sakini dakini review: రివ్యూ: శాకిని డాకిని

sakini dakini review: రెజీనా, నివేదా థామస్‌ కీలక పాత్రల్లో నటించిన ‘శాకిని డాకిని’ ఎలా ఉందంటే?

Updated : 17 Sep 2022 10:48 IST

చిత్రం: శాకిని డాకిని; న‌టీన‌టులు:  రెజీనా, నివేదా థామ‌స్‌, సుద‌ర్శ‌న్‌, పృథ్వీరాజ్‌, ర‌వి వ‌ర్మ‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, భానుచంద‌ర్ త‌దిత‌రులు
ఛాయాగ్ర‌హ‌ణం:  రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌, కూర్పు:  విప్ల‌వ్ నైష‌ధం, సంగీతం:  మిక్కీ మెక్ క్లెరీ, నిర్మాణం:  డి.సురేష్‌బాబు, సునీత తాటి, హ్యూన్‌వూ థామ‌స్ కిమ్‌, ద‌ర్శ‌క‌త్వం:  సుధీర్‌వ‌ర్మ‌; సంస్థ‌లు:  సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్‌; విడుద‌ల: 16 -09- 2022

ఈ వారం తెలుగు సినిమా బాక్సాఫీసు మూడు ప్ర‌ధానమైన చిత్రాల‌తో క‌ళ‌క‌ళ‌లాడింది. అందులో ఒక‌టి నాయికా ప్ర‌ధాన‌మైన ‘శాకిని డాకిని’.  క‌థానాయిక‌లు రెజీనా, నివేదా థామ‌స్ కలిసి నటించడం.. సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మాణం...  ఇలా విడుద‌ల‌కు ముందే ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షించిందీ సినిమా పోస్ట‌ర్‌. మ‌రి సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..

క‌థేంటంటే: శిక్ష‌ణ కోసం పోలీస్ అకాడ‌మీలో చేరిన యువ‌తులు షాలిని (నివేతా థామస్),  దామిని (రెజీనా కసాండ్రా). వేర్వేరు ప్ర‌పంచాల నుంచి వ‌చ్చిన ఆ ఇద్దరిలో ఒకొక్క‌రికీ ఒక్కో బ‌ల‌హీన‌త ఉంటుంది. మొద‌ట ఒక‌రికొక‌రు శ‌త్రువులు.. ఆ త‌ర్వాత  స్నేహితులవుతారు. ఒక రోజు స‌ర‌దాగా బ‌య‌టికి వెళ్లిన ఆ ఇద్ద‌రూ తిరిగి అకాడ‌మీకి వ‌స్తున్న స‌మ‌యంలో.. రౌడీమూక‌ ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయ‌డాన్ని చూస్తారు. ఆ విష‌యాన్ని  ఉన్న‌తాధికారుల‌కి చెప్పినా వాళ్లు ప‌ట్టించుకోరు. కానీ ఆ ఇద్ద‌రూ తాము చూసిన కిడ్నాప్ వెనుక  ఓ పెద్ద ముఠా ఉంద‌ని తెలుసుకుంటారు. తాము పొందుతున్న శిక్ష‌ణ‌ని ఉప‌యోగించుకుని  ఆ ముఠాతో ఎలా పోరాడారు?  కిడ్నాప్ అయిన అమ్మాయిని ఎలా ర‌క్షించారు?  నేర కోణంలో ఎలాంటి విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయ‌న్న‌ది మిగిలిన క‌థ‌.

ఎలా ఉందంటే: కొరియా చిత్రం ‘మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్‌’కి రీమేక్‌గా రూపొందిన చిత్ర‌మిది. మాతృక‌లో అబ్బాయిలు ప్ర‌ధాన పాత్ర‌ధారులైతే, ఇక్క‌డ మాత్రం అమ్మాయిలు ఆ పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. యాక్ష‌న్‌ ప్రాధాన్య‌మున్న ఇలాంటి క‌థ‌ని అమ్మాయిల‌తో తీయ‌డం ఒకింత సాహ‌స‌మే. ఇద్ద‌ర‌మ్మాయిలు పోలీస్ శిక్ష‌ణ‌లో ఉన్న‌వాళ్లే కాబ‌ట్టి, దాన్ని  వినియోగించుకుంటూ  ముఠాపై పోరాటం చేయ‌డం  న‌మ్మేలా ఉంటుంది. తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా పాత్ర‌ల్ని మ‌లిచిన తీరు కూడా మెప్పిస్తుంది. తొలి స‌గ‌భాగం స‌ర‌దా స‌న్నివేశాల‌తో సాగుతుంది. శాలిని, దామిని బ‌ల‌హీన‌త‌లు, ఈగోలు, అకాడ‌మీ నేప‌థ్యంలో పండే కామెడీ మంచి కాల‌క్షేపాన్నిస్తుంది.  ముఖ్యంగా తెలంగాణ అమ్మాయిగా నివేదా థామ‌స్ చ‌క్క‌టి హాస్యాన్ని పంచింది. తొలి స‌గ‌భాగం కామెడీ ప్ర‌ధానంగా సాగగా.. ద్వితీయార్ధంలో థ్రిల్ క‌లిగించే అంశాలు ఉంటాయి. ముఠా ఆచూకీ క‌నిపెట్టేందుకే చేసే ప్రయ‌త్నాలు, ముఠాని ఎదురించే తీరు ఆక‌ట్టుకుంటుంది. కొన్ని యాక్ష‌న్ ఘ‌ట్టాల్ని అమ్మాయిల‌కు త‌గ్గ‌ట్టుగా చ‌క్క‌గా డిజైన్ చేశారు. సినిమా కాల‌క్షేపాన్నిచ్చేలా ఉన్న‌ప్ప‌టికీ,  చాలా స‌న్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతున్న‌ట్టు అనిపిస్తాయి. కిడ్నాప్ జ‌రిగింద‌న్నా పోలీస్ అధికారులు ప‌ట్టించుకోక‌పోవ‌డం,  ప్ర‌మాద‌క‌ర‌మైన ముఠాపై అమ్మాయిలే తిరుగుబాటు చేయ‌డం న‌మ్మ‌దగిన‌ట్టుగా అనిపించ‌వు.  నివేదా టైమింగ్  ఫ‌లితాన్నిచ్చినా, మిగిలిన స‌న్నివేశాల్లో కామెడీ పండ‌దు. కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా పూర్తిగా న‌వ్వించ‌లేక‌, అటు థ్రిల్‌తో క‌ట్టిప‌డేయ‌లేక ఓ సాదాసీదా ప్ర‌య‌త్నంలా అనిపిస్తుందంతే.  ఈమాత్రం క‌థ‌కి కొరియా వ‌ర‌కు వెళ్లాలా అనే సందేహం రేకెత్తుతుంది. అమ్మాయిల నేప‌థ్యంలో ఈ త‌ర‌హా క‌థ ఈమ‌ధ్య‌కాలంలో మాత్రం రాలేదు. 

ఎవ‌రెలా చేశారంటే: రెజీనా, నివేద పాత్ర‌ల్ని మ‌లిచిన తీరు... వాటిలో ఆ ఇద్ద‌రూ ఒదిగిపోయిన విధానం బాగుంది. కామెడీ టైమింగ్ బాగుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల్లోనూ మెరిశారు. ముఠా చేస్తున్న నేరాన్ని ఛేదించేందుకు సాగించే ప‌రిశోధ‌నాత్మ‌క స‌న్నివేశాల్లోనూ ఇద్ద‌రూ చ‌క్క‌టి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. పృథ్వీ రాజ్‌, సుద‌ర్శ‌న్ త‌దిత‌రుల కామెడీ కూడా బాగా పండింది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. సుధీర్‌వ‌ర్మ కొన్ని స‌న్నివేశాల్లో త‌న మార్క్‌ని ప్ర‌ద‌ర్శించారు. థ్రిల్ విష‌యంలో ఆశించిన స్థాయిలో ప్ర‌భావం చూపించ‌లేక‌పోయారు. క‌రోనా స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మైన ఈ సినిమా నిర్మాణం ప‌రంగా ప‌లు ఆటుపోట్ల‌ని ఎదుర్కొన్న విష‌యాన్ని కొన్ని స‌న్నివేశాలే స్ప‌ష్టం చేస్తాయి. సంగీతం, కెమెరా విభాగాలు ప‌ర్వాలేద‌నిపిస్తాయి.

బ‌లాలు

+ రెజీనా, నివేదా న‌ట‌న

+ ప్ర‌థ‌మార్ధంలో హాస్యం

+ పోరాట ఘ‌ట్టాలు

బ‌ల‌హీన‌త‌లు

- లాజిక్ లేని స‌న్నివేశాలు

- అంతంత‌మాత్ర‌మే కామెడీ.. థ్రిల్

చివ‌రిగా:  శాకిని డాకిని... అమ్మాయిల పోరాటం

గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని