Sashimadhanam Review: రివ్యూ: శశి మథనం.. ప్రేమికుడు ఎరక్కపోయి ఇరుక్కుంటే?

సోనియా సింగ్‌, పవన్‌ సిద్ధు నటించిన వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే!

Updated : 06 Jul 2024 11:19 IST

వెబ్‌సిరీస్‌: శశి మథనం; నటీనటులు: సోనియా సింగ్‌, పవన్‌ సిద్ధు, రూపాలక్ష్మి, ప్రదీప్‌ రాపర్తి, కేశవ్‌ దీపక్‌, అశోక్‌ చంద్ర తదితరులు; సంగీతం: సిన్జిత్‌ యర్రమిల్లి; ఛాయాగ్రహణం: రెహాన్‌ షేక్‌; నిర్మాత: హరీశ్‌ కొహిర్కర్‌; దర్శకత్వం: వినోద్‌ గాలి; స్ట్రీమింగ్‌ వేదిక: ఈటీవీ విన్‌.

పలు లఘు చిత్రాల్లో కలిసి నటించి క్యూట్‌ జోడీ అనిపించుకున్నారు పవన్‌ సిద్ధు- సోనియా సింగ్‌. వీరిద్దరు ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘శశి మథనం’. ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌ ఎలా ఉంది? స్టోరీ ఏంటి? చూద్దాం..

కథేంటంటే?: మదన్‌ (పవన్‌ సిద్ధు) వరంగల్‌ వాసి. బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకుని, అప్పుల పాలవుతాడు. తన బాకీ తీర్చకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందంటూ ఓ వ్యక్తి వార్నింగ్‌ ఇవ్వగా మదన్‌ ఎక్కడికైనా వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో మదన్‌ ప్రియురాలు శశి రేఖ (సోనియా సింగ్‌) అతడికి కాల్‌ చేస్తుంది. తన కుటుంబమంతా ఊరెళ్తోందని, కొన్ని రోజుల వరకూ రాదని చెబుతుంది. అదే సరైన సమయం అనుకుని, మదన్‌ హైదరాబాద్‌లోని శశి ఇంటికి వెళ్తాడు. అతడు అంతా ఓకే అనుకునేలోపు శశి కుటుంబ సభ్యులు తిరిగి వచ్చేస్తారు (sashimadhanam telugu review). తన లవర్‌.. ఫ్యామిలీ కంట పడకుండా శశి ఏం చేసింది? ఎంతటి ఒత్తిడికి గురైంది? మదన్‌ ఎన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్నాడు? చివరకు తన అప్పు తీరిందా? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ సిరీస్‌ చూడాల్సిందే.

ఎలా ఉందంటే?: ఇంట్లో ఎవరూ లేరనే విషయం తెలిసి ప్రేమించిన వ్యక్తి ఇంటికొచ్చినప్పుడు అదే సమయంలో కుటుంబ సభ్యులు తిరిగొస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందో ఎన్నో సినిమాల్లో కనిపించింది. దాన్నే ఇతివృత్తంగా ఎంచుకుని దర్శకుడు వినోద్‌ గాలి ఈ సిరీస్‌ని రూపొందించడం విశేషం. తన పేరుకు తగ్గట్టే వినోదాత్మకంగా చూపించడంలో మంచి మార్కులు కొట్టేశారు. మదన్‌ వ్యక్తిత్వం గురించి ప్రేక్షకుడికి తెలియజేసేందుకు అధిక సమయం తీసుకున్నారు. ఎప్పుడైతే హీరో.. హీరోయిన్‌ ఇంట్లో అడుగుపెడతాడో అప్పటి నుంచి ఫన్‌ రైడ్‌ ప్రారంభమవుతుంది. కథంతా ఒకే ఇంట్లోనే సాగినా బోర్ కొట్టదు. తెరపై కనిపించే ప్రతి పాత్రను ప్రేక్షకుడికి గిలిగింతలు పెట్టేలా క్రియేట్‌ చేశారు. శశి అత్త రంగమ్మ (రూపాలక్ష్మి) క్యారెక్టర్ రాకతో కథ మలుపు తిరుగుతుంది. ప్రతి విషయాన్నీ ఆరా తీసే ఆ పోలీసు అధికారిణి.. శశి తన దగ్గరేదో దాస్తుందనే సంగతి తెలుసుకున్నాక మరింత ఉత్కంఠ నెలకొంటుంది. ఈ సస్పెన్స్‌తోపాటు తర్వాత హారర్‌ ఎలిమెంట్‌నూ తెరపైకి తీసుకొచ్చారు. అక్కడా నవ్వులే.

అయితే, లాజిక్స్‌ పట్టించుకోకుండా చూస్తే ఈ సిరీస్‌ని ఆస్వాదించగలం. లేదంటే ముందుకెళ్లలేం. ‘హీరో ఎంతకాలం ఇలా తప్పించుకుని ఆ ఇంట్లోనే తిరుగుతాడు’ అని ఆడియన్‌ భావించే టైమ్‌కి అతడి పాత ప్రేమకథను చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు (sashimadhanam telugu review). ఓ ఫ్లోలో వెళ్తున్న సిరీస్‌కు అది అడ్డుపడినట్లైంది. అతడి మాజీ లవర్‌ పాత్ర వల్ల నిడివి పెరిగిందే తప్ప ఎలాంటి ప్రభావం చూపలేదు. శశి - మదన్ లు ప్రేమికులనే విషయం వాళ్ల ఫోన్ కాల్ ద్వారానే తెలుస్తుంది. వేర్వేరు నగరాల్లో ఉండే వాళ్లిద్దరి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? అనేది చూపించి ఉంటే బాగుండేది. ఇందులో అన్నదమ్ముల (హీరో, తన బ్రదర్) అనుబంధం ఉంది గానీ అది రొటీన్ ఫార్మాటే. హీరో ఖాళీగా తిరుగుతూ ఎంజాయ్ చేయడం, హీరో అన్నయ్య జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించడం, పని చేయని తమ్ముడిపై పైకి కోపం ప్రదర్శించినా.. లోపల ప్రేమ ఉండడం.. ఇలా ఎన్నో చిత్రాల్లోని రొటీన్ ట్రాక్ కాకుండా కొత్తగా ప్రయత్నిచాల్సింది. గ్రాండ్ ఫాదర్ తో క్లోజ్ గా ఉండే వాళ్లకి శశి తాత కనెక్ట్ అవుతాడు. ముందు నుంచీ సరదాగా ఉన్నా ప్రీ క్లై మాక్స్ లో ' ప్రేమ ' సందేశంతో ఆలోచింపజేస్తారు. క్లైమాక్స్‌ ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టే ఉంటుంది. మొత్తం ఆరు ఎపిసోడ్లు (ఒక్కో ఎపిసోడ్‌ నిడివి 30 నిమిషాల్లోపే).

ఎవరెలా చేశారంటే?: ఎరక్కపోయి ఇరుక్కున్న ప్రేమికుడిగా పవన్‌ సిద్ధు, అతడి కోసం రిస్క్‌ తీసుకునే ప్రేయసిగా సోనియా సింగ్‌ ఒదిగిపోయారు. ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకుంటూనే ఫ్యామిలీకి కనిపించకుండా ఉండే సమయంలో భయపడతూ వైవిధ్యం ప్రదర్శించారు. రంగమ్మత్తగా రూపాలక్ష్మి సందడి బాగుంది. శశి తాతగా నటించిన అశోక్‌ చంద్ర కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగానికి గురిచేస్తారు. అటు హీరో అన్నయ్య, వదిన, వారి పాప, ఇటు శశి పేరెంట్స్‌, ఆమె తమ్ముడు ఆకట్టుకుంటారు. సాంకేతికంగా సిరీస్ ఉన్నతంగా ఉంది. కామెడీ, సస్పెన్స్.. ఇలా థీమ్ కి తగ్గట్టు సిన్జిత్ అందించిన నేపథ్యం సంగీతం అలరిస్తుంది. పాటలు పెద్దగా ప్రభావం చూపలేదు. కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. తెలిసిన కథే అయినా ఎంగేజ్ చేయడంలో వినోద్ సక్సెస్ అయ్యారు.

కుటుంబంతో కలిసి చూడొచ్చా?: ఎలాంటి సందేహం లేకుండా ఫ్యామిలీతో కలిసి ఈ వెబ్‌సిరీస్‌ చూడొచ్చు. అసభ్యకర సన్నివేశాలు, సంభాషణలు లేవు. 

బలాలు
+ హాస్యం 
+ పవన్‌ సిద్ధు- సోనియా సింగ్‌ జోడీ
బలహీనతలు
- తొలి ఎపిసోడ్‌లో సాగదీత
- హీరో పాత ప్రేమకథ
చివరిగా: శశి- మదన్‌ల మథనం.. ప్రేక్షకుడికి వినోదం 

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని