Arjun: ఇది వృత్తిపట్ల నిబద్ధత లేకపోవడమే

విష్వక్‌ సేన్‌తో తాను సినిమా చేయడం లేదని ప్రకటించారు నటుడు, దర్శక నిర్మాత అర్జున్‌. అతను వృత్తిపట్ల నిబద్ధత లేకుండా వ్యవహరించడం వల్లే తానీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Updated : 06 Nov 2022 07:05 IST

విష్వక్‌తో సినిమా చేయడం లేదు
నటుడు, దర్శక నిర్మాత అర్జున్‌

విష్వక్‌ సేన్‌తో (Vishwak Sen) తాను సినిమా చేయడం లేదని ప్రకటించారు నటుడు, దర్శక నిర్మాత అర్జున్‌ (Arjun). అతను వృత్తిపట్ల నిబద్ధత లేకుండా వ్యవహరించడం వల్లే తానీ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆయన దర్శకత్వంలో ఇటీవల విష్వక్‌ సేన్‌, ఐశ్వర్య సర్జా జంటగా ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈనెల 3న చిత్రీకరణ ప్రారంభం కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో నిలిపి వేయాల్సి వచ్చిందని అర్జున్‌ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి  కథానాయకుడు విష్వక్‌ కారణమని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు శనివారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు అర్జున్‌. ‘‘నా 42ఏళ్ల సినీ కెరీర్‌లో ఇలా ఎప్పుడూ ఎవరి గురించి మాట్లాడలేదు. కానీ, విష్వక్‌ చేసిన పనికి బాధ కలిగి నా  ఆవేదనను పంచుకుంటున్నా. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభం కావాల్సిన మా సినిమా అతని వల్లే ఆలస్యమైంది. ఈనెల 3న కొత్త షెడ్యూల్‌ ప్రారంభించేందుకు ఆయన సరే అనడంతో.. రాత్రింబవళ్లూ కష్టపడి సెట్‌ సిద్ధం చేశాం. కానీ, ఆరోజు ఉదయం 4గంటలకు విష్వక్‌ నుంచి చిత్రీకరణ రద్దు చేయమనే సందేశం వచ్చింది. అది చూసే సరికి నాకేం అర్థం కాలేదు. వృతిపట్ల ఇంత నిబద్ధత లేకుండా ఉంటారా? ఒక నిర్మాత, దర్శకుడు అంటే అతనికి మర్యాద లేదా? ఇండస్ట్రీలో  బాలకృష్ణ, వెంకటేష్‌, చిరంజీవి.. ఇలా ఎంతో నిబద్ధత కలిగిన నటుల్ని చూశా. ఈతరం హీరో అల్లు అర్జున్‌తోనూ కలిసి పనిచేశా. షూటింగ్‌ అంటే సమయానికి వచ్చేస్తారు. కానీ, ఈ నటుడు మాత్రం ‘రేపు చిత్రీకరణ నిలిపేయండి’ అని సందేశాలు పెడతాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతనితో నేను సినిమా చేయాలనుకోవడం లేదు. హీరోగా అతను కొన్ని సూచనలు చెయ్యొచ్చు తప్పులేదు. కానీ, సాయిమాధవ్‌ బుర్రా సంభాషణలు, చంద్రబోస్‌ పాటలు, అనూప్‌ రూబెన్స్‌ సంగీతం.. ఇలా పలు విషయాలకు వంక పెట్టాడు. అతనికి చాలాసార్లు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఇలాంటివి అందరికీ తెలియాలి. బయటకు మాట్లాడలేని నిర్మాతలుంటారు. నాకు ధైర్యం, శక్తి ఉన్నాయి. అందుకే ఇలా చెబుతున్నా. పరిశ్రమలో పద్ధతులు తెలియకపోతే   సినిమాలు చేయకండి. ఈ విషయంపై ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ సభ్యులతో మాట్లాడతా. మరొకరికి ఇలా జరగకుండా చూడమని మాత్రమే చెబుతా. దీన్ని వివాదం చేయాలనుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు అర్జున్‌. ఈ సినిమాని త్వరలో మరో నటుడితో మళ్లీ మొదలు    పెడతానని ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు