Sameera Reddy: మహేశ్‌బాబు సినిమా ఆడిషన్‌.. ఏడ్చుకుంటూ వచ్చేశా: సమీరారెడ్డి

నటిగా కెరీర్‌ మంచి స్థాయిలో ఉన్నప్పుడు వివాహం చేసుకుని సినిమాలకు దూరమయ్యారు సమీరా రెడ్డి (Sameera Reddy). తాజాగా ఆమె.. తన కెరీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

Published : 04 Feb 2023 10:38 IST

హైదరాబాద్‌: ‘నరసింహుడు’ (Narasimhadu)తో తెలుగువారికి పరిచయమైన ముంబయి భామ సమీరారెడ్డి (Sameera Reddy). గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటి తాజాగా తన కెరీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. గతంలో తాను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (Mahesh Babu) సినిమా కోసం ఆడిషన్‌ ఇచ్చినట్లు చెప్పింది. అయితే అందులో సరిగా చేయలేక ఆరోజు కన్నీళ్లతో ఇంటికి వెళ్లిపోయినట్లు తెలిపింది.

‘‘నా మొట్టమొదటి సినిమా ఆడిషన్‌ 1998లో జరిగింది. అది కూడా మహేశ్‌బాబు సినిమా కోసం. ఆరోజు నాకెంతో భయం వేసింది. వాళ్లు ఇచ్చిన టాస్క్‌ చేయలేక అక్కడి నుంచి ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయాను. అప్పటివరకూ ఏదైతే డెస్క్‌ జాబ్‌ చేశానో మళ్లీ అదే కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత కొంతకాలానికి ధైర్యం కూడగట్టుకుని మొదటిసారి ప్రైవేటు ఆల్బమ్‌ కోసం కెమెరా ముందుకు వచ్చాను’’ అంటూ సమీరా(Sameera Reddy) తన కెరీర్‌ తొలినాళ్లను గుర్తు చేసుకుంది. ఈ పోస్ట్‌ కాస్త నెట్టింట వైరల్‌గా మారడంతో పలువురు నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెప్పారు మేడమ్‌’, ‘మహేశ్‌ నటించిన ఏ సినిమా కోసం మీరు ఆడిషన్‌ ఇవ్వడానికి వెళ్లారు?’ అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ‘రాజకుమారుడు’ సినిమా కోసమే సమీరా రెడ్డి ఆడిషన్‌కు వెళ్లిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

తెలుగులో ‘జై చిరంజీవా’, ‘అశోక్‌’ చిత్రాల్లో అలరించిన సమీరారెడ్డి (Sameera Reddy).. ఆ తర్వాత తమిళం, హిందీ చిత్రాల్లో వరుస అవకాశాలు రావడంతో చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమాల్లో నటించలేదు. 2012లో విడుదలైన ‘కృష్ణం వందే జగద్గురుమ్‌’లో ఆమె స్పెషల్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసింది. వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని