Updated : 10 Aug 2022 16:07 IST

Kodi rama krishna: కోడి రామకృష్ణ తల‘కట్టు’ వెనుక రహస్యం ఇదే!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోడి రామకృష్ణ(Kodi Ramakrishna)..తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవసరం లేని పేరు. వంద సినిమాలు తీసిన అతి కొద్దిమంది తెలుగు దర్శకుల్లో ఆయనొకరు. సమాజంలో ప్రతి కోణాన్ని స్పృశించి సినిమా తీసి విజయం సాధించారాయన. కేవలం తెలుగే కాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలకూ సైతం దర్శకత్వం వహించారు. ఆయన చివరి చిత్రం ‘నాగాభరణం’ 2016లో విడుదలైంది. ఆయన సినిమాలే కాకుండా, ఆహార్యం కూడా ప్రేక్షకులను, అభిమానులను మెప్పించేది. మణికట్టు నిండా రక్షా తాళ్లు, వేళ్లకు ఉంగరాలతో పాటు, ఆయన నుదుటికి ఒక కట్టు కట్టేవారు. ఎక్కువగా తెల్లకట్టుతోనే ఆయన బయట ఫంక్షన్లు, షూటింగ్‌లలో కనిపించేవారు. అయితే దాని వెనుక ఉన్న రహస్యాన్ని ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో పంచుకున్నారు. అదేంటంటే..ఆయన రెండో చిత్రం ‘తరంగిణి’(1992) షూటింగ్‌లో ఉండగా సీనియర్‌ ఎన్టీయార్‌ మేకప్‌మ్యాన్‌ అయిన మోకా రామారావు మీ ‘నుదురు భాగం పెద్దగా ఉంది. ఎండ తాకకుండా నుదుటికి కట్టు కట్టండి’ అని ఆయనే ఒక తెల్ల కర్చీఫ్‌ ఒకటి కట్టారట. ఆ రోజంతా కోడి రామకృష్ణ షూటింగ్‌లో ఉత్సాహంగా పని చేశారట. ఆ మరుసటి రోజు కూడా బ్యాండ్‌ ఒకటి ప్రత్యేకంగా తయారుచేయించి ధరించారట. అది ధరించి ఉన్న సమయంలో ఒక పాజిటివ్‌ ఎనర్జీ వచ్చినట్లు గమనించిన ఆయన దానిని సెంటిమెంట్‌గా కొనసాగించారట. ఒకసారి దర్శక దిగ్గజం కె.బాలచందర్‌ కూడా ‘ఇది మీకు ప్రత్యేక గుర్తింపునిస్తుంది. మీ పూర్వ జన్మ బంధానికి సంకేతం. ఎప్పుడూ తీయకండి’ అని సలహా ఇచ్చారట. ఎప్పుడైనా కథ విషయంలో సందిగ్ధం ఏర్పడినపుడు, సమస్యలు వచ్చినపుడు నుదుటికి కట్టు కడితే వెంటనే పరిష్కారం దొరికేదని సన్నిహితులతో కోడి రామకృష్ణ అనేవారట. ఆయన సెంటిమెంటు ఎలా ఉన్న ఆ తల‘కట్టు’ మాత్రం ఆయన ఆహార్యానికి ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చింది. ఎక్కువగా ఆధ్యాత్మిక భావనలతో ఉండే కోడి రామకృష్ణ అమ్మోరు(1995), దేవి(1999), దేవుళ్లు(2000)లాంటి సినిమాలతోనూ విజయాలను సాధించారు. 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని