Sehari: పెళ్లికూతురు అక్కని ప్రేమిస్తే...

‘‘టైటిల్‌కు తగ్గట్లుగానే ‘సెహరి’ సినిమా ఒక పండగలా ఉంటుంది. ‘నువ్వునాకు నచ్చావ్‌’ తరహాలో ఆద్యంతం వినోదం పంచుతుంద’’న్నారు హర్ష్‌ కనుమిల్లి. ఆయన్ని హీరోగా పరిచయం చేస్తూ.. జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రమే ఈ ‘సెహరి’. అద్వయ జిష్ణురెడ్డి నిర్మించారు. సిమ్రాన్‌ చౌదరి కథానాయిక

Updated : 11 Feb 2022 09:43 IST

‘‘టైటిల్‌కు తగ్గట్లుగానే ‘సెహరి’ సినిమా ఒక పండగలా ఉంటుంది. ‘నువ్వునాకు నచ్చావ్‌’ తరహాలో ఆద్యంతం వినోదం పంచుతుంద’’న్నారు హర్ష్‌ కనుమిల్లి. ఆయన్ని హీరోగా పరిచయం చేస్తూ.. జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రమే ఈ ‘సెహరి’. అద్వయ జిష్ణురెడ్డి నిర్మించారు. సిమ్రాన్‌ చౌదరి కథానాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు హీరో హర్ష్‌. ఆ విశేషాలివి..

‘‘ఈ సినిమా ఏ స్థాయిలో ఉండనుందో ట్రైలర్‌తోనే స్పష్టంగా చూపించేశాం. వరుణ్‌ అనే ఓ అమాయక కుర్రాడు.. పెళ్లికూతురు అక్కని ప్రేమిస్తే ఏం జరిగింది? అన్నది ఈ చిత్ర కథాంశం. ఈ చిన్న పాయింట్‌ని ఆద్యంతం వినోదాత్మకంగా మలిచాం. ఒక పెళ్లికి వెళ్లినప్పుడు నా స్నేహితుడు ‘పెళ్లి కూతురు సోదరి అందంగా ఉంద’ని చెప్పాడు. ఆ సందర్భంలో పుట్టిన ఆలోచన నుంచే నేనీ కథ రాసుకున్నా. ఓ బాలీవుడ్‌ ఏగ్రేడ్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌కి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుందీ చిత్రం. అలాగని ఇది ఏ ఒక్క వర్గానికో పరిమితమ్యే చిత్రం కాదు. అన్ని వయసుల వారికి నచ్చేలా ఉంటుంది’’.
* ‘‘ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డా. స్వతహాగా నాకు కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌ అంటే ఇష్టం. అందుకే తొలి ప్రయత్నంగా ఈ తరహా కథాంశం ఎంచుకున్నా. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ఎంతో ప్రాధాన్యముంటుంది. సంగీత దర్శకుడు కోటికి ఈ చిత్రంలో బలమైన పాత్ర లభించింది. ఆయన నటన కొత్తగా ఉంటుంది. నాయిక సిమ్రాన్‌ నటనలో బెస్ట్‌ ఇచ్చింది. అభినవ్‌ గోమఠం కామెడీ ఫ్లేవర్‌తో ప్రేక్షకులు పూర్తిగా కనెక్ట్‌ అయిపోతారు. ప్రశాంత్‌ ఆర్‌.విహారి పాటలు అలరిస్తాయి.  ద్వితీయార్ధంలో సిమ్రాన్‌ తనదైన నటనతో కట్టిపడేస్తుంది. ఈ వాలెంటైన్స్‌డేకి సరిగ్గా సరిపోయే చిత్రమిది’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని