అద్దె ఇంట్లో ఉంటున్నాం.. దయచేసి సాయం చేయండంటోన్న సీనియర్‌ నటుడి కుమారుడు

సీనియర్‌ నటుడు కాంతారావు కుమారుడు తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి సాయం చేయమని కోరారు.

Updated : 17 Nov 2022 10:40 IST

హైదరాబాద్‌: తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో ఏళ్ల పాటు సేవలందించి దిగ్గజ నటుడిగా పేరు తెచ్చుకున్నారు కాంతారావు (Kantha Rao). ఇటీవల ఆయన కుమారుడు రాజా తెలంగాణ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, అద్దె ఇంట్లో జీవిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన కాంతారావు శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన.. ‘‘నా తండ్రి శత జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. సినీ పరిశ్రమ అంటే నాన్నకు ఎంతో ఇష్టం. ఆస్తులు అమ్ముకుని మరీ ఆయన సినిమాలు తీశారు. దానివల్ల మేము ఆర్థికంగా దెబ్బతిన్నాం. అలాగే, ఆయన క్యాన్సర్‌ బారిన పడినప్పుడు చికిత్స నిమిత్తం ఎంతో డబ్బు ఖర్చు చేశాం. ప్రస్తుతం నేను ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటున్నా. నగర శివార్లలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని జీవిస్తున్నాం. ఇండస్ట్రీ నుంచి మాకెలాంటి సాయం అందలేదు. తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒక్కటే.. మాకు ఇల్లు కేటాయించి సాయం చేయాలి’’ అని పేర్కొన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని