Published : 06/12/2021 14:42 IST

Savitri: సావిత్రి పక్కన కూర్చుంటే వణికిపోయేవారు!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘మహానటి’ కంటె పెద్ద మాటని ఉపయోగించదగిన వ్యక్తి సావిత్రి(savitri). తన నటనతో తెలుగు సినీ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. పాత్ర ఏదైనా ఇట్టే ఒదిగిపోయే ఆమె ఎన్నో మరుపురాని చిత్రాల్లో తనదైన నటనతో అలరించారు. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆనాటి అగ్ర కథానాయకులందరితోనూ అనేక పాత్రలు పోషించి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అనేక అవార్డులనూ అందుకున్నారు. కానీ, ఆమె జీవితం విషాదాంతం. అయితే సావిత్రికి బాగా దగ్గరిగా చూసినవాళ్లు మాత్రం ఆమెను ఎన్నటికీ మర్చిపోలేరు. సోమవారం(డిసెంబరు 6) ఆమె జయంతి ఈ సందర్భంగా సావిత్రి గురించి ఆసక్తికర విశేషాలు..

‘‘సావిత్రికి ఎడమ చేతివాటం. రాయడం, సంతకాలు చేయడం అన్నీ ఎడమ చేతితోనే చేసేవారు. ఆమె కారును అత్యంత వేగంగా నడిపేవారు. ‘నర్తనశాల’ (1963) చిత్రానికి ఆమె మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి రెండు వరకూ పనిచేసేవారు. కారుకి డ్రైవరున్నా కూడా ఆమే స్వయంగా నడుపుకొంటూ వచ్చేవారు. షూటింగ్‌ పూర్తయ్యే సరికి రాత్రి 2 గంటలు దాటిపోయేది. ఇంటికి ఒక్కరినే పంపడం ఎందుకని చిత్ర బృందం ఎవరినైనా సహాయంగా పంపేది. అయితే సావిత్రి పక్కన కూర్చొని ఆమె డ్రైవింగ్‌ను చూసేవాళ్లకి మాత్రం గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. భయంతో వణికిపోయేవారు. అంత వేగంగా ఆమె కారును నడిపేవారు. ‘రాత్రి, ట్రాఫిక్‌ ఉండదనా? ఇంత స్పీడుగా నడుపుతున్నారు?’ అని అడిగితే, ‘లేదు, అవకాశం ఉన్నప్పుడల్లా వేగంగానే నడుపుతాను’ అంటూ చిరు నవ్వుతో సమాధానం ఇచ్చేవారట. భరణి స్టూడియోలో షూటింగు జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి సావిత్రి ఇంటికి వెళ్లడానికి ప్రొడక్షన్‌ వారి కారుకి సుమారు 40 నిమిషాలు పట్టేది. అదే సావిత్రి 20 నిమిషాల్లో డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్లిపోయేవారు! అదీ ఆమె వేగం’’ అంటారు ఆమెను దగ్గరగా చూసినవాళ్లు.

ఆయన వద్దని చెప్పినా సావిత్రి వినలేదు!

ప్రముఖ నటి సావిత్రి(savitri) దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘చిన్నారి పాపలు’. దీనికి ఎలాగైనా ప్రముఖ రచయిత డి.వి.నరసరాజుతో మాటలు రాయించాలని ఆవిడ ప్రయత్నించారు. ఆ చిత్ర నిర్మాణంలో చాలామందికి వాటాలున్నాయని తెలుసుకున్న నరసరాజు ఆ చిత్రానికి పనిచేయడానికి నిరాకరించారట. అంతేకాదు - పదిమందిని వెంటబెట్టుకుని చిత్ర నిర్మాణం జోలికి పోవద్దని సావిత్రికి సలహా ఇచ్చారట. భాగస్వామ్యాలు తలనొప్పులు తెచ్చిపెడతాయనీ సావిత్రికి నరసరాజు ఎంతగానో బోధ పరచారట. కానీ, ఆవిడ వినకుండా వాటాదారులను నమ్ముకుని చిత్రనిర్మాణంలోకి దిగిపోయారు. కొంతభాగం పూర్తయిన తర్వాత సావిత్రికి తత్వం బోధపడింది. ఓ సారి నరసరాజు ఎదురైనప్పుడు ‘మీరు ఊహించిన ఇబ్బందులన్నీ నన్ను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి’ అంటూ భాగ స్వాముల అలకలు, అభ్యంతరాల గురించి చెప్పుకొన్నారట. చివరకు ‘చిన్నారి పాపలు’ చిత్రానికి సంబంధించిన ఆర్థిక వ్యవహారాలను సైతం తలకెత్తుకోవాల్సిరావడంతో సావిత్రి సొంత ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందట. ఆ తర్వాత కూడా చిత్ర నిర్మాణాలు ఆవిడకు కలిసి రాలేదు. తెలుగులో ‘వింత సంసారం’, ‘మూగమనసులు’ తమిళ వెర్షన్‌ ‘ప్రాప్తం’ సావిత్రిని ఇబ్బంది పెట్టాయి.

Read latest Cinema News and Telugu News

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని