Yashoda: యశోద సినిమా ఓటీటీ విడుదల ఆపాలంటూ కోర్టు ఆదేశాలు..!

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద. నవంబర్‌ 11న విడుదలైన ఈ సినిమా హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ విడుదలకు బ్రేక్‌ పడింది.  

Published : 24 Nov 2022 14:33 IST

హైదరాబాద్‌: సమంత నటించిన యశోద (Yashoda) చిత్రం ఇటీవల విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సమంత తన నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సరోగసి నేపథ్యంలో హరి-హ‌రీష్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సాలీడ్‌ కలెక్షన్స్‌ వసూలు చేసింది. తాజాగా ఈ సినిమాకు సమస్య ఎదురైంది. యశోద ఓటీటీ రిలీజ్‌ ఆపాలంటూ సివిల్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది.

విషయమేమిటంటే... యశోద సినిమాలో ఇవా హస్పిటల్‌(EVA hospital) పేరు దెబ్బతినేలా చూపించారని ఆ ఆసుపత్రి యాజమాన్యం కోర్టులో పిటిషన్‌ వేసింది. సినిమాలో అలా చూపించడం వల్ల ఆసుపత్రి పరపతి దెబ్బతిందని అందులో పేర్కొంది. ఈ సినిమా ఓటీటీ విడుదలను ఆపాలని కోరింది. దీంతో కోర్టు యశోద నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేసింది. డిసెంబర్‌ 19 వరకు ఓటీటీలో ప్రదర్శించకూడదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 19కు వాయిదా వేసింది. ఈ విషయంపై యశోద చిత్రబృందం స్పందించాల్సి ఉంది. శ్రీదేవి మూవీస్‌ నిర్మాణ సంస్థపై వచ్చిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్‌ కీలక పాత్ర పోషించారు. 

యశోద మూవీ కథేంటంటే: య‌శోద (స‌మంత) మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆర్థిక అవ‌స‌రాల రీత్యా స‌రోగ‌సి ప‌ద్ధ‌తిలో బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వ‌డం కోసం డా.మ‌ధు (వ‌ర‌ల‌క్ష్మి శ‌రత్‌కుమార్‌)కి చెందిన ఈవా ఆస్ప‌త్రిలో చేరుతుంది. ఒక ప్ర‌త్యేక ప్ర‌పంచంలా అనిపించే ఈవాలో జ‌రిగే కొన్ని ప‌రిణామాలు య‌శోద‌లో అనుమానం రేకెత్తిస్తాయి. త‌న‌తోపాటు బిడ్డ‌ల‌కి జ‌న్మ‌నివ్వ‌డం కోసం ఆస్ప‌త్రిలో చేరిన తోటి మ‌హిళ‌లు అనుమానాస్ప‌ద రీతిలో క‌నుమ‌రుగైపోతుంటారు. ఇంత‌కీ ఆ మ‌హిళ‌లు ఏమ‌వుతున్నారు? య‌శోద త‌న అనుమానాల్ని నివృత్తి చేసుకోవ‌డం కోసం ఏం చేసింది? ఆ  ఆ క్ర‌మంలో ఆమెకి ఎలాంటి విష‌యాలు తెలిశాయి? ఇంత‌కీ ఈ మ‌ధు ఎవ‌రు? ఈ ఆస్ప‌త్రిలో సంఘ‌ట‌న‌ల‌కీ, బ‌య‌ట జ‌రిగిన మ‌రో రెండు హ‌త్య‌ల‌కీ సంబంధమేమిటనేది మిగతా క‌థ‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని