
Samantha: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’షోలో సమంత సందడి?
ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్‌లో లవ్లీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న సమంత- నాగచైతన్య విడిపోతున్నట్లు ప్రకటించిన తరువాత... వారి నుంచి వచ్చే ప్రతీ అప్‌డేట్ ఆసక్తికరంగా మారింది. ఇక సామ్... నటుడు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ‘Evaru Meelo Koteeswarulu’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ అంతా గురువారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూర్తిచేసుకున్నట్లు సమాచారం. అంతే కాదు.. ఈ క్విజ్‌షోలో ఆమె రూ.25లక్షలు గెలుచుకున్నారట.
వైవాహిక జీవితానికి ముగింపు పలికిన అనంతరం సమంత టీవీషోలో కనిపించడం ఇదే మొదటిసారి. దీంతో ఈ షో ఎప్పుడు ప్రసారమవుతుందా? అని అభిమానులు ఎదరుచూస్తున్నారు. అయితే దసరా కానుకగా ఈ షోను అక్టోబర్15న (శుక్రవారం) ప్రసారం చేయనున్నారట. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ క్విజ్‌షోలో టాలీవుడ్ ప్రముఖ హీరోలు రామ్‌చరణ్‌తో పాటు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే హీరో మహేశ్‌బాబు సైతం ఈ షోలో పాల్గొనగా దానికి సంబంధించిన ఎపిసోడ్ దీపావళి కానుకగా నవంబర్4న ప్రసారమవుతుందనే మాట వినిపిస్తోంది.
2010లో బృందావనం, 2014లో రభస, 2013లో రామయ్యా వస్తావయ్యా, 2016లో జనతాగ్యారేజీ, చిత్రాల్లో హిట్ జోడిగా పేరు తెచ్చుకుంది సమంత- తారక్ జంట. అటు సామ్-జామ్ షోతో వ్యాఖ్యాతగా పేరు సంపాదించింది సమంత. గతంలో బిగ్‌బాస్, ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరులు హోస్ట్‌గా ఎన్టీఆర్ వినోదాన్ని పంచుతున్నారు. మరి తారక్ అడిగే ప్రశ్నలకు సమంత ఇచ్చిన సమాధానాలు, ఆమె చెప్పిన మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగకతప్పదు మరి.