Samantha: భర్త కాదు.. మాజీ భర్త అనండని చెప్పిన సామ్‌

నటుడు నాగచైతన్యతో (Naga Chaitanya) విడాకులు తీసుకోవడంపై అగ్రకథానాయిక సమంత (Samantha) మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో పెదవి విప్పారు. ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan) షోలో పాల్గొన్న...

Updated : 22 Jul 2022 10:22 IST

విడిపోవడంపై షాకింగ్‌ విషయాలు వెల్లడించిన అగ్రకథానాయిక

హైదరాబాద్‌: నటుడు నాగచైతన్యతో (Naga Chaitanya) విడాకులు తీసుకోవడంపై అగ్రకథానాయిక సమంత (Samantha) మొదటిసారి ఓ ఇంటర్వ్యూలో పెదవి విప్పారు. ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan) షోలో పాల్గొన్న ఆమె పలు షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. తాము విడిపోవడం అంత సులభంగా జరగలేదన్నారు. తమ మధ్య సఖ్యత లేదని.. ఒకవేళ తమని ఓ గదిలో ఉంచితే అక్కడ పదునైన ఆయుధాలు లేకుండా చూడాలని ఆమె చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఓ ప్రశ్న అడుగుతోన్న సమయంలో.. ‘‘నీ భర్త నుంచి విడిపోయినప్పుడు నువ్వు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావు?’’ అని కరణ్‌ అడగ్గా.. ‘‘భర్త కాదు మాజీ భర్త’’ అని ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. దీనికి కరణ్‌.. క్షమాపణలు కూడా చెప్పి ఇంటర్వ్యూ కొనసాగించారు.

‘‘మేమిద్దరం విడిపోవడం సులభంగా జరగలేదు. విడిపోయిన సమయంలో మనోవేదనకు గురయ్యా. ప్రస్తుతం బాధ నుంచి బయటపడ్డా. మునుపెన్నడూ లేనివిధంగా దృఢంగా సిద్ధమయ్యా. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం లేదు. ఒకవేళ మా ఇద్దర్నీ ఒకే గదిలో ఉంచితే అక్కడ ఎలాంటి పదునైన ఆయుధాలు, వస్తువులు లేకుండా చూసుకోవాలి. భవిష్యత్తులో మా మధ్య సఖ్యత వస్తుందేమో తెలియదు. మేమిద్దరం విడిపోయినప్పుడు నాపై నెగెటివ్‌ ప్రచారం జరిగింది. ఆ సమయంలో వాటిపై స్పందించేందుకు నా దగ్గర సమాధానాలు కూడా లేవు. నేను ఓపెన్‌గా ఉండాలనుకున్నా. అందుకే విడిపోయిన విషయాన్ని అందరితో చెప్పా. మేము విడిపోయిన కొన్నిరోజులకే ‘ఊ అంటావా’ సాంగ్‌ ఆఫర్‌ నాకు వచ్చింది. ఆ పాట నాకెంతో నచ్చింది. అందుకే అందులో యాక్ట్‌ చేశా. ఈ పురుషాధిక్య సమాజంలో వారిలోని లోపాలు ఎత్తిచూపించడానికి ఈ పాట సరైందని, నాలాంటి స్టార్‌ సెలబ్రిటీ చెబితే తప్పకుండా అందరికీ చేరువవుతుందని భావించా’’ అని సామ్‌ తెలిపారు.

అనంతరం, తాను భరణం కింద రూ.250 కోట్లు తీసుకున్నానని జరిగిన ప్రచారంపై సామ్‌ స్పందించారు. ‘‘సోషల్‌మీడియాలో నాపై ఎన్నో పుకార్లు, ప్రచారాలు జరిగాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న సమయంలో భరణం కింద రూ.250 కోట్లు నేను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని చూసి మొదట షాక్‌ అయ్యాను. ఆ వార్తలు చూసి ఎవరైనా ఆదాయపు పన్ను శాఖ అధికారులు మా ఇంటికి వచ్చి, దాడులు చేసి.. అవన్నీ అవాస్తవాలని చెబితే బాగుండు అని ప్రతి రోజూ ఎదురుచూసేదాన్ని’’ అని ఆమె వివరించారు. అంతేకాకుండా భవిష్యత్తులో తాను ప్రేమలో పడే అవకాశం లేదని చెప్పుకొచ్చారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts