు. ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆమెకు అండ‌గా నిల‌బ‌డిందెవ‌రు? ఈ న్యాయ పోరాటంలో ఆమెకు ఎదురైన స‌వాళ్లేంటి? ఆ అత్యాచార ఘ‌ట‌న త‌ర్వాత స‌మాజం నుంచి ఆమె కుటుంబం ఎలాంటి అవ‌మానాలు ఎదుర్కొంది? ఈ కేసు నుంచి గార్గి (Gargi) తండ్రి నిర్దోషిగా బ‌య‌ట‌కు వ‌చ్చాడా? లేదా? ఆఖ‌రికి ఏం జ‌రిగింది? అన్నది తెర‌పై చూడాలి.

ఎలా సాగిందంటే: ఇదొక భిన్నమైన కోర్టు డ్రామా సినిమా. అలాగ‌ని ఉత్కంఠ‌ రేకెత్తించే వాద ప్రతివాద‌నలు, అనూహ్య మ‌లుపులు ఎక్కడా క‌నిపించ‌వు. ఇది ఆద్యంతం ఓ ఎమోష‌న‌ల్ డ్రామాలా హృద‌యాన్ని క‌దిలిస్తూ ముందుకు సాగుతుంది. మ‌హిళ‌లు, ముఖ్యంగా మైన‌ర్ బాలిక‌ల‌పై జ‌రుగుతున్న అత్యాచార సంఘ‌ట‌న‌ల్ని స్పృశిస్తూ ఈ మ‌ధ్య కాలంలో చాలా చిత్రాలే వ‌చ్చాయి. అయితే ఇందులో బాధిత కుటుంబ మాన‌సిక వేద‌న‌, దోషిగా ముద్రప‌డిన వ్యక్తి కుటుంబం స‌మాజం నుంచి ఎదుర్కోనే వివ‌క్ష, సంఘ‌ర్షణ‌లను క‌ళ్లకు క‌ట్టిన‌ట్లు చూపించారు. అత్యాచార ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు బాధిత కుటుంబాల ప‌ట్ల‌, ఆ కేసుకు సంబంధించిన‌ నిందితుల కుటుంబాల‌ ప‌ట్ల మీడియా ప‌రిధి దాటి ఎలా అతిగా ప్రవ‌ర్తిస్తుందో.. త‌మ క‌థ‌నాల‌తో ప్రజ‌ల భావోద్వేగాల్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఆస‌క్తి రేకెత్తించేలా చూపించారు.

క‌థ‌గా చూస్తే.. గార్గిది చాలా చిన్న లైన్‌. అత్యాచార కేసులో అరెస్టైన తండ్రిని విడిపించుకోవ‌డం కోసం ఓ కూతురు చేసిన న్యాయ పోరాట‌మిది. అయితే ద‌ర్శకుడు ఈ క‌థ రాసుకున్న తీరు.. దాన్ని తెర‌పై ఆవిష్కరించిన విధానం ఆద్యంతం మెప్పిస్తుంది. ఆయ‌న తొలి సీన్ నుంచే ప్రేక్షకుల్ని నేరుగా క‌థ‌లోకి తీసుకెళ్లే ప్రయ‌త్నం చేశారు. ఓవైపు గార్గి ప‌రిచ‌య స‌న్నివేశాలు, అదే స‌మ‌యంలో న‌గ‌రంలో ఓ మైన‌ర్ బాలిక‌పై అత్యాచార ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు టీవీలో చూపించ‌డం.. క‌ట్ చేస్తే అదే రాత్రి ఆమె తండ్రి ఆ కేసులో ఓ నిందితుడిగా అరెస్టు కావడం.. ఇలా క‌థ చ‌క‌చ‌కా ప‌రుగులు తీస్తుంది. ఆ అరెస్ట్ త‌ర్వాత క‌థ‌లో వేగం మంద‌గిస్తుంది. అత్యాచార కేసులో త‌న తండ్రి అరెస్టైనట్లు బ‌య‌ట‌కు తెలిశాక‌ స‌మాజం, మీడియా నుంచి గార్గి కుటుంబం ఎదుర్కొనే సంఘ‌ర్షణ ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటూనే.. ప్రతిఒక్కరినీ కదిలిస్తుంది. అయితే ఈ ఎపిసోడ్‌ను మ‌రీ డీటైల్డ్‌గా చూపే ప్రయ‌త్నం చేయ‌డంతో సినిమా న‌త్తన‌డ‌క‌న సాగుతున్నట్లు అనిపిస్తుంది. తండ్రిని విడిపించుకోవ‌డం కోసం గార్గి (GARGi) కోర్టు మెట్లు ఎక్కడం.. ఆ స‌మ‌యంలో ఎలాంటి అనుభ‌వం లేని ఓ కొత్త లాయ‌ర్ ఆ కేసు టేక‌ప్ చేయ‌డంతో త‌ర్వాత ఏం జ‌ర‌గ‌నుందా? అన్న ఆస‌క్తి మొద‌ల‌వుతుంది. అయితే ఇందులో కోర్టు రూం సీన్స్ అంత ఆస‌క్తిక‌రంగా అనిపించ‌వు. కాకుంటే ఆ వాతావ‌ర‌ణం.. అక్కడ జ‌రిగే వాద ప్రతివాద‌న‌లు చాలా స‌హ‌జంగా, వాస్తవిక‌త‌కు ద‌గ్గర‌గా అనిపిస్తాయి. మ‌ధ్య మ‌ధ్యలో గార్గి బాల్యాన్ని, చిన్నత‌నంలో ఆమె ఎదుర్కొన్న చేదు సంఘ‌ట‌న‌ల్ని చూపించిన తీరు బాగుంది. విరామానికి ముందొచ్చే పాట క‌థ‌కు స్పీడ్ బ్రేక‌ర్‌లా అడ్డుతగులుతుంది. ఇంట‌ర్వెల్ సీన్ కాస్త మెలోడ్రామాలా అనిపించినా.. ద్వితీయార్ధంపై ఆస‌క్తి రేకెత్తించేలాగే ఉంటుంది. ఈ కేసులో గెలిచేందుకు గార్గి త‌న లాయ‌ర్‌తో క‌లిసి ర‌క‌ర‌కాల ప్రయ‌త్నాలు చేయ‌డం.. ఈ క్రమంలో బాధిత కుటుంబాన్ని క‌ల‌వ‌డం.. ఆ స‌మ‌యంలో పాప తండ్రి చెప్పే సంభాష‌ణ‌లు, ఆయ‌న ప‌డే ఆవేద‌న హృద‌యాన్ని బ‌రువెక్కిస్తాయి. క్లైమాక్స్ కొత్తగా.. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉంటుంది.

ఎవ‌రెలా చేశారంటే: గార్గి(Gargi) పాత్రలో సాయిప‌ల్లవి(Sai Pallavi) అద్భుతంగా ఒదిగిపోయింది. ఈ క‌థ‌కు ఆమె న‌ట‌నతో ప్రాణం పోసింది. భావోద్వేగ స‌న్నివేశాల్లో ఆమె న‌ట‌న క‌దిలిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్లో చాలా కొత్తగా క‌నిపిస్తుంది. లాయ‌ర్ గిరీశం క‌ప్పగంతుల పాత్రలో కాళీ వెంక‌ట్ చ‌క్కగా చేశారు. అమాయ‌కంగా క‌నిపిస్తూనే.. అక్కడ‌క్కడా న‌వ్వులు పూయిస్తుంటుందీ పాత్ర‌. బాలిక తండ్రిగా క‌లైమామ‌ణి న‌ట‌న హృదయాన్ని హత్తుకుంటుంది. ఈ క‌థ‌ని గౌత‌మ్ ఎంత మంచిగా రాసుకున్నారో.. తెర‌పై అంతే చ‌క్కగా ఆవిష్కరించారు. లైంగిక వేధింపుల‌కు సంబంధించిన స‌న్నివేశాల్ని ఎక్కడా అశ్లీల‌త‌, అస‌భ్యత‌కు తావులేకుండా దాని తాలూకూ ప్రభావాన్ని బ‌లంగా చూపించారు. మైనర్ అత్యాచార కేసును ఓ ట్రాన్స్‌జెండ‌ర్ అయిన జ‌డ్జి నేతృత్వంలో న‌డిపించ‌డం బాగుంది. ఓ మ‌గాడిలో పొగ‌రు ఎక్కడ ఉంటుందో తెలుసు.. ఓ ఆడ‌పిల్లలో నొప్పి ఎలా ఉంటుందో తెలుసు.. ఈ కేసులో తీర్పు చెప్పడానికి నేనే క‌రెక్ట్ అంటూ ఆమెతో చెప్పించిన డైలాగ్ చ‌ప్పట్లు కొట్టిస్తుంది. ఇష్టప‌డి చెప్పేది న్యూస్ కాదు.. జ‌రిగింది చెప్పేది న్యూస్ అంటూ మీడియా అతి ధోర‌ణిపై వేసిన సెటైర్లు పేలాయి. క‌థ‌ని మ‌రింత వేగంగా న‌డిపించి ఉంటే సినిమా మ‌రోస్థాయిలో ఉండేది. గోవింద వ‌సంత నేప‌థ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆక‌ర్షణ‌గా నిలిచింది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి.

బ‌లాలు:
క‌థ‌, క‌థ‌నాలు
సాయిప‌ల్లవి న‌ట‌న
క్లైమాక్స్‌

బ‌ల‌హీన‌త‌లు:
నెమ్మదిగా సాగే క‌థ‌నం
కోర్టు రూం స‌న్నివేశాలు

చివ‌రిగా: ‘గార్గి’ పోరాటం మెప్పిస్తుంది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని