Saipallavi: ఆ వీడియో వైరలయ్యాకే పొట్టి దుస్తులు వేసుకోకూడదనుకున్నా: సాయిపల్లవి

అనుకోనివిధంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డాక్టర్‌ నుంచి యాక్టర్‌గా మారి విభిన్న కథలతో ప్రేక్షకులకు చేరువైన నటి సాయిపల్లవి. ‘ప్రేమమ్‌’తో...

Updated : 13 Jun 2022 11:03 IST

నటిని ఇబ్బంది పెట్టిన వీడియో ఏంటంటే..?

హైదరాబాద్‌: వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని.. డాక్టర్‌ నుంచి యాక్టర్‌గా మారి విభిన్న కథలతో ప్రేక్షకులకు చేరువైన నటి సాయిపల్లవి. ‘ప్రేమమ్‌’తో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘ఫిదా’తో తెలుగువారికి చేరువయ్యారు. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటించిన ఇంటెన్స్‌ లవ్‌ స్టోరీ ‘విరాటపర్వం’. 1990ల్లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నటుడు రానా.. రవన్న అనే విప్లవ నాయకుడిగా నటించారు. వేణు ఊడుగుల దర్శకుడు. జూన్‌ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సాయిపల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇప్పటివరకూ చేసిన పాత్రలన్నీ తనకెంతో సంతృప్తినిచ్చాయని, నటిగా కెరీర్‌ ముగిసిందని భావించిన సమయంలో మళ్లీ వైద్య వృత్తిలోకి అడుగుపెడతానని ఆమె అన్నారు.

అనంతరం పొట్టి దుస్తులు ధరించడంపై స్పందిస్తూ.. ‘‘మాది సాంప్రదాయ కుటుంబం. మా నాన్న సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఉద్యోగి. నాకొక చెల్లి ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు మేము టెన్నిస్‌, షటిల్‌ ఆడుతుంటాం. ఆ సమయంలో ఆటకు సౌకర్యంగా ఉండేలా పొట్టి దుస్తులే వేసుకుంటాను. అయితే, నటిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో జరిగిన ఓ సంఘటనతో సినిమాల్లో పొట్టిదుస్తులు వేసుకోకూడదని ఫిక్స్‌ అయిపోయా. వైద్య విద్య నేర్చుకోవడానికి జార్జియా వెళ్లినప్పుడు అక్కడ టాంగో డ్యాన్స్‌ నేర్చుకున్నాను. టాంగో డ్యాన్స్‌ నేర్చుకోవాలంటే.. దానికి వీలుగా ఉండే కాస్ట్యూమ్స్‌ మాత్రమే ధరించాలి. అదే విషయాన్ని అమ్మ వాళ్లకు చెప్పి వాళ్లు ఓకే అన్నాక, దుస్తుల విషయంలో నేనూ సౌకర్యంగా ఫీలయ్యాకే ఆ డ్యాన్స్‌ నేర్చుకున్నాను. ఆ తర్వాత కొన్నాళ్లకే ‘ప్రేమమ్‌’లో నటించే అవకాశం వచ్చింది. అందరి నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. అదే సమయంలో నేను జార్జియాలో చేసిన టాంగో డ్యాన్స్‌ వీడియో సోషల్‌మీడియాలో వైరలైంది. నెటిజన్లు దాన్ని చూసి, కామెంట్స్‌ చేసిన విధానం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆ క్షణం నుంచి పొట్టి దుస్తులకు నో చెప్పడం మొదలుపెట్టాను’’ అని సాయిపల్లవి తెలిపారు.

‘‘మెగాస్టార్‌ చిరంజీవి నాకెంతో ఇష్టం. ఇక ఆయన డ్యాన్స్ అంటే పడిచస్తాను. ముఖ్యంగా ‘ముఠామేస్త్రి’ సాంగ్‌లో ఆయన వేసే స్టెప్పులు చూసి మురిసిపోయేదాన్ని. ఆయనతో డ్యాన్స్‌ చేసే అవకాశం వస్తే అదృష్టంగా భావిస్తా. ఆయన నటిస్తోన్న ‘భోళాశంకర్‌’లో అవకాశం వచ్చింది. రీమేక్స్‌ అంటే నాకెంతో భయం. సినిమా విడుదలయ్యాక ప్రేక్షకులు తప్పకుండా ఒరిజినల్‌ పాత్రతో పోల్చి చూస్తుంటారు. ఆ భయంతోనే నేను ఆ ఆఫర్‌ని తిరస్కరించాను. అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు’’ అని ఆమె వివరించారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని