Sekhar Movie: వాళ్లే ‘శేఖర్‌’ సినిమాను చంపేశారు: నిర్మాత సుధాకర్‌రెడ్డి

రాజశేఖర్‌ కథానాయకుడిగా తాను నిర్మించిన ‘శేఖర్‌’ సినిమాను ఆపేసి అన్యాయం చేశారని ఆ చిత్ర నిర్మాత సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 24 May 2022 13:17 IST

హైదరాబాద్‌: రాజశేఖర్‌ కథానాయకుడిగా తాను నిర్మించిన ‘శేఖర్‌’ సినిమాను ఆపేసి అన్యాయం చేశారని ఆ చిత్ర నిర్మాత సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాలో శివానీ, శివాత్మక పేర్లు మాత్రమే ఉన్నాయని.. వారు నిర్మాతలు కాదని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సుధాకర్‌రెడ్డి మాట్లాడారు.

‘‘డిజిటల్‌ ప్రొవైడర్లు ఆపేయడం వల్లే ‘శేఖర్‌’ సినిమా ఆగిపోయింది. సినిమా ఆపేయాలని కోర్టు ఎక్కడా చెప్పలేదు. డిజిటల్‌ ప్రొవైడర్లకు డబ్బు కట్టి ఒప్పందం చేసుకున్నా. వాళ్లు ‘శేఖర్‌’ సినిమాను చంపేశారు. నేను ఏడెనిమిది సినిమాలకు నిర్మాతగా పనిచేశాను. ఏ సినిమాకీ ఇలాంటి పరిస్థితి లేదు. డిజిటల్‌ ప్రొవైడర్లు క్యూబ్‌, యూఎఫ్‌వోలపై న్యాయపోరాటం చేస్తా. రేపు కోర్టు తీర్పు వచ్చాక ఫైనాన్షియర్‌ పరంధామరెడ్డిపై పరువు నష్టం దావా వేస్తాం. నాకు కలిగిన నష్టాన్ని పరంధామరెడ్డి ఇస్తారా? డిజిటల్‌ ప్రొవైడర్లు ఇస్తారా? జీవితా రాజశేఖర్‌ వల్ల నాకు ఎలాంటి నష్టం కలగలేదు. సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ నా పేరు మీదే ఉంది.’’ అని సుధాకర్‌రెడ్డి చెప్పారు.

‘‘సినిమా సరిగా తీయకపోతే దర్శకురాలైన జీవితా రాజశేఖర్‌ను నేను ప్రశ్నిస్తా. కానీ, ఇక్కడ సమస్య అది కాదు. సినిమా పూర్తయిన తర్వాత వాళ్ల మీద కోపం పెట్టుకుని నా సినిమా ఆపారు. ‘శేఖర్‌’కోసం రూ.15కోట్లు పెట్టుబడిగా పెట్టా. ఈ సినిమా ఆపమని కోర్టును ఆశ్రయించిన వారిని కూడా కలుస్తా. సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత ఆపడం వల్ల ఎక్కువ నష్టపోయింది నేనే. ఈ విషయాన్ని సినిమా పెద్దల దృష్టికి తీసుకెళ్లా. ఇది రాజశేఖర్‌ సినిమా అని అంటున్నారు. కానీ, ఆయన నటించారంతే. జీవిత దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిర్మాణ విషయంలో వాళ్లకు సంబంధం లేదు. సినిమాకు పెట్టుబడి పెట్టింది నేనే. ఈ సినిమా టైటిల్‌ దగ్గరి నుంచి అన్నీ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉన్నాయి. అలాంటి వ్యక్తి జీవితను నమ్మి ఎలా ఫైనాన్స్‌ చేస్తారు. పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చూసి ఎలా డబ్బులు ఇస్తారు. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయి. ‘శేఖర్‌’ సినిమా కలెక్షన్లను ఒక అకౌంట్‌  ఓపెన్‌ చేసి డిపాజిట్‌ చేయమని చెప్పారు. అసలు ఈ కేసులో నాకు సంబంధమే లేదు. అలాంటప్పుడు నేనెందుకు చేస్తా. ఇది కోర్టు ధిక్కారం ఏమీ కాదు’’అని సుధాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు