Sathi Gani Rendu Ekaralu review: రివ్యూ: సత్తిగాని రెండెకరాలు

Sathi Gani Rendu Ekaralu review: జగదీష్‌ ప్రతాప్‌, వెన్నెల కిషోర్‌, రాజ్‌ కీలక పాత్రల్లో నటించిన ‘సత్తిగాని రెండెకరాలు:చాప్టర్‌-1’ ఎలా ఉందంటే?

Published : 26 May 2023 12:54 IST

Sathi Gani Rendu Ekaralu review; చిత్రం: సత్తిగాని రెండెకరాలు; నటీనటులు: జగదీష్‌ ప్రతాప్‌, వెన్నెల కిషోర్‌, అనీషా దామా, వంశధర్‌ గౌడ్‌, బిత్తిరి సత్తి, మోహనశ్రీ, రాజ్‌ తిరందాసు; సంగీతం: జయ్‌ క్రిష్‌; సినిమాటోగ్రఫీ: విశ్వంత్‌రెడ్డి; ఎడిటింగ్‌: అభినవ్‌ దండ; నిర్మాత: వై.రవిశంకర్‌, నవీన్‌ యెర్నేని; రచన, దర్శకత్వం: అభినవ్‌ దండ; స్ట్రీమింగ్‌వేదిక: ఆహా

వేసవి వినోదాలను రెట్టింపు చేస్తూ ఒకవైపు థియేటర్‌లో సినిమాలు సందడి చేస్తుంటే, అందుకు దీటుగా ఓటీటీలోనూ నేరుగా కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. అలా తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో విడుదలైన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’. ‘పుష్ప’లో కేశవగా సుపరిచితుడైన జగదీష్‌ ప్రతాప్‌ కీలక పాత్రలో నటించడంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. (sathi gani rendu ekaralu review)  మరి ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది?

కథేంటంటే:  సత్తి ( జగదీష్‌ ప్రతాప్‌) తాత ఒకప్పుడు ఆసామి. ఆడంబరాలకు పోయి ఉన్న భూములన్నీ అమ్మగా చివరకు రెండెకరాలు మిగులుతాయి. అదే వారసత్వ ఆస్తిగా సత్తికి వస్తుంది. ఇద్దరు బిడ్డల తండ్రయిన సత్తికి జీవితంలో అన్నీ కష్టాలే. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. పాపకు గుండెలో రంధ్రం ఉండటంతో ఆపరేషన్‌కు రూ.25లక్షలు అవసరమవుతాయి. వైద్య ఖర్చుల కోసం ఉన్న ఆటోనీ అమ్మేస్తాడు. అప్పులు కూడా పెరిగిపోతాయి. దీంతో తాత వారసత్వంగా వచ్చిన రెండెకరాలు అమ్మేద్దామని నిర్ణయించుకుంటాడు. (sathi gani rendu ekaralu review) సైకిల్‌పై వెళ్తుండగా దారిలో ఓ కారు ప్రమాదం చూస్తాడు. ఆ కారు దగ్గరకు వెళ్లి వెనుక సీటులో ఉన్న బ్రీఫ్‌కేస్‌ను దొంగిలిస్తాడు. ఇంతకీ ఆ సూట్‌కేస్‌లో ఏముంది? కారు ప్రమాదానికి గురైందా? లేక ఎవరైనా ప్లాన్‌ చేశారా? బ్రీఫ్‌కేస్‌ దొంగిలించిన తర్వాత నుంచి సత్తి కథ ఎలా మారింది? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఇదొక క్రైమ్‌ కామెడీ డ్రామా. ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. దర్శకుడు అభినవ్‌ దండ రాసుకున్న కథలో కూడా కొత్తదనం ఏమీ ఉండదు. అయితే, పల్లెటూరి నేపథ్యాన్ని తీసుకుని, తీర్చిదిద్దిన విధానమే కొత్తగా ఉంటుంది. ఇటీవల కాలంలో పల్లె మూలాల్లోకి వెళ్లి కథలకు కొత్త సొబగులు అద్దుతున్నారు దర్శకులు. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ సౌందర్యాన్ని, పల్లెల మట్టివాసన చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దర్శకుడు అభినవ్‌ కూడా తెలంగాణ పల్లె వాతావరణాన్ని, భాష, వ్యవహారశైలిని అధ్యయనం చేసి ‘సత్తిగాని రెండెకరాలు’ అందులోని పాత్రలను తీర్చిదిద్దుకున్నారు. అవన్నీ సహజంగా ఉన్నాయి. సత్తి కుటుంబ కష్టాలతో మొదలైన సినిమా అతడికి బ్రీఫ్‌ కేసు దొరకడంతో మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది.(sathi gani rendu ekaralu review) ఆ బ్రీఫ్‌ కేసులో ఏముంది? దాని తెరవడానికి సత్తి అతడి స్నేహితుడు అంజి చేసే ప్రయత్నాలు, మధ్యలో వెన్నెల కిషోర్‌, బిత్తిరి సత్తి పంచే కామెడీ నవ్వులు పంచుతూ సినిమా సాగుతుంది. అయితే, సమస్యల్లా ఆ కామెడీ సన్నివేశాలు మళ్లీ మళ్లీ పునరావృతమవుతున్నాయన్న భావన చూస్తున్న ప్రేక్షకుడికి కలుగుతుంది. దీని వల్ల కథనం నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఒకానొక దశలో నవ్వులు పంచాల్సిన సన్నివేశం కూడా రిపీట్‌ సీన్స్‌ వల్ల తేలిపోయింది. కథనంలో పెద్ద మలుపులేవీ ఉండవు. అక్కడక్కడా మాత్రమే కొన్ని సన్నివేశాలు మాత్రమే ప్రేక్షకుడిలో ఆసక్తిని పెంచుతాయి. అయితే, అవన్నీ ముందే ఊహించవచ్చు. పతాక సన్నివేశాలు కాస్త ఆసక్తిగా అనిపిస్తాయి.

ఎవరెలా చేశారంటే: జగదీష్‌, రాజ్‌, వెన్నెల కిషోర్‌ తమ పాత్రల్లో మెప్పించారు. వెన్నెల కిషోర్‌పాత్రను ఇందులో కాస్త డిఫరెంట్‌గా డిజైన్‌ చేశారు. అయితే, అక్కడక్కడా పాత వెన్నెల కిషోర్‌ కనిపిస్తూనే ఉంటాడు. మురళీధర్‌ గౌడ్‌ (బలగం నటుడు), బిత్తిరి సత్తి తదితరులు తమ పరిధి మేరకు నటించారు. (sathi gani rendu ekaralu review)  బిత్తిరి సత్తితో పాత్రను ఇంకాస్త ఉపయోగించుకుని ఉంటే బాగుండేది. సాంకేతికంగా సినిమా ఓకే. జయ్‌ క్రిష్‌ పాటల, నేపథ్య సంగీతం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా ఓకే. తెలంగాణ పల్లె జీవనాన్ని ఆవిష్కరించారు. సినిమా నిడివి తక్కువే అయినా, కొన్ని సన్నివేశాలు పునరావృతం అయినట్లు అనిపిస్తుంది. వాటికి కత్తెరవేయాల్సింది. దర్శకుడు అభివన్‌ కొత్త కథేమీ చెప్పలేదు. కానీ, తీసుకున్న నేపథ్యం, పాత్రలను తీర్చిదిద్దిన విధానం మాత్రం బాగుంది. సంభాషణలు కూడా అక్కడక్కడా మెరిశాయి.

  • బలాలు
  • + నటీనటులు, నేపథ్యం
  • + కామెడీ సన్నివేశాలు
  • + క్లైమాక్స్‌
  • బలహీనతలు
  • - ఊహించే కథనం
  • - ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
  • చివరిగా:  ‘టైమ్‌ పాస్‌ కోసం ‘సత్తిగాని రెండెకరాలు’ (sathi gani rendu ekaralu review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని