Gurthunda seethakalam review: రివ్యూ: గుర్తుందా శీతాకాలం

Gurthunda Seethakalam review: సత్యదేవ్‌, తమన్నా కీలక పాత్రల్లో నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ ఎలా ఉందంటే?

Updated : 09 Dec 2022 17:11 IST

Gurthunda Seethakalam review; చిత్రం: గుర్తుందా శీతాకాలం (Gurthunda Seethakalam); నటీనటులు: సత్యదేవ్‌ (Satyadev), తమన్నా (Tamannaah), కావ్య శెట్టి, మేఘా ఆకాష్‌, ప్రియదర్శి, సుహాసిని తదితరులు; సంగీతం: కాల భైరవ; ఛాయాగ్రహణం: సత్య హెగ్డే; దర్శకత్వం: నాగశేఖర్‌; నిర్మాతలు: రామారావు చింతపల్లి, నాగశేఖర్‌, భావనా రవి; విడుదల: 09-12-2022

విలక్షణమైన పాత్రలతో అలరించడంలో ముందుంటారు నటుడు సత్యదేవ్‌ (Satyadev). ఇటీవలే ‘గాడ్‌ఫాదర్‌’ (Godfather)తో ప్రతినాయకుడిగా మెప్పించిన ఆయన.. ఇప్పుడు హీరోగా ‘గుర్తుందా శీతాకాలం’(Gurthunda Seethakalam)తో బాక్సాఫీస్‌ ముందుకొచ్చారు. ఇది ఆయనకు తొలి ప్రేమకథా చిత్రం. కన్నడలో విజయవంతమైన ‘లవ్‌ మాక్‌టైల్‌’కు రీమేక్‌గా రూపొందించారు. కథ నచ్చి తమన్నా(Tamannaah) వంటి స్టార్‌ నాయిక ఈ సినిమాలో భాగమవ్వడంతో దీనిపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు, ప్రచార చిత్రాలు ఆహ్లాదభరితంగా కనిపించడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. మరి ఈ శీతాకాలం ప్రేమకథ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతులు పంచింది? (Gurthunda Seethakalam review) సత్యదేవ్‌, తమన్నాలకు ఎలాంటి ఫలితాన్ని అందించింది? తెలుసుకుందాం పదండి.. 

కథేంటంటే: దేవ్‌ అలియాస్‌ సత్యదేవ్‌ (సత్యదేవ్‌) మధ్యతరగతి కుర్రాడు. స్కూల్‌ డేస్‌లోనే తొలిసారి ప్రేమలో విఫలమైన తను.. కాలేజీలో అమ్ము అలియాస్‌ అమృత (కావ్య శెట్టి)ని చూసి మనసు పారేసుకుంటాడు. ఆమె బాగా డబ్బున్న అమ్మాయి. దేవ్‌లోని అమాయకత్వం నచ్చి ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. అమ్ముని పెళ్లి చేసుకొని త్వరగా జీవితంలో స్థిరపడాలన్న లక్ష్యంతో సత్య బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాడు. అయితే అతనికి వచ్చే అరకొర సంపాదనతో బతకడం కష్టమని తల్లి చెప్పడంతో అమ్ము ఆలోచనలో పడుతుంది. దేవ్‌ను అవమానించి.. అతనికి బ్రేకప్‌ చెబుతుంది. ఆ బాధ నుంచి దేవ్‌ కోలుకునే లోపే.. అతని జీవితంలోకి నిధి (తమన్నా) ప్రవేశిస్తుంది. అతని గతం తెలిసీ తనని నిజాయితీగా ప్రేమిస్తుంది. ఇద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో అమ్ము మళ్లీ దేవ్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? నిధిని పెళ్లి చేసుకున్నాక.. దేవ్‌ జీవితం ఎలా సాగింది? (Gurthunda Seethakalam review) తన ప్రయాణంలో పరిచయమైన దివ్య (మేఘా ఆకాష్‌)కు అతను తన ప్రేమకథను ఎందుకు చెప్పాడు? ఈ కథలో ప్రశాంత్‌ (ప్రియదర్శి) పాత్రేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

ఎలా సాగిందంటే: దేవ్‌ అనే వ్యక్తి జీవితంలోని మూడు ప్రేమకథల సమాహారమే ఈ చిత్రం. ఈ తరహా ప్రేమకథలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమొరీస్‌’ నుంచి ‘ప్రేమమ్‌’ వరకు ఈ తరహా చిత్రాలు అనేకం వచ్చాయి. ఇప్పుడీ జాబితాలోకి ‘గుర్తుందా శీతాకాలం’ కూడా చేరింది. అయితే ప్రేమకథలు ఏ తరహావైనా సరే.. దాన్ని కొంచెం కొత్తగా హృదయాన్ని హత్తుకునేలా చెప్పగలిగితే చాలు ప్రేక్షకులతో ఈజీగా హిట్టు మాట వినిపించేసుకోవచ్చు. కానీ, ఈ శీతాకాలం ప్రేమకథలో ఆ కొత్తదనం కనిపించలేదు. దీనికి తోడు దేవ్‌ జీవితంలోని మూడు ప్రేమకథల్లోనూ సరైన సంఘర్షణ, ఫీల్‌ లేకపోవడంతో ఏ ఒక్క కథతోనూ ప్రేక్షకులు కనెక్ట్‌ అవ్వలేరు. దేవ్‌ మంగళూరుకు వెళ్లే ప్రయాణంలో దివ్య తారసపడటం.. ఓ చిన్న ప్రమాదం నుంచి ఆమెను కాపాడటం వంటి ఎపిసోడ్లతో సినిమా సాదాసీదాగా ప్రారంభమవుతుంది. (Gurthunda Seethakalam review) అతను ఆమెకి తన ప్రేమకథల్ని చెప్పడం ప్రారంభించాకే అసలు చిత్రం మొదలవుతుంది.

దేవ్‌ స్కూల్‌ డేస్‌ ప్రేమకథ ఏమాత్రం ఆకట్టుకోదు. మాతృకలో ఉందని దాన్ని యథాతథంగా దించేశారు కానీ, దాన్ని ఎత్తేసినా మిగతా కథకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. దేవ్‌ కాలేజీ ప్రేమకథలో ఫీల్‌ కనిపించకున్నా.. అక్కడక్కడా మంచి ఫన్‌ వర్కవుట్‌ అయ్యింది. అమృత దృష్టిలో పడేందుకు దేవ్‌ చేసే ప్రయత్నాలు, ఇద్దరి మధ్య నడిచే చాటింగ్‌ ఎపిసోడ్‌ కడుపుబ్బా నవ్విస్తాయి. అలాగే దేవ్‌ ఇంటర్వ్యూ ఎపిసోడ్‌ సైతం మంచి కాలక్షేపాన్నిస్తుంది. అతన్ని అమ్ము అవమానించి దూరం పెట్టడం.. అదే సమయంలో అనుకోకుండా నిధి అతని జీవితంలోకి రావడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. అలాగే విరామానికి ముందు వచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది. అయితే ప్రథమార్ధమంతా సరదా సరదాగా సాగిన కథ.. ద్వితీయార్ధంలో భావోద్వేగభరితంగా మారి మదిని బరువెక్కిస్తుంది. దేవ్‌ - నిధిల పరిచయం.. ఒకరికొకరు దగ్గరయ్యే క్రమంలో ఇద్దరూ కలిసి చేసే ప్రయాణం ఆహ్లాదభరితంగా సాగుతూనే అక్కడక్కడా నవ్విస్తుంది. అలాగే పెళ్లి తర్వాత వచ్చే ఫస్ట్‌ నైట్‌ ఎపిసోడ్‌ ఫన్నీగా ఉంటుంది. కానీ, ఆ తర్వాత వచ్చే ఎపిసోడ్లన్నీ సాగతీత వ్యవహారంలా కనిపిస్తాయి. (Gurthunda Seethakalam review) ప్రచార కార్యక్రమాల్లో ఈ సినిమాని ‘గీతాంజలి’తో పోల్చారు సత్యదేవ్‌. అలా ఎందుకన్నారన్నది ముగింపు చూస్తే అర్థమవుతుంది. కానీ, అది ప్రేక్షకులకు ఎలాంటి కొత్త అనుభూతిని పంచివ్వదు.

ఎవరెలా చేశారంటే: దేవ్‌ పాత్రలో సత్యదేవ్‌ (Satyadev) చక్కగా ఒదిగిపోయారు. కాలేజీ ఎపిసోడ్స్‌లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. తనదైన కామెడీ టైమింగ్‌తో కావాల్సినంత వినోదాన్ని పంచారు. ఆయన ఫ్రెండ్‌ ప్రశాంత్‌గా ప్రియదర్శి ఆకట్టుకున్నారు. కాలేజీ ఎపిసోడ్స్‌లో ఇద్దరి మధ్య వచ్చే కొన్ని ట్రాక్స్‌ చక్కగా వర్కవుటయ్యాయి. (Gurthunda Seethakalam review) దేవ్‌ - అమృతల ప్రేమకథ వినోదాన్ని పంచగా.. నిధి - దేవ్‌ల ప్రేమకథ హృదయాల్ని బరువెక్కిస్తుంది. అయితే ఈ రెండు ప్రేమకథల్లోనూ కొత్తదనం లేకపోవడం.. సరైన సంఘర్షణ కొరవడటం చిత్ర ఫలితాన్ని దెబ్బ తీసింది. పతాక సన్నివేశాల్లో తమన్నా (Tamannaah) నటన ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ఆమెకు ఓ ప్రయోగంలా మిగిలిపోతుంది. కావ్యశెట్టి, మేఘా ఆకాష్‌, సుహాసిని పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. నాగశేఖర్‌ మాతృకను యథాతథంగా తెరపైకి తీసుకొచ్చినట్లు అనిపిస్తుంది. స్కూల్‌ డేస్‌ లవ్‌ ట్రాక్‌ను తీసేసుంటే కనీసం నిడివి పరంగానైనా కలిసొచ్చేది. కాల భైరవ సంగీతం, సత్య హెగ్డే ఛాయాగ్రహణం సినిమాకి బలాన్నిచ్చాయి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.

బలాలు: + సత్యదేవ్‌, తమన్నాల నటన; + నవ్వులు పంచే కాలేజీ ప్రేమకథ; + విరామ సన్నివేశాలు

బలహీనతలు: - కొత్తదనం లేని కథనం; - పతాక సన్నివేశాలు

చివరిగా: గుర్తుంచుకోదగ్గ ప్రేమకథేమీ కాదు!(Gurthunda Seethakalam review)

గమనిక: ఈ సమీక్షసమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని