Samyuktha Menon: నాకు నటించడం రాదన్నారు

‘‘నాకు నటన అంటే ఇష్టం. సినిమా అంటే పిచ్చి. ఈ ఇండస్ట్రీలో విరామం లేకుండా వరుస సినిమాలు చేసే అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అంది నటి సంయుక్తా మేనన్‌. ‘భీమ్లానాయక్‌’తో తెలుగు తెరపై మెరిసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ..

Updated : 27 Jul 2022 13:59 IST

‘‘నాకు నటన అంటే ఇష్టం. సినిమా అంటే పిచ్చి. ఈ ఇండస్ట్రీలో విరామం లేకుండా వరుస సినిమాలు చేసే అవకాశం దొరికినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అంది నటి సంయుక్తా మేనన్‌ (Samyuktha Menon). ‘భీమ్లానాయక్‌’తో (Bheemla Nayak) తెలుగు తెరపై మెరిసిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ‘బింబిసార’తో (Bimbisara) అలరించేందుకు సిద్ధమైంది. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. వశిష్ఠ్‌ తెరకెక్కించారు. కేథరిన్‌ మరో నాయిక. ఆగస్టు 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ఆమె పంచుకున్న విశేషాలివి..

‘‘బింబిసార’ టైమ్‌ ట్రావెల్‌ ఫాంటసీ సినిమా. రెండు వేరువేరు కాలాల మధ్య నడిచే కథ ఇది. నా పాత్ర వర్తమాన కాలానికి సంబంధించినదిగా ఉంటుంది. కొంచెం మోడ్రన్‌ అమ్మాయిలా కనిపిస్తా. ‘బింబిసార 2’లో నా పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుంది’’.

* ‘‘ఈ కథ చెప్పినప్పుడు నాకు పీరియాడిక్‌ పార్ట్‌లోని పాత్ర చేయాలనిపించింది. ఎందుకంటే నాకు ఈ తరహావి చాలా ఇష్టం. ‘బాహుబలి2’, ‘బాజీరావ్‌ మస్తానీ’ వంటి చిత్రాల్ని ఎన్నోసార్లు చూశా. అవన్నీ నన్నెంతో ఆకర్షించాయి. అందుకే అవకాశముంటే ఇందులో అలాంటి పాత్ర చేయాలనుకున్నా. కుదర్లేదు. ఇప్పుడు చేసిన పాత్ర నాకెంతో సంతృప్తినిచ్చింది’’.

* ‘‘నేను ఏ భాషలో చేసినా నా సొంత గొంతునే వినిపించే ప్రయత్నం చేస్తా.  ఏ పరిశ్రమలో చేసినా.. ఓ పాత్ర పోషించేటప్పుడు దాన్ని పూర్తిగా సొంతం చేసుకోవాలంటే కచ్చితంగా ఆ భాష తెలిసుండాలి. అప్పుడే నటిగా పూర్తి సంతృప్తి దొరుకుతుంది. టాలీవుడ్‌లోకి అడుగు పెట్టడానికి ముందే.. ప్రత్యేకంగా శిక్షకుడిని పెట్టుకొని మరీ తెలుగు నేర్చుకున్నా’’.

* ‘‘తెలుగు పరిశ్రమ ఆరంభంలో రెండు మూడు అవకాశాలొచ్చినా.. కథలు నచ్చక ఒప్పుకోలేదు. తర్వాత సాయితేజ్‌ 15వ సినిమాలో అవకాశమొచ్చింది. అది సంతకాలు చేసిన వారానికి ‘భీమ్లానాయక్‌’ నుంచి పిలుపొచ్చింది. ఆ వెంటనే అదే బ్యానర్‌లో ‘సార్‌’ అవకాశం దక్కింది. ఇలా ఒకేసారి అన్ని ప్రాజెక్టులకు సంతకాలు చేయడం థ్రిల్లింగ్‌గా అనిపించింది. ‘సార్‌’ ఇప్పటికే ఓ పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. సాయితేజ్‌ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. మలయాళంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ చేయనున్నా. అది నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. త్వరలో వివరాలు తెలియజేస్తా’’.

* ‘‘ఒకప్పుడు ఉద్యోగంలో స్థిరపడటమే నా ఏకైక లక్ష్యం. అనుకోకుండా ఇండస్ట్రీలోకి వచ్చా. ఆ తర్వాత సినిమానే నా లోకమైంది. 2016లో నా తొలి మలయాళ చిత్రం ‘పాప్‌కార్న్‌’ చూసి అందరూ నాకు నటించడం రాదన్నారు. వాస్తవానికి అప్పటికి నాకు సినిమాల గురించి అంతగా తెలియదు. కథ, స్క్రిప్ట్‌పై అవగాహన లేదు. ఏదో అవకాశం వచ్చింది కదాని క్యాజువల్‌గా నటించేశాను. ఆ చిత్రం తర్వాతే ఇండస్ట్రీ గురించి పూర్తిగా అవగాహన వచ్చింది’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని