Fidaa: ‘ఫిదా’ కోసం మొదట మహేశ్‌ను సంప్రదించిన శేఖర్ కమ్ముల.. ఎందుకు చేయలేదంటే..!
శేఖర్ కమ్ముల ‘ఫిదా’ (Fidaa) కథను మొదట మహేశ్‌కు వినిపించారట. మహేశ్ (Mahesh Babu) స్థానంలోకి వరణ్ తేజ్ ఎలా వచ్చాడో ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
హైదరాబాద్: లవ్ స్టోరీలు తీయడంలో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) శైలి ప్రత్యేకమైనది. ఆయన తీసిన ప్రేమకథల్లో సూపర్ హిట్ అయిన సినిమా ‘ఫిదా’ (Fidaa). ఇందులోని డైలాగులు, పాటలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇప్పటికీ ప్రతి ఈవెంట్‌లలో ఈ పాటలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక సాయి పల్లవి, వరుణ్ తేజ్ (Varun Tej)ల నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే ఈ సినిమాలో మొదట మహేష్ బాబును హీరోగా అనుకున్నారట శేఖర్ కమ్ముల. మహేశ్ ప్లేస్‌లోకి వరుణ్ ఎలా వచ్చాడనే విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
‘‘నేను ప్రేమ కథలు రాసుకునే సమయంలోనే దానిపై నాకు పూర్తి నమ్మకం వస్తుంది. అలాంటి వాటిని నేను ప్రత్యేకంగా తెరకెక్కిస్తానని నా అభిప్రాయం. ‘గోదావరి’, ‘ఆనంద్’.. ఇలాంటి సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ‘ఫిదా’ కథను కూడా అంతే నమ్మకంతో రాసుకున్నాను. మొదట మహేష్ బాబుకు (Mahesh Babu) కథ వినిపించాను. ఆయనకు స్టోరీ చాలా నచ్చింది. బాగుందని కొన్ని మార్పులు చెప్పారు. అన్నీ ఓకే అనుకునే సమయానికి మహేశ్‌కు డేట్స్ కుదరలేదు. ఓ నటుడి కాల్‌షీట్స్ అతని చేతులో కూడా ఉండవు. అతను తీసిన సినిమాల ఆధారంగా డేట్స్ మారుతూ ఉంటాయి. అయితే మహేశ్ అప్పటికే స్టార్ హీరో కావడం వల్ల.. కొన్ని సినిమాలకు డేట్స్ ఇవ్వడం వల్ల ‘ఫిదా’లో చేయలేకపోయారు. కథ నచ్చినా చేయలేకపోతున్నానని చెప్పారు’’ అని శేఖర్ కమ్ముల తెలిపారు.
ఇక ‘ఫిదా’ రిలీజ్ అయినప్పుడు కూడా ఈ విషయం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. మహేశ్, దీపిక పదుకొణెలతో (Deepika Padukone) తీయాలనుకున్న సినిమాను వరుణ్ తేజ్, సాయి పల్లవిలతో (Sai Pallavi) తీశారని అనుకున్నారు. విడుదలయ్యాక వీళ్లిద్దరూ కథకు పర్‌ఫెక్ట్‌గా సరిపోయారంటూ ప్రేక్షకులంతా ప్రశంసలు కురిపించారు. వీళ్ల జంటకు సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.