Samantha: డాక్టర్‌ వార్నింగ్‌పై స్పందించిన సమంత.. వాళ్ల కోసమే ఆలోచించానంటూ సుదీర్ఘ పోస్ట్

తనకు వార్నింగ్ ఇచ్చిన డాక్టర్‌పై సమంత పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం అది చర్చనీయాంశంగా మారింది.

Updated : 05 Jul 2024 17:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తనను జైల్లో పెట్టాలంటూ వార్నింగ్‌ ఇచ్చిన డాక్టర్‌ పోస్ట్‌పై సమంత స్పందించారు. తాను తీసుకుంటున్న వైద్యం ఎంతో ఖరీదైనదని.. డబ్బులు లేని వాళ్లు అలాంటి వైద్యం ఎలా తీసుకుంటారోనని ఎప్పుడూ ఆలోచిస్తుంటానని ఆమె (Samantha) తెలిపారు.

సమంత తాను తీసుకునే వైద్యాన్ని తెలియజేస్తూ ఎప్పటికప్పుడు పోస్ట్‌ పెడుతుంటారు. ఇటీవల కూడా అలానే నెబ్యులైజేషన్‌ గురించి పోస్ట్ పెట్టారు. ‘మాములుగా వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు ఇలాంటి ప్రత్యామ్నాయ మందులు వాడండి అంటూ.. నెబ్యులైజేషన్‌లో ఉపయోగించాల్సిన కొన్ని ఔషధాలు సూచించారు. దీనిపై కొందరు డాక్టర్లు ఆమెను విమర్శించారు. ఆమె చెప్పిన హెల్త్‌ టిప్‌ పాటిస్తే ప్రాణానికే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వారిలో ఒక డాక్టర్‌ ఆమెను తీవ్రంగా విమర్శిస్తూ పోస్ట్‌ పెట్టారు. ‘సమంతకు హెల్త్‌, సైన్స్‌ గురించి ఏమీ తెలియకుండా మాట్లాడారు. ఎంతోమందిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆమెను జైల్లో వేయాలి. జరిమానా విధించాలి’ అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. తాజాగా దీనిపై సమంత స్పందించారు. తన సోషల్‌ మీడియాలో ఓ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.

అసలు కథ ముందుంది.. ‘కల్కి’ సీక్వెల్‌పై స్పందించిన నాగ్‌ అశ్విన్‌

‘కొన్నేళ్లుగా నేను అనేక రకాల మందులు వేసుకుంటున్నాను. ప్రతి దాన్ని డాక్టర్ల సలహా మేరకు ఉపయోగిస్తున్నా. ఇతరులకు ఇచ్చే టిప్స్‌ కూడా నేను పాటించి ఫలితం వచ్చిన తర్వాతనే చెప్పాను. నేను తీసుకుంటున్న వైద్యం చాలా ఖరీదైనది. నాకు ఆర్థికస్థోమత ఉంది కాబట్టి దాన్ని భరించగలను. కానీ, కొందరి పరిస్థితి వేరు. ఇంత ఖర్చుపెట్టి వైద్యం చేయించుకోలేరు. వాళ్ల గురించే నేను ఆలోచించి హెల్త్‌ టిప్స్‌ చెబుతుంటాను. దేని గురించైనా తెలుసుకోకుండా ఇతరులకు సలహా ఇచ్చేంత అమాయకురాలిని కాదు. నేను చికిత్స తీసుకుంటున్న డాక్టర్‌కు 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది’ అని తెలిపారు.

ఇక తనను విమర్శించిన డాక్టర్‌ను ఉద్దేశిస్తూ.. ‘ఒక పెద్దమనిషి నా పోస్ట్‌ను, నా సలహాలను ఉద్దేశపూర్వకంగా బలమైన పదాలతో దూషించారు. ఆయన కూడా డాక్టరే. నాకంటే ఆయనకు ఎన్నో విషయాలపై అవగాహన ఉంటుందనడంలో సందేహం లేదు. నన్ను నిందించడం కంటే నాకు చికిత్స చేసిన డాక్టర్‌తో ఆయన ముఖాముఖిలో పాల్గొని ఉంటే బాగుండేది. ఆయన నా గురించి మాట్లాడే సమయంలో అలాంటి పదాలు వాడకుండా ఉంటే ఆయన్ని గౌరవించేదాన్ని. నన్ను జైల్లో పెట్టాలని ఆయన విమర్శించినందుకు నాకు బాధలేదు. ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను అంత సులువుగా నిందించాడని అనుకుంటాను. కానీ, నేను సెలబ్రిటీగా ఆ హెల్త్‌ టిప్‌ ఇవ్వలేదు.. ఒక సామాన్యమైన వ్యక్తిగా పోస్ట్‌ చేశాను’ అని రాసుకొచ్చారు. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని