Samantha: అలాంటి పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది: సమంత
సమంత నటించిన తాజా చిత్రం ‘శాకుంతలం’ (Shaakuntalam) ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సమంత వరస ప్రమోషన్లలో పాల్గొంటోంది.
హైదరాబాద్: టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత (Samantha) త్వరలోనే ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమాతో పలకరించనుంది. గుణశేఖర్ (Gunasekhar) తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాల జోష్ పెంచింది. ఇందులో భాగంగా సమంత ముంబయిలో సందడి చేసింది. ‘శాకుంతలం’ సినిమా కోసం వరుసగా ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఈ సినిమాలో తన పాత్ర గురించి వివరించింది. దీనికి సంబంధించిన వీడియో సామ్ తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.
‘‘శకుంతల చాలా తెలివైన అమ్మాయి. తను ఎప్పుడూ నిజాయతీగా ఉంటుంది. తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఆమె వాటన్నిటినీ ఎంతో నమ్మకంతో ఎదుర్కొంది. తన జీవితంలో ఎన్నో సందర్భాల్లో చాలా హుందాగా ప్రవర్తించింది. ఆమె ఒక యువరాణి’’ అంటూ శకుంతల పాత్ర గురించి సమంత వివరించింది. ఇక ఈ షూటింగ్‌ను ఎంతో ఎంజాయ్ చేసినట్లు సామ్ తెలిపింది. ‘‘అడవి, జంతువుల పాత్రలు నాలోని చిన్నపిల్లని గుర్తుచేశాయి. శకుంతల లాంటి గొప్ప పాత్ర పోషించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే నమ్మకం నాకుంది. ఈ చిత్రం చూశాక అంతా గర్వపడతారు’’ అని సామ్ తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ‘సినిమా కోసం ఎదరుచూస్తున్నామంటూ’ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సమంత ప్రస్తుతం ‘ఖుషి’ (Kushi) సినిమాలో నటిస్తోంది. దానితో పాటు ‘సిటాడెల్’ (Citadel) వెబ్‌సిరీస్‌లోనూ కనిపించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.