Salman: ‘సల్మాన్‌కి భార్యాపిల్లలున్నారు’

బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ఖాన్‌ తాజాగా ఓ సెలబ్రిటీ రియాల్టీ షో మొదలుపెట్టారు. సెలబ్రిటీలపై వచ్చిన సోషల్‌మీడియా కామెంట్లు.. దానిపై వారి స్పందన గురించి ఈ షోలో చూపించనున్నారు. తాజాగా ఈ షోలో సల్మాన్‌ఖాన్‌...

Updated : 22 Jul 2021 11:21 IST

ముంబయి: బాలీవుడ్‌ స్టార్‌హీరో సల్మాన్‌ఖాన్‌ సోదరుడు అర్బాజ్‌ఖాన్‌ తాజాగా ఓ సెలబ్రిటీ రియాల్టీ షో మొదలుపెట్టారు. సెలబ్రిటీలపై వచ్చిన సోషల్‌మీడియా కామెంట్లు.. దానిపై వారి స్పందన గురించి ఈ షోలో చూపించనున్నారు. తాజాగా ఈ షోలో సల్మాన్‌ఖాన్‌ సందడి చేశారు. అర్బాజ్‌ఖాన్‌ షో విజయం సాధించాలని ఆకాక్షించారు.

ఇందులో భాగంగా తనపై వచ్చిన సోషల్‌మీడియా కామెంట్ల పై సల్లూబాయ్‌ స్పందించారు. ‘నా గురించి సోషల్‌మీడియాలో తరచూ ఎన్నో కామెంట్లు వస్తుంటాయి. కానీ, నేను వాటిని అంతగా పట్టించుకోను. నెగటివిటీ గురించి ఆలోచిస్తూ కూర్చుంటే పాజిటివ్‌గా జీవించలేం’ అని సల్మాన్‌ తెలిపారు. అనంతరం ఓ నెటిజన్.. ‘సల్మాన్‌ ఇంకా ఎంతకాలం దాస్తావ్‌? నీకు పెళ్లైందని.. 17 ఏళ్లు వయసున్న అమ్మాయి కూడా ఉందని మాకు తెలుసు. వాళ్లిద్దర్నీ దుబాయ్‌లో ఉంచావ్‌ కదా?’ అని కామెంట్‌ చేయగా.. ‘ఈ నెటిజన్‌ ఎవరో కానీ అన్ని తెలిసినట్లే మాట్లాడుతున్నాడు. కానీ, ఆయన వ్యాఖ్యల్లో ఎలాంటి నిజం లేదు. భారతదేశం మొత్తానికి తెలుసు నాకు పెళ్లి కాలేదని.. భార్యాపిల్లలు నా జీవితంలో లేరని.. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి నేను ముంబయిలోనే ఉంటున్నానని.. మరలా ఈ నెటిజన్‌ ట్వీట్‌పై స్పందించాల్సిన అవసరం ఏముంది’ అని పేర్కొన్నారు.

గతేడాది విడుదలైన ‘రాధే’ తర్వాత సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న చిత్రం ‘టైగర్‌-3’. టైగర్‌ చిత్రాల ఫ్రాంఛైజీలో వచ్చిన ‘ఏక్‌ థా టైగర్, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలను మించి ఈ మూడో చిత్రంలో యాక్షన్‌ ఉండనుందని తెలుస్తోంది. మనీష్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కత్రినాకైఫ్‌ కథానాయికగా సందడి చేయనున్నారు. అలాగే, ఇమ్రాన్‌ హష్మీ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని