
Sekhar Review: రివ్యూ: శేఖర్
చిత్రం: శేఖర్; నటీనటులు: రాజశేఖర్, ఆత్మీయ రాజన్, ముస్కాన్, శివాని రాజశేఖర్, అభినవ్ గోమఠం, కన్నడ కిషోర్, సమీర్, భరణి శంకర్, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు; సంగీతం: అనూప్ రూబెన్స్; కూర్పు: రవితేజ గిరిజాల; ఛాయాగ్రహణం: మల్లికార్జున్ నరగని; నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం; దర్శకత్వం: జీవిత రాజశేఖర్; విడుదల తేదీ: 20-05-2022
వేసవి సినీ మారథాన్ ముగింపుకొచ్చింది. ఇన్నాళ్లూ పాన్ ఇండియా చిత్రాలతో బాక్సాఫీస్ హోరెత్తింది. ఇప్పుడు మీడియం రేంజ్ బడ్జెట్ చిత్రాల సందడి షురూ అయింది. అలా ఈ వారం బాక్సాఫీస్ బరిలో దూకిన సినిమా ‘శేఖర్’. గరుడవేగ, కల్కి వంటి విజయాల తర్వాత రాజశేఖర్ నుంచి వచ్చిన చిత్రమిది. మలయాళంలో విజయవంతమైన ‘జోసెఫ్’కు రీమేక్‌గా రూపొందింది. రాజశేఖర్ సతీమణి జీవిత ఈ సినిమాని స్వయంగా తెరకెక్కించడం, వారి పెద్ద కుమార్తె శివాని కీలక పాత్రలో నటించడంతో అందరి దృష్టి దీనిపై పడింది. మరి ఆ అంచనాలను ‘శేఖర్’ అందుకున్నాడా? రాజశేఖర్ ఖాతాలో మరో విజయం చేరిందా?
కథేంటంటే: శేఖర్ (రాజశేఖర్) రిటైర్డ్ పోలీస్ అధికారి. హత్య కేసుల్ని ఛేదించడంలో నిపుణుడు. క్రైమ్ సీన్‌ను చూసి.. నేరస్థుడెవరో ఇట్టే కనిపెట్టగల మాస్టర్. అందుకే క్లిష్టమైన మర్డర్ కేసులు ఎదురైన ప్రతిసారీ శేఖర్ సహాయాన్నే కోరుతుంటారు పోలీసులు. అయితే శేఖర్ వ్యక్తిగత జీవితం విషాదభరితం. మాజీ భార్య ఇందు (ఆత్మీయ రాజన్), కూతురు గీత (శివానీ), ప్రేయసి కిన్నెర (ముస్కాన్) జ్ఞాపకాలు అతన్ని వెంటాడుతుంటాయి. ఇందు రోడ్డు ప్రమాదంలో మరణిస్తుంది. అందరూ అలాగే అనుకుంటారు. అయితే ఘటనా స్థలంలో కనిపించిన ఆధారాల్ని బట్టి ఆమెని ఎవరో హత్య చేశారని శేఖర్ గుర్తిస్తాడు. మరి ఆ హత్య చేసిందెవరు? దాని వెనకున్న కారణాలేంటి? నేరస్థుల్ని పట్టుకోవడానికి శేఖర్ ఏం చేశాడు? ప్రేయసి కిన్నెర, కూతురు గీత ఏమయ్యారు? అన్నవి తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా సాగిందంటే: రసవత్తరమైన థ్రిల్లర్ చిత్రాలకు చిరునామాగా నిలుస్తోంది మలయాళ చిత్రసీమ. ఏ భాషలో లేని విధంగా ఏటా బోలెడన్ని థ్రిల్లర్లు మలయాళం నుంచే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో వస్తున్న థ్రిల్లర్స్‌లో దాదాపు సగానికి పైగా.. మాలీవుడ్ రీమేక్‌లే. ‘శేఖర్’ కూడా ఆ సీమ నుంచి అరువు తెచ్చుకున్న కథే. 2018లో విడుదలై విజయవంతమైన ‘జోసెఫ్’కు రీమేక్‌గా రూపొందింది. మాతృకతో పోల్చితే తెలుగులో నేటివిటీకి తగ్గట్లుగా చిన్న చిన్న మార్పులు చేసినా.. కథ మొత్తం యథాతథంగా చూపించే ప్రయత్నం చేశారు. ఓ వృద్ధ జంట హత్యకు గురి కావడం.. ఆ కేసును ఛేదించేందుకు పోలీసులు శేఖర్ సహాయం కోరడం.. అతను రంగంలోకి దిగి తన తెలివితేటలతో నిమిషాల వ్యవధిలో నేరస్థుల్ని కనిపెట్టడం వంటి సన్నివేశాలతో ఆరంభం చకచకా సాగిపోతుంది. ఆ వెంటనే శేఖర్ ఫ్లాష్ బ్యాక్‌ను ప్రారంభించి.. అతని వ్యక్తిగత జీవితంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దర్శకురాలు జీవిత.
కానీ, అక్కడి నుంచి మొదలయ్యే శేఖర్ - కిన్నెరల ప్రేమ కథ మరీ రోటీన్‌గా అనిపిస్తుంది. ఇందుతో వైవాహిక జీవితానికి సంబంధించిన ఎపిసోడ్లు సైతం చప్పగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. థ్రిల్లర్ సినిమా చూస్తున్నామా? రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చూస్తున్నామా? అన్న అనుమానాలు రేకెత్తిస్తాయి. తండ్రీకూతుళ్ల అనుబంధాల నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అక్కడక్కడా గుండెల్ని హత్తుకుంటాయి. ఇక విరామానికి ముందు ఇందు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం.. అది ప్రమాదం కాదు హత్య అని శేఖర్ కనిపెట్టడంతో ద్వితీయార్ధంలో ఏం జరగబోతుందా? అని ఆసక్తి పెరుగుతుంది. ద్వితీయార్థం ఆరంభం నుంచే కథలో వేగం పెరుగుతుంది. ఇందు హత్య కేసును ఛేదించే క్రమంలో శేఖర్ వేసే ఎత్తుగడలు అక్కడక్కడా కాస్త రొటీన్‌గా అనిపించినా ఆద్యంతం ఉత్కంఠ భరితంగానే సాగుతాయి. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలను.. జీవన్‌దాన్ వ్యవస్థ ద్వారా వైద్య రంగంలోకి కొందరు వ్యక్తులు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పిన తీరు మెప్పిస్తుంది. పతాక సన్నివేశాలు గుండెల్ని బరువెక్కిస్తాయి.
ఎవరెలా చేశారంటే: శేఖర్ పాత్రలో రాజశేఖర్ చక్కగా ఒదిగిపోయారు. వయసు పైబడిన వ్యక్తిలా ఆయన కనిపించిన తీరు.. పలికించిన హవభావాలు చాలా బాగున్నాయి. ఈ చిత్రానికి అన్నీ తానై ముందుకు నడిపించారు. ఆత్మీయ రాజన్, ముస్కాన్, శివాని, అభినవ్ గోమఠం తదితరులు తమ పాత్ర పరిధుల మేర నటించారు. థ్రిల్లర్ సినిమాల్లో కథ బాగుండాలి. ట్విస్టులు ఉక్కిరి బిక్కిరి చేయాలి. వీటన్నింటితో పాట కథనం చకచకా పరుగులు తీయాలి. అప్పుడే ఓ ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ చూసిన అనుభూతి కలుగుతుంది. శేఖర్‌లో కథనం, ట్విస్ట్‌లు చక్కగా కుదిరినా.. సినిమా మాత్రం చాలా నెమ్మదిగా నత్తనడకన సాగినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధమార్ధంలో వచ్చే రొటీన్ ప్రేమకథ, ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయి. అనూప్ రూబెన్స్ స్వరపరిచిన పాటలు వినసొంపుగా ఉన్నా.. వెంట వెంటనే రావడం వల్ల కథకు అడ్డు తగిలినట్లుగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం ఆద్యంతం మెప్పిస్తుంది. మల్లికార్జున్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. అరకు అందాల్ని తన కెమెరాలో చక్కగా ఒడిసిపట్టారు. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి.
బలాలు
+ రాజశేఖర్ నటన.. ఆయన లుక్స్
+ కథా నేపథ్యం
+ ద్వితీయార్ధం
బలహీనతలు
- రొటీన్ ప్రేమకథ, ఫ్యామిలీ డ్రామా
- నెమ్మదిగా సాగే కథనం
చివరిగా: థ్రిల్లర్ ప్రియులను మెప్పించే ‘శేఖర్’
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Maruthi: ఆ చిత్రానికి సీక్వెల్ తప్పకుండా చేస్తా: మారుతి
-
Politics News
Revanth Reddy: కేసీఆర్.. నయా భూస్వాములను తయారు చేస్తున్నారు: రేవంత్‌రెడ్డి
-
India News
Booster Dose: బూస్టర్ డోసు వ్యవధి ఇక 6 నెలలే
-
Sports News
IND VS WI: వెస్టిండీస్‌తో వన్డేలకు భారత జట్టు ఇదే
-
World News
North Korea: దక్షిణ కొరియాను మరోసారి ఇబ్బంది పెట్టిన ఉత్తర కొరియా
-
Politics News
Andhra News: అధికార పార్టీ అయినా... నెల్లూరు జిల్లాలో ఆ ఎమ్మెల్యే తీరే వేరు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Andhra News: మేకప్ వేసి.. మోసం చేసి.. ముగ్గురిని వివాహమాడి..
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- Gas Cylinder: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- Gautham Raju: ప్రముఖ సినీ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత
- Online Food delivery: ఆన్లైన్ Vs ఆఫ్‌లైన్: ఫుడ్ డెలివరీ దోపిడీని బయటపెట్టిన యూజర్.. పోస్ట్ వైరల్!
- RRR: ‘ఆర్ఆర్ఆర్.. గే లవ్ స్టోరీ’.. రసూల్ కామెంట్‌పై శోభు యార్లగడ్డ ఫైర్
- Health : పొంచి ఉన్న ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు!
- IND vs ENG: టీమ్ఇండియా ఓటమిపై రాహుల్ ద్రవిడ్ ఏమన్నాడంటే?
- ప్రముఖ వాస్తు నిపుణుడి దారుణ హత్య.. శరీరంపై 39 కత్తిపోట్లు
- Paid trip to employees: ఉద్యోగులందరికీ 2 వారాల ట్రిప్.. ఖర్చులన్నీ కంపెనీవే!