samantha: ‘మయోసైటిస్‌’ వ్యాధితో బాధపడుతున్నా.. త్వరలోనే కోలుకుంటా: సమంత

గత కొన్ని రోజులుగా తాను ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్‌ సమస్యతో బాధపడుతున్నట్లు అగ్ర కథానాయిక సమంత వెల్లడించారు.

Published : 30 Oct 2022 01:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సమంత (Samantha) అనారోగ్యంతో బాధపడుతున్నారని, అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారని, గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై సామ్‌ స్పందించింది. తాను ‘మయోసైటిస్‌’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ‘యశోద’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోను షేర్‌ చేస్తూ సుదీర్ఘ పోస్ట్‌ చేశారు. ఆ ఫొటోలో సమంత చేతికి సెలైన్‌ ఉండటం గమనార్హం. ఒకవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాను పూర్తి చేసేందుకు సామ్‌ (Samantha) శాయశక్తుల ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది.

‘‘యశోద’ ట్రైలర్‌కు మీ స్పందన చాలా బాగుంది. జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలల నుంచి ‘మయోసైటిస్‌’ (Myositis) అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌కు చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నా. కానీ, నేను అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ సమయమే పట్టే అవకాశం ఉంది. అన్నిసార్లూ బలంగా ముందుకు వెళ్లలేమని నాకు తత్వం బోధపడింది. ప్రతిదీ స్వీకరిస్తూనే నా పోరాటం కొనసాగిస్తా.  త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నా జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. అలాంటి పరిస్థితులను ఇంకొక్క రోజు కూడా భరించలేనేమో అనుకున్నా సందర్భాలున్నాయి. కానీ, ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఐ లవ్‌ యూ’’ అని సమంత ట్వీట్‌ చేశారు.

ఏంటీ వ్యాధి.. లక్షణాలు ఎలా ఉంటాయి?

సమంత పంచుకున్నట్లు ‘మయోసైటిస్‌’ అనేది ఒక అరుదైన వ్యాధి. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్‌. ఈ సమస్యతో బాధపడేవారి పరిస్థితి వర్ణననాతీతంగా ఉంటుంది. ఈ వ్యాధిలో పలు రకాలు ఉన్నాయి. ‘పాలిమయోసైటిస్‌’ బారినపడి వారు చిన్న చిన్న పనులకే నీరసపడిపోతారు. కండరాలు భరించలేనంత నొప్పిపెడతాయి. కొంతదూరం నడిచినా త్వరగా అలసిపోతారు. ఒక్కోసారి కిందపడిపోతారు. ఇక ‘డెర్మటోమయోసైటిస్‌’తో బాధపడేవారికి కండరాలపై ప్రభావం పడుతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. మహిళలు, చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ‘ఇన్‌క్లూజన్‌ బాడీ మయోసైటిస్‌’ కారణంగా నీరసం, తొడ, ముంజేతి, మోకాలి కింద కండరాలు పట్టేసి, నొప్పిగా అనిపిస్తాయి. 50 వయసు దాటిన వారిలో ఇలాంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. మరి సమంత వీటిలో ఏ సమస్యతో బాధపడుతుందో మాత్రం వెల్లడించలేదు.

గత కొంతకాలంగా అటు, సినిమాలకు, ఇటు సోషల్‌మీడియాకు దూరంగా ఉంటున్నారు సమంత. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారంటూ వచ్చిన వార్తలపైనా స్పందించలేదు. తాజాగా ‘యశోద’గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తన అనారోగ్యం గురించి సమంత స్వయంగా వెల్లడించడం గమనార్హం. మరోవైపు విజయ్‌ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంలోనూ సామ్‌ నటిస్తున్నారు. శివ నిర్వాణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని