Samantha: సోషల్‌ మీడియాలో ట్రోల్స్‌.. సమంత స్ట్రాంగ్‌ రియాక్షన్‌.. ఏమందంటే?

సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోల్స్‌పై ప్రముఖ నటి సమంత స్పందించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు.

Updated : 21 Jun 2022 12:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగచైతన్య నుంచి విడిపోయిన తర్వాత సమంతపై సోషల్‌ మీడియాలో చాలా రకాల ట్రోల్స్‌ వస్తున్నాయి. వారి వివాహ బంధంలో ఏమైందో తెలియకపోయినా.. సమంతను జడ్జ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ ఈ విషయంలో కామ్‌గా ఉన్న సమంత.. ఇప్పుడు నోరు విప్పింది. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ ట్వీట్‌ చేసింది. పుకార్లు, ట్రోలింగ్‌కి సంబంధించిన ఆ ట్వీట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

యువ కథానాయకుడు నాగచైతన్య.. ఓ హీరోయిన్​తో ప్రేమలో ఉన్నట్లు గత కొద్దిరోజులుగా పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదంతా సమంత​ సన్నిహితులే చేస్తున్నారని చైతన్య అభిమానులు ఆమెను సోషల్‌ మీడియాలో ట్రోల్​ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత ట్రోలింగ్‌ గురించి చేసిన ట్వీట్‌ చర్చనీయాంశమైంది. ‘‘అమ్మాయిపై వదంతులు వస్తే అవి నిజమే అనుకుంటారు. అబ్బాయిపై అలాంటి వదంతులు వస్తే అమ్మాయే చేయించిందంటారు’’ అంటూ ట్వీట్‌లో పేర్కొంది.

దాంతోపాటు ‘‘అబ్బాయిలూ ఇకనైనా ఎదగండి. మీరు మీ పని మీద, మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి’’ అని ట్వీట్‌లో పేర్కొంది సమంత. ఇంకా ఆమె ట్వీట్‌లో ‘‘ఈ విషయంతో సంబంధం ఉన్న ఇరుపక్షాలు తమ పని తాము చూసుకుంటున్నాయి. మీరు కూడా మీ పని చూసుకోండి’’ అని ఘాటుగా ట్వీట్‌ చేసింది సమంత. అయితే సమంత ఈ ట్వీట్‌లో ఏ వ్యక్తి పేరునూ ప్రస్తావించలేదు. అలాగే దేని గురించి ఇదంతా రాస్తోంది అనేది కూడా స్పష్టంగా చెప్పలేదు. అయితే తనపై రీసెంట్‌గా వస్తున్న ట్రోల్స్‌ గురించి సమంత ఇదంతా రాసింది అని సన్నిహితులు చెబుతున్నారు.

ఇక సమంత సినిమా కెరీర్‌ సంగతి చూస్తే.. ఇటీవల ‘కేఆర్‌కే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆమె నటించిన ‘యశోద’ ఆగస్టులో విడుదల చేయాలని చూస్తున్నారు. గుణశేఖర్‌తో చేస్తున్న ‘శాకుంతలం’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఇది కాకుండా విజయ్‌ దేవరకొండతో ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తోంది సమంత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని