Salman Khan: అవన్నీ నాతోపాటే సమాధి అవుతాయి: సల్మాన్‌ ఖాన్‌

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన ప్రేమ కథలు.. ఈ మధ్య కాలంలో తనకు వస్తోన్న బెదిరింపు లేఖలపై ఆయన స్పందించారు. 

Updated : 30 Apr 2023 21:32 IST

ముంబయి: తన ప్రేమకథల గురించి బాలీవుడ్‌ బడా హీరో సల్మాన్‌ఖాన్‌ (Salman Khan) మొదటిసారి స్పందించారు. తన మాజీ ప్రియురాళ్లు అందరూ మంచివారేనని.. తప్పు తన వైపు నుంచే ఉందన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘‘మీ ప్రేమ కథలతో జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నారా?’’ అని ప్రశ్నించగా.. ‘‘నా ప్రేమకథలన్నీ నాతోపాటే సమాధి అవుతాయి’’ అని సల్మాన్‌ బదులిచ్చారు.

అనంతరం ఆయన పెళ్లి, పిల్లలు గురించి మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలో సరైన వ్యక్తి వచ్చినప్పుడు తప్పకుండా వివాహం చేసుకుంటాను. నిజం చెప్పాలంటే, నా మాజీ గర్ల్‌ఫ్రెండ్స్‌ అందరూ మంచివారే. వాళ్ల వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు. తప్పంతా నాతోనే. ఎందుకంటే.. మొదటి గర్ల్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ అయినప్పుడు తప్పు ఆమెదే అనుకున్నా. ఆ తర్వాత వరుసగా ఇదే రిపీట్‌ అవుతుంటే.. తప్పు వాళ్ల వైపు లేదని, నా వైపే ఉందని అర్థం చేసుకున్నాను. సంతోషంగా చూసుకోలేననే భయం వల్లే వాళ్లు నన్ను వదిలివెళ్లిపోయి ఉండొచ్చు. వాళ్లు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. ఇక, పిల్లల విషయానికి వస్తే.. నాకు పిల్లలంటే ఎంతో ఇష్టం. తండ్రి కావాలని ఉంది. పెళ్లి కాకుండా తండ్రి కావడానికి మన చట్టాలు అంగీకరించవు’’ అని తెలిపారు.

ఇదే ఇంటర్వ్యూలో తనకు వస్తోన్న బెదిరింపులపై కూడా స్పందించారు. ‘‘అభద్రతతో జీవించే కంటే భద్రత మధ్య ఉండటం ఉత్తమం. అవును, బెదిరింపుల కారణంగా నాకు భద్రత పెంచారు. దీనివల్ల గతంలో మాదిరిగా ఒక్కడినే సైకిల్‌ రైడ్స్‌కు వెళ్లలేను. ట్రాఫిక్‌లోనూ నా వాహనం చుట్టూ భద్రతా బృందం ఉంటుంది. దీంతో వేరే వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. అయితే.. ఏది జరగాలని ఉంటే.. అదే జరుగుతుంది. దేవుడిపై పూర్తి నమ్మకం ఉంచాను. ఇప్పుడు నా చుట్టూ ఎన్నో తుపాకులు ఉన్నాయి. వాటిని చూసి భయపడుతున్నా’’ అని సల్మాన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని