saiee manjrekar: ఒత్తిడి లేదు.. బాధ్యతగా భావిస్తున్నా

వెండితెరకు పరిచయమైన ఈ ఉత్తరాది సోయగం.. ఇప్పుడు ‘గని’తో తెలుగు తెరపైకి అడుగు పెడుతోంది. వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కించారు. 

Updated : 06 Apr 2022 09:09 IST

వెండితెరకు పరిచయమైన ఈ ఉత్తరాది సోయగం.. ఇప్పుడు ‘గని’తో తెలుగు తెరపైకి అడుగు పెడుతోంది. వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కిరణ్‌ కొర్రపాటి తెరకెక్కించారు. అల్లు బాబీ, సిద్ధు ముద్ద సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది సయీ.

‘దబాంగ్‌ 3’తోనే ఈ చిత్ర అవకాశమొచ్చినట్లుంది కదా..?

‘‘అవును. ఆ సినిమాలో ఓ పాట చేశా. అది నచ్చి.. దర్శకుడు కిరణ్‌ నన్నీ చిత్రం కోసం సంప్రదించారు. మూడేళ్ల క్రితం తొలిసారి నేనీ కథ విన్నా. చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఇది నాకెన్నో ప్రత్యేకమైన అనుభూతుల్ని మిగిల్చింది. షూటింగ్‌ ఆద్యంతం చాలా ఎంజాయ్‌ చేశా’’.

మీ నాన్న మహేష్‌ మంజ్రేకర్‌ తెలుగు చిత్రాల్లో నటించారు. ఈ అవకాశమొచ్చిందని చెప్పాక.. ఆయన ఏమన్నారు?

‘‘తెలుగు భాషపై పట్టు సంపాదించే ప్రయత్నం చేయమన్నారు. చెప్పే డైలాగ్‌ ఏంటి? దాన్ని ఎలా.. ఏ ఎక్స్‌ప్రెషన్‌తో పలకాలి? ఇలా ప్రతిదానిపైనా జాగ్రత్తగా దృష్టి పెట్టమన్నారు. పదాల్ని ఈజీగా నేర్చుకోవడం, పలకడం ఎలాగో చిన్న చిన్న టిప్స్‌ ఇచ్చారు. తొలుత ఓ సహాయకుడ్ని పెట్టుకుని నా డైలాగ్స్‌ని బాగా ప్రాక్టీస్‌ చేసేదాన్ని. తర్వాత అలవాటైపోయింది. వారసత్వమనే... ఒత్తిడి ఏమీ లేదు. దీన్నొక బాధ్యతలా భావిస్తున్నా. నటుడిగా నాన్నకి   తెలుగులో మంచి పేరుంది. నేనూ ఆయనలాగే సొంతంగా నాదైన ప్రతిభతో నటిగా మంచి గుర్తింపు సాధించుకోవాలనుకుంటున్నా’’.  

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

‘‘నేనిందులో మాయ అనే పాత్రలో కనిపిస్తా. నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండే పాత్రిది. చాలా బబ్లీగా.. చలాకీగా కనిపిస్తాను. నిజ జీవితానికి దగ్గరగా ఉన్న పాత్ర కావడం వల్ల నా పాత్రకు మరింత సమర్థంగా న్యాయం చేయగలిగాననిపించింది. ఇప్పుడు దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నా’’.

సెట్లో వరుణ్‌తో కలిసి పని చేయడం ఎలా అనిపించింది?

‘‘తను చాలా స్వీట్‌ పర్సన్‌. సెట్లో సహ నటులకు ఎంతో ప్రోత్సాహాన్ని  అందిస్తుంటారు. చిత్రీకరణ ఆద్యంతం ఆయన నాకెంతో సహకారానిచ్చారు. నేనేమన్నా తప్పు చేస్తే.. పిలిచి దాన్ని సరిగ్గా ఎలా చేయాలో ఓపికగా చెప్పేవారు. ‘గని’ కోసం ఆయన  పడిన  కష్టం తెరపై అందరినీ ఆకట్టుకుంటుంది’’.

డ్రీమ్‌ రోల్స్‌ ఏమైనా ఉన్నాయా? తెలుగులో ఎవరితో చేయాలనుకుంటున్నారు?

‘‘అలా ఏం లేదు. అన్ని రకాల పాత్రలు చేయాలనుకుంటున్నా. నటిగా నాకు సవాల్‌ విసిరే పాత్రలతో ప్రయాణించాలని ఉంది. తెలుగులో నాకు చాలా మంది అభిమాన హీరోలున్నారు. వాళ్లందరితో పని చేయాలనుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే అల్లు అర్జున్‌ చాలా ఇష్టం. ‘నాటు నాటు’ చూశాక.. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లకు పెద్ద ఫ్యాన్‌ అయిపోయా’’.


‘‘ప్రస్తుతం నేను తెలుగులో ‘మేజర్‌’లో నటిస్తున్నా. ‘గని’లో పోషించిన పాత్రకు పూర్తి భిన్నమైన క్యారెక్టర్‌ను ఇందులో చేశా. జూన్‌లో ప్రేక్షకుల ముందుకొస్తుంది. మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో వాటిని అధికారికంగా ప్రకటిస్తా’’.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని