మట్టివాసన కథలు..మానవత్వ పరిమళ చిత్రాలు

మన సినిమాలు ఆస్కార్‌ తుది జాబితాకు నోచుకోలేకపోతుంటే.. ఒక భారతీయ చలనచిత్రం 1955ల్లోనే న్యూయార్క్‌ నగరంలో 32 వారాలు ఆడించగలిగి

Published : 02 May 2021 10:33 IST

నేడు సత్యజిత్‌రే శతజయంతి 

మన సినిమాలు ఆస్కార్‌ తుది జాబితాకు నోచుకోలేకపోతుంటే.. ఒక భారతీయ చలనచిత్రం 1955ల్లోనే న్యూయార్క్‌ నగరంలో 32 వారాలు ఆడించగలిగి, భారతీయ సినీ ప్రేమికుడి ఛాతీ ఉప్పొంగేలా చేసిన దర్శకుడెవరు? కల్పితాల్లో, భక్తిపారవశ్యంలో మునిగి    తేలుతున్న సినిమా కథల్ని, కథనాల్ని నేలదారి  నడిపించి...మట్టి వాసన చూపించిన  మహారచయిత ఎవరు?అప్పటి వరకూ స్టూడియోల్లోనే మగ్గుతున్న సినిమా కెమెరాలకు సామాన్యజీవనాన్ని పరిచయం చేసిన దార్శనికుడెవరు?

భారత చలనచిత్ర జగత్తు దశను, దిశను మార్చిన ఆ సినిమా దర్శక దిగ్గజం పేరు సత్యజిత్‌ రే(రాయ్‌). ఆయన శతజయంతి నేడు (జననం: 2 మే 1921). వంద సంవత్సరాలైనా ఆయన ప్రభావం నేటికీ భారతీయ దర్శకుల మీద ప్రత్యక్షం గాను పరోక్షం గాను ఉందంటే ఊరేకే కాదు.. దాని వెనుక కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష... ఎన్నో త్యాగాలున్నాయి. 

కోల్‌కతా నగరంలో సుకుమార్‌ రాయ్, సుప్రభా రాయ్‌   దంపతులకు 1921 మే 2 జన్మించారు సత్యజిత్‌ రే. మంచి చదువరి. చిత్రలేఖనం అంటే ఆసక్తి ఉన్న ఆయన డిగ్రీ పూర్తి చేశాక లలిత కళలు అభ్యసించడానికి కోల్‌కతాలో ఉన్న రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ శాంతినికేతన్‌లో చేరారు. తర్వాత ఒక బ్రిటీష్‌ అడ్వర్టైజింగ్‌ కంపెనీలో విజువలైజర్‌ ఉద్యోగంలో చేరారు. ఖాళీ సమయాల్లో సినిమా పత్రికలు చదివేవారు. దాదాపు ఆనాటి అన్ని సినిమా పత్రికలు, పుస్తకాలు ఆయన గదిలో ఉండేవి. ‘నేను సంపాదించిన సినిమా పరిజ్ఞానం అంతా ఈ పత్రికల ద్వారానే సంపాదించాను’ అంటారు రే. ఒకసారి ఆయనకు కోల్‌కతా నగరంలో ఫ్లాట్‌ఫాం మీద సెకండ్‌ హాండ్‌ పుస్తకాల షాప్‌లో ‘ది గోస్ట్‌ గోస్‌ వెస్ట్‌’ అనే బ్రిటిష్‌ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ పుస్తకం దొరికింది. దాన్ని చదువుతూ స్క్రిప్ట్‌ రాయడం అభ్యాసం చేశారాయన. విభిన్నమైన సినిమాలు చూస్తూ దర్శకుడి శైలిని గమనిస్తూ, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు. ‘కథ కన్నా, నటీనటుల కన్నా, స్టూడియో నిర్మాతల కన్నా, దర్శకుడే ఒక సినిమాకు ప్రత్యేకత ఇవ్వగలడు’ అని నమ్మేవారు సత్యజిత్‌ రే.   సినిమాలపై మంచి అవగాహన సంపాదించాక... దర్శకుడు అవ్వాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం చేస్తూ కళాదర్శకుడిగా ఒక సినిమాకు పనిచేశారు. అలాగే ఒక బెంగాళీ కథకి సొంతంగా స్కీన్‌ప్లే రాసుకున్నారు. ఆ కథ చెప్పమని ఓ నిర్మాత పిలిచారు. నచ్చితే కథకుడిగా తీసుకుంటా అన్నారు. అవేవి ముందుకు సాగలేదు. 

మలుపుతిప్పిన ‘బైస్కిల్‌ థీవ్స్‌’ 

విత్తనం మట్టిని తాకినప్పుడే మొలకెత్తుతుంది. విత్తనం రాయ్‌ అయితే, ‘బైస్కిల్‌ థీవ్స్‌’ తడిచెమ్మ ఉన్న కుండి. ఉద్యోగం చేస్తున్న కంపెనీ పనిమీద ఆరునెలలు పనిచేయడానికి భార్య బిజోయ్‌    రాయ్‌తో ఇంగ్లండ్‌ వెళ్లారు రే. ఆ మూడో రోజే నియోరియలిజం (అభూత కల్పనలు పక్కకు నెట్టి వాస్తవానికి దగ్గరగా ఉండటం) అనే కాన్సెప్ట్‌తో విక్టోరియా డిసికా తీసిన ఇటాలియన్‌ సినిమా ‘బైస్కిల్‌ థీవ్స్‌’ చూశారు. అంతే.... అంతకు ముందు నుంచి తన మనసులో ఉన్న బిభూతి భూషణ్‌ బందోపాద్యాయ రాసిన ‘పథేర్‌ పాంచాలి’ నవలను సినిమాగా తీద్దామా? వద్దా? అనే ఊగిసలాటలో ఉన్న రాయ్‌ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేశారు. సినిమా తీయాలని    నిర్ణయానికి వచ్చారు. అదీ సహజవాతావరణంలో, ఊరు పేరు లేని నటులతో తీయాలని అనుకున్నారు. ఆ నిర్ణయమే భారత సినిమా నవశకానికి నాంది పలికింది. ‘పథేర్‌ పాంచాలి’ కేన్స్‌ ఫిల్మ్‌ ఉత్సవంలో ఉత్తమ హ్యుమన్‌ డాక్యుమెంట్‌ అవార్డు సొంతం చేసుకుంది. ‘అపరాజితో’ ఆయన ప్రతిభ ప్రపంచ సినీ పరిశ్రమకు తెలిసొచ్చింది. ‘అపూర్‌ సన్‌సార్‌’, ‘కాంచన్‌జంగా’, ‘చారులతా’ చిత్రాల్లో ఆయనలోని దర్శకుడికి ప్రపంచం    అభిమానిగా మారిపోయింది. సత్యజిత్‌ రే మొత్తంగా 36  చిత్రాలకు దర్శకత్వం వహించారు. చివరి సినిమా ‘ఆగంతక్‌’.

సహజత్వ చిత్రణ

సత్యజిత్‌ రే... ఒట్టి దర్శకుడే కాదు, స్కీన్ర్‌ ప్లే, కథారచయిత కూడా. ఎడిటర్, సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు, చిత్రకారుడు, కళాదర్శకుడు, కథలు, వ్యాసాలు, నవలలు రాసిన సాహిత్యకారుడు.... ఒకటేమిటి సినిమాకు సంబంధించిన ప్రతీ క్రాఫ్ట్‌లో నిష్ణాతుడు అనదగ్గ ప్రతిభ ఆయన సొంతం. 12.. చిన్న కథలతో ఒక పుస్తకం తెచ్చారాయన. ఇవన్నీ చిన్న చిన్న ఫజిళ్లతో  ఆకట్టుకుంటాయి. ఆయన సృష్టించిన ‘ఫెలుడా’, ‘ప్రొఫెసర్‌ శంకు’ పాత్రలు బెంగాళీ బాల   సాహిత్యంలో నేటికీ మరుపురానివి. జవహర్‌లాల్‌ నెహ్రూ జీవిత చరిత్ర ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’కు ముఖచిత్రం సత్యజిత్‌రే రూపొందించింది. ‘‘చుట్టూ జరుగుతున్న సంఘటనలు, మన పరిసరాల్లోని సామన్య జీవితంలోంచే కథలు పుట్టాలి. అలా సహజత్వంతో నిండిన కళ రాణిస్తుంది’’ అని చెప్పే సత్యజిత్‌రే... సౌమిత్రా ఛటర్జీ, షర్మిలా ఠాగుర్‌ లాంటి సహజ నటులను వెండితెరకు పరిచయం చేశారు. 

చెరగని సంతకం

‘‘సినిమా తీయడం మిస్టరీ... ఆ మిస్టరీని అర్థం చేసుకోవడంలోనే దర్శకుడి గొప్పతనం దాగి ఉంది. సృజనాత్మక కళలన్నింటిలో సినిమా తీయడం అత్యంత శారీరక శ్రమతో కూడుకున్నది... అందుకు ఎల్లప్పుడు సన్నద్ధంగా ఉండాలి. సినిమాలు తీయడం రావాలంటే ముందు చూడటం రావాలి. మంచిది, చెడ్డది అని లేదు, సక్సెస్‌-ఫ్లాప్‌తో సంబంధం లేదు. అన్నీ చూస్తూనే ఉండాలి. కొన్ని షాట్స్‌ కలిస్తే ఒక సీన్‌ కదా... తీసిన షాట్‌ ఎంత బాగున్నా సరే అది ఆ సీన్‌లో ఇమడాలి. లేకపోతే ఆ ఒక్క షాట్‌ వలన మొత్తం సీన్‌    పాడవచ్చు.’’ అంటూ సినిమా సూత్రాలను వివరించిన భారతీయ సినీ విశ్వవిద్యాలయం ఆయన. 32 నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులు సొంతం చేసుకున్న వెండితెర దిగ్గజం. కేన్స్, బెర్లిన్, వెనిస్‌లాంటి చిత్రోత్సవాల్లో భారతీయ సినిమా అంటే ఇదీ అని చాటిన 6.4అంగులాల విగ్రహమాయన. 40ఏళ్లు సినిమాకు విశిష్ట సేవలు అందించినందుకు గాను సత్యజిత్‌రే ‘ఆస్కార్‌ లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌’ పురస్కారంతో అంతర్జాతీయ గౌరవం పొందారు. ప్రపంచ సినీ చరిత్రపై చెరగని సంతకం చేశారు. భారత అత్యున్నత పురస్కారం భారతరత్న పొందిన ఆయన... 1992 ఏప్రిల్‌ 23న మనల్ని వదిలివెళ్లినా... వందేళ్లే కాదు.. భారతీయ చలనచిత్రం ఉన్నంత వరకు సినీ అభిమాని గుండెల్లో చిరంజీవే..! 

‘‘ఆయన ఎవ్వరి దగ్గర సహాయకుడిగా పని   చేయలేదు. పుస్తకాల ద్వారా తాను సంపాదించిన పరిజ్ఞానంతో వరల్డ్‌ క్లాసిక్‌ సినిమాలు తీశారు. అయితే తనను ప్రభావితం చేసింది ‘ది రివర్‌’ సినిమా తీసిన ఫ్రెంచ్‌ దర్శకుడు జీన్‌ రినోయర్‌ అని ఆయనే స్వయంగా చాలా సార్లు చెప్పుకొన్నారు.’’

 ‘‘సత్యజిత్‌రే..నిలువెత్తు మానవత్వ విలువలకు, భారత సామాజిక జీవనానికి తెర.’’ - విమర్శకులు

‘‘ఆయన సినిమాలు చూడకపోతే... ప్రపంచంలో సూర్య, చంద్రులను చూడనట్టే’’ - జపాన్‌ దిగ్గజ దర్శకుడు అకీరా కురసోవా - కమల్‌రెడ్డి, హైదరాబాద్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని