Santosh Shobhan: నాకున్న ప్రతిభ అదొక్కటే!

‘‘మనస్ఫూర్తిగా నవ్వుకొని.. నవ్విస్తూ చేసిన సినిమా ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. ఈ కథలో ఓ సీరియస్‌ అంశం ఉంది. మేము దాన్ని కూడా వినోదాత్మకంగానే చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు సంతోష్‌ శోభన్‌.

Updated : 04 Nov 2022 11:53 IST

‘‘మనస్ఫూర్తిగా నవ్వుకొని.. నవ్విస్తూ చేసిన సినిమా ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ (Like Share And Subscribe). ఈ కథలో ఓ సీరియస్‌ అంశం ఉంది. మేము దాన్ని కూడా వినోదాత్మకంగానే చెప్పే ప్రయత్నం చేశాం’’ అన్నారు సంతోష్‌ శోభన్‌ (Santosh Shobhan). ‘పేపర్‌బాయ్‌’, ‘ఏక్‌ మినీ కథ’ చిత్రాలతో యువతరంలో మంచి ఆదరణ దక్కించుకున్న కథానాయకుడాయన. ఇప్పుడు ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ అంటూ వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రమిది. శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు  సంతోష్‌.

‘‘నాకు దర్శకుడు మేర్లపాక గాంధీ అంటే ఇష్టం. తనతో మంచి బంధం ఉంది. ఆయన టైమింగ్‌ ఎలాంటిదో నాకు తెలుసు. నేనిప్పటి వరకు చేసిన సినిమాల్లో నా వయసును మించిన పాత్రలు చేశా. కానీ, తొలిసారి ఈ చిత్రంలో నా వయసుకు తగ్గ పాత్ర చేయగలిగా. ఇది నా ఫేవరెట్‌ క్యారెక్టర్‌. నేనిందులో యూట్యూబర్‌ విప్లవ్‌ అనే పాత్రలో కనిపిస్తా. రకరకాల ప్రాంతాలు తిరుగుతూ వీడియోలు చేయడం నా పని. ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’లా హైపర్‌ ఎనర్జిటిక్‌గా ఉండే పాత్రిది. చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పాత్రను చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశా’’.

వాళ్లని కలిశాక ఎలా భయపడ్డాం!

‘‘ఈ చిత్ర ట్రైలర్‌లో ‘ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొడతావా’ డైలాగ్‌ ఉంది. అది చూసి దీంట్లో దానికి సంబంధించిన పాయింట్‌ ఏమైనా ఉందేమో అనుకుంటున్నారు. నిజానికి అది వేరే షాట్‌లో చెప్పిన డైలాగ్‌. దాన్ని చాలా ఫన్‌గా చేశాం. ఇందులో పీపుల్‌ ప్రొటక్షన్‌ ఫోర్స్‌ అనే గ్యాంగ్‌ ఉంటుంది. మేము వాళ్లతో ఎలా కలిశాం.. కలిశాక ఎలా భయపడ్డాం, ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాం అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఓ సీరియస్‌ పాయింట్‌ను దీంట్లో వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం. ఫరియా ఇందులో వసుధ అనే పాత్రలో కనిపిస్తుంది. ఫరియా నుంచి చాలా నేర్చుకున్నా. సుదర్శన్‌తో నేను ‘ఏక్‌ మినీ కథ’ చేశాను. ఆ చిత్రంలో మా కెమిస్ట్రీని ఎంజాయ్‌ చేసిన వాళ్లు ఇందులో డబుల్‌.. ట్రిపుల్‌ ఆనందిస్తారు’’.

ఎంత కష్టమైనా..

‘‘నేను చిత్ర పరిశ్రమకు వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నాకు ఎదురైన వాళ్లంతా నాన్న (దర్శకుడు శోభన్‌) గురించి ఒక మంచి మాట చెప్పేవారు. నవ్వుతూ పలకరించేవారు. ఇది నా అదృష్టం. నాన్న వెళ్లిపోయి 14ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ నా చుట్టూ ఉన్న వాళ్లంతా ఆయన గురించి చెబుతూ నవ్వుతూ పలకరిస్తూ నాకు అండగా నిలుస్తున్నారంటే ఒకరకంగా వారి రూపంలో నాన్న నాతో ఉన్నట్లే. నేను చిన్నప్పుడు నటుడు కావాలని కల కన్నాను. అయ్యాను. ఇంతకంటే నాకు పెద్ద లక్ష్యాలేమీ లేవు. నాకున్న ప్రతిభ ఒక్కటే.. కష్టపడటం. ఎంత కష్టపడైనా మంచి చిత్రాలే చేయాలనుకుంటా. కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్లంటే నాకు చాలా ఇష్టం. ఈ తరహా కథలతో వినోదాలు పంచాలని ఉంది’’.

ప్రభాస్‌కు చూపించడమే కల..

‘‘ప్రభాస్‌ ఇండియా బిగ్గెస్ట్‌ స్టార్‌. ఆయన్ని ఎప్పుడు కలిసినా ఓ అభిమానిగానే కలిశా. మేము ఎప్పుడు కలిసినా ఆయనకున్న సమయం ప్రకారం టీజర్‌, ట్రైలర్‌, పాట.. ఇలా ఏదోకటి రిలీజ్‌ చేసి సపోర్ట్‌ చేస్తారు. ఇది ఆయన గొప్పదనం. నేనిప్పటి వరకు నా ఏ చిత్రం ఆయనకు చూపించలేదు. కానీ, ఆయనకు సమయం కుదిరితే ఈ ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’ను చూపించాలని ఉంది. అది నా కల. ఎందుకంటే ఇది నేనెంతో గర్వపడి నమ్మి చేసిన సినిమా. ప్రస్తుతం నేను నందిని రెడ్డి దర్శకత్వంలో ‘అన్ని మంచి శకునములే’ చిత్రం చేశా. డిసెంబరు 21న విడుదలవుతుంది. ‘ప్రేమ్‌కుమార్‌’ ముగింపు దశలో ఉంది. అలాగే యువీ క్రియేషన్స్‌లో ‘కల్యాణం కమనీయం’ అనే చిత్రం చేస్తున్నా’’.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు